WhatsApp Plus : ప్రీమియం బాటలో మెటా! 'వాట్సాప్ ప్లస్'లో ఆ ఫీచర్లకు డబ్బులు కట్టాల్సిందే..
WhatsAppp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్త ప్రీమియం సేవలను అందుబాటులోకి తెస్తోంది! ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లను ఇచ్చి, వాటిని వాడుకోవాలంటే ఇకపై నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది. 'వాట్సాప్ ప్లస్' పేరుతో మెటా ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను పరీక్షిస్తోంది.
WhatsApp plus premium features : వాట్సాప్ తన యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత పర్సనలైజ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీని కోసం 'వాట్సాప్ ప్లస్' అనే ప్రీమియం ఆప్షనల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఐఓఎస్ వినియోగదారులకు కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ వాట్సాప్ ప్లస్ ఫీచర్స్, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..

వాట్సాప్ ప్లస్‌లో లభించే కొత్త ఫీచర్లు ఇవే:
ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకునే యూజర్లకు సాధారణ వినియోగదారుల కంటే భిన్నమైన ఫీచర్లు లభిస్తాయి.
మరిన్ని పిన్డ్ చాట్స్ : ప్రస్తుతం వాట్సాప్‌లో మనం కేవలం 3 ముఖ్యమైన చాట్‌లను మాత్రమే పిన్ చేసుకోగలం. వాట్సాప్ ప్లస్ యూజర్లు ఏకంగా 20 చాట్‌ల వరకు పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కస్టమ్ యాప్ ఐకాన్స్: వాట్సాప్ లోగోను మీకు నచ్చిన రంగులో లేదా డిజైన్‌లో మార్చుకోవచ్చు. దీని కోసం 14 కొత్త ఐకాన్ ఆప్షన్లను వాట్సాప్ ఇస్తోంది.
కొత్త చాట్ థీమ్స్: చాటింగ్ బ్యాక్‌గ్రౌండ్, బబుల్ కలర్స్ మార్చుకోవడానికి 18 రకాల సరికొత్త కలర్ ఆప్షన్లు (వైబ్రెంట్ బ్లూ, రాయల్ పర్పుల్, ఫారెస్ట్ గ్రీన్ వంటివి) అందుబాటులో ఉంటాయి.
ఎక్స్‌క్లూజివ్ రింగ్‌టోన్స్: ఇన్‌కమింగ్ కాల్స్ కోసం 10 రకాల ప్రత్యేకమైన రింగ్‌టోన్స్‌ను ప్రీమియం యూజర్లకు మాత్రమే కేటాయించారు.
ప్రీమియం స్టిక్కర్స్: స్క్రీన్ మొత్తం కనిపించేలా ఉండే యానిమేటెడ్ స్టిక్కర్లు ఈ ప్లాన్‌లో ఉంటాయి. మీరు పంపే స్టిక్కర్లు అవతలి వ్యక్తికి (సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా) కనిపిస్తాయి.
బల్క్ అప్‌గ్రేడ్స్: మీ చాట్ లిస్ట్‌లోని అన్ని కాంటాక్ట్స్‌కు ఒకేసారి థీమ్స్ లేదా రింగ్‌టోన్స్‌ను అప్లై చేసే సౌకర్యం ఉంటుంది.

ఏ మార్పులు ఉండవు?
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వచ్చినప్పటికీ, వాట్సాప్ లోని ప్రైవసీ, మెసేజింగ్ ఫీచర్లు ఉచితంగానే కొనసాగుతాయి.
- ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ యధావిధిగా ఉంటుంది.
- వాయిస్, వీడియో కాల్స్ కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
- ముఖ్యంగా, స్టేటస్ విభాగంలో వచ్చే ప్రకటనలు మాత్రం ప్రీమియం ప్లాన్ తీసుకున్నా తగ్గవని సమాచారం.
వాట్సాప్ ప్లస్ ధర ఎంత ఉండవచ్చు?
మెటా ఇంకా అధికారిక ధరలను ప్రకటించలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లలోని ధరల ఆధారంగా చూస్తే ఇది తక్కువ ధరలోనే ఉండే అవకాశం ఉంది:
యూరప్: సుమారు 2.49 పౌండ్లు (దాదాపు రూ. 220)
పాకిస్థాన్: 229 రూపాయలు (పీకేఆర్)
భారత్: భారత్‌లో దీని ధర నెలకు రూ. 100 నుంచి రూ. 200 మధ్య ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం కొంతమంది ఎంపిక చేసిన బీటా యూజర్లకు ఒక నెల పాటు ఉచిత ట్రయల్ కూడా ఇస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ అందరికీ తప్పనిసరి అవుతుందా?
లేదు, ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. అదనపు ఫీచర్లు, థీమ్స్ కావాలనుకునే వారు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ వాట్సాప్ సేవలు యధావిధిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
2. వాట్సాప్ బిజినెస్ యూజర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుందా?
ప్రస్తుతానికి ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కేవలం వ్యక్తిగత వాట్సాప్ వినియోగదారులకు మాత్రమే. వాట్సాప్ బిజినెస్ కోసం వేరే ప్రీమియం సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
3. సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే స్టేటస్‌లో యాడ్స్ రావా?
లేదు, వాట్సాప్ ప్లస్ తీసుకున్నప్పటికీ స్టేటస్ సెక్షన్‌లో వచ్చే యాడ్స్ కొనసాగుతాయని నివేదికలు చెబుతున్నాయి. దీనిపై మెటా నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


