CBSE revaluation 2026 : సీబీఎస్​ఈ 12వ తరగతి రీ-ఇవాల్యుయేషన్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి?

CBSE class 12 results 2026 : సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఇవాల్యుయేషన్ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావడంతో, ఫలితాల ఆలస్యం తమ ఐఐటీ, ఎన్‌ఐటీ సీట్లపై ఎక్కడ దెబ్బతీస్తుందోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

Published on: Jun 5, 2026, 05:26:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

CBSE Re- evaluation 2026 updates : సీబీఎస్ఈ 12వ తరగతి రీ-ఇవాల్యుయేషన్ (మార్కుల పునర్మూల్యాంకనం) ప్రక్రియ కొనసాగుతుండటంతో, అప్డేటెడ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రతిష్టాత్మక జాతీయ ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే, ఈ విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (జోసా 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి!

సీబీఎస్​ఈ రీ- ఇవాల్యుయేషన్ ఫలితాలు ఎప్పుడు?
సీబీఎస్​ఈ రీ- ఇవాల్యుయేషన్ ఫలితాలు ఎప్పుడు?

జోసా పోర్టల్ ద్వారా వివిధ అకాడమిక్ కోర్సుల కోసం అభ్యర్థుల రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల (ఛాయిస్ ఫిల్లింగ్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలనుకునే అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఈ జోసా 2026 రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తిగా తప్పనిసరి. అయితే, ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు..

సీబీఎస్ఈ క్లాస్ 12 అప్డేటెడ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ అడ్మిషన్ల రేసులో వెనుకబడిపోకుండా చూసేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. జేఈఈ అడ్వాన్స్‌డ్, సీయూఈటీ వంటి కీలక ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ల షెడ్యూల్‌తో సీబీఎస్ఈ రీ-ఇవాల్యుయేషన్ ప్రక్రియను అనుసంధానించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల రీ-ఇవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కూడా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని, సవరించిన ఫలితాలు వచ్చిన తర్వాత వారు తమ అప్డేటెడ్ అకాడమిక్ పత్రాలను సమర్పించవచ్చని భావిస్తున్నారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో దరఖాస్తులు రావడం గమనార్హం.

"ఈ సంవత్సరం విద్యార్థుల నుంచి దాదాపు 12 లక్షల స్కాన్ చేసిన జవాబు పత్రాల (ఆన్సర్ షీట్స్) కాపీల కోసం అభ్యర్థనలు వచ్చాయి. అలాగే, సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు మార్కుల వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు," అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై విద్యార్థుల్లో వ్యక్తమైన అభ్యంతరాలు, ఆందోళనల వల్లే ఈసారి రీ-ఇవాల్యుయేషన్ కోరుకున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సాంకేతిక సమస్యలు.. విద్యార్థుల ఆందోళనలు..

మార్కుల మూల్యాంకన విధానంపై, అప్డేటెడ్ క్లాస్ 12 ఫలితాలు ఆలస్యం కావడం వల్ల తమ ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయోనని పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌లోని లోపాల వల్లే తమకు 12వ తరగతిలో ఆశించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని కొందరు విద్యార్థులు వాపోతున్నారు.

మరికొందరు విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెరిఫికేషన్. రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్స్ ఉపయోగించే సమయంలో లాగిన్ సమస్యలు, సాంకేతిక లోపాలు (టెక్నికల్ గ్లిచెస్) ఎదురయ్యాయని వారు పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మొదలైపోవడంతో, ఈ రీ-ఇవాల్యుయేషన్ ఫలితాలు మరింత ఆలస్యమైతే తమకు దక్కాల్సిన సీటు చేజారిపోతుందేమోనన్న భయం విద్యార్థుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

రీ-ఇవాల్యుయేషన్ ఫలితాలు ఎప్పుడు రావచ్చు?

సవరించిన క్లాస్ 12 ఫలితాల విడుదలకు సంబంధించి సీబీఎస్ఈ బోర్డు ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే, దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండటం, రీ-ఇవాల్యుయేషన్ షెడ్యూల్‌లో ఇప్పటికే కొంత ఆలస్యం జరగడాన్ని బట్టి చూస్తే, అప్డేటెడ్ స్కోర్‌కార్డులు జూన్ రెండో వారంలో లేదా జూన్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బోర్డు ప్రస్తుతం వెరిఫికేషన్, రీ-ఇవాల్యుయేషన్ దరఖాస్తులను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ ముగిసే వేగాన్ని బట్టే తుది ఫలితాల తేదీ ఆధారపడి ఉంటుంది.

జోసా కౌన్సెలింగ్‌పై దీని ప్రభావం ఎంత?

ఐఐటీలు, ఎన్‌ఐటీలలో ప్రవేశాల కోసం జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం నడుస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి, 12వ తరగతిలో కనీసం 75 శాతం మొత్తం మార్కులు (అగ్రిగేట్) సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అర్హులు.

అయితే, ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పాస్ అయ్యి కూడా, కేవలం కొద్ది మార్కుల తేడాతో బోర్డు పరీక్షల్లో 75 శాతం అర్హత మార్కులను కోల్పోయిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. రీ-ఇవాల్యుయేషన్‌లో మార్కులు పెరిగితే తాము అడ్మిషన్‌కు అర్హత సాధిస్తామని ఇలాంటి అభ్యర్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జోసా 2026 కౌన్సెలింగ్‌లో అకాడమిక్ కోర్సుల రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ గడువు జూన్ 11తో ముగియనుంది. ఈ లోపే తమ ఫలితాలు వస్తే బాగుండని రీ-ఇవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More