Loan affordability check : ఈఎంఐ ఎప్పుడు భారమవుతుంది? జీతంలో ఎంత శాతం లోన్లు ఉండాలి?
తక్కువ వాయిదా అని ఆశపడి వరుసగా లోన్లు తీసుకుంటున్నారా? మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐల వాటా ఎంత ఉండాలో తెలిపే '30 శాతం నియమం', ఆర్థిక నిపుణుల విలువైన సలహాలు ఇవే..
సులభంగా లభించే రుణాలు, క్రెడిట్ లైన్ ఆఫర్లు నేడు ప్రతి ఇంటా సాధారణమైపోయాయి. ఇల్లు, కారు, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ నుంచి విహారయాత్రల వరకు ప్రతిదానికీ నేటి తరం ఈఎంఐ మార్గాన్నే ఎంచుకుంటోంది. పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, నెల నెలా చిన్న వాయిదాల రూపంలో కట్టే సౌలభ్యం ఉండటంతో వినియోగదారులు సులువుగా లోన్లకు ఆకర్షితులవుతున్నారు.

అయితే కేవలం నెలవారీ వాయిదా చిన్నదిగా కనిపిస్తోందని ఒక వస్తువును కొనుగోలు చేయడం ఆర్థికంగా తీవ్ర నష్టాలకు దారితీస్తుందని ఫైనాన్షియల్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా చూసినప్పుడు చిన్నదిగా కనిపించే ఈఎంఐ, మీ మొత్తం నెలవారీ బడ్జెట్‌తో పోల్చినప్పుడు పెద్ద భారంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఆర్థిక స్వయంప్రతిపత్తికి అసలైన పరీక్ష..
ఈఎంఐ నిజంగా మీకు అందుబాటులో ఉందో లేదో తెలిపే అసలైన సూత్రం ఏంటంటే.. ఆ వాయిదా చెల్లించిన తర్వాత మీ కుటుంబ అత్యవసరాలు, ఇతర నిత్యవసర ఖర్చులకు తగినంత మిగులు ఉందో లేదో చూసుకోవడమే.
ఈ అంశంపై 'ఛాయిస్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్' సీఈఓ విజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. "కుటుంబానికి అవసరమైన ఇతర ఖర్చులకు తావులేకుండా చేసే క్షణమే ఒక ఈఎంఐ భారంగా మారుతుంది. కాగితంపై కనిపించే చిన్న వాయిదా ముఖ్యం కాదు; స్థిరమైన రాబడితో పోల్చినప్పుడు మీ మొత్తం నెలవారీ అప్పుల బాధ్యత ఎంత ఉందనేదే అసలైన లెక్క. మొదటి రుణాన్ని తీర్చేందుకు రెండోది లేదా మూడోది తీసుకున్నప్పుడే ఆర్థిక ఒత్తిడి నిశ్శబ్దంగా పెరుగుతుంది. డిఫాల్ట్ అయ్యాక తెలుసుకోవడం కంటే, రుణం మంజూరు చేసే సమయంలోనే ఈ పూర్తి చిత్రాన్ని నిజాయితీగా అంచనా వేయడం రుణదాతలుగా మా బాధ్యత," అని స్పష్టం చేశారు.
30 శాతం నియమం..
అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు ఆర్థిక నిపుణులు '30 శాతం నిబంధన'ను పాటించాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత రుణాలు, హోమ్ లోన్, కార్ లోన్, క్రెడిట్ కార్డ్ బకాయిలు సహా అన్ని రకాల ఈఎంఐల మొత్తం మీ నికర నెలవారీ ఆదాయంలో 30 శాతానికి మించకూడదు.
ఉదాహరణకు, మీ నెలవారీ ఆదాయం రూ. 50,000 అనుకుంటే, మీ అన్ని ఈఎంఐల మొత్తం రూ. 12,000 నుంచి గరిష్టంగా రూ. 15,000 మధ్యలోనే ఉండాలి.
యుధాజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు యుధాజిత్ బాల్ ఈ నియమాన్ని వివరిస్తూ.. "వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో ఆదాయాన్ని స్థిర ఖర్చులు, మారే ఖర్చులు, పొదుపు అనే భాగాలుగా విభజించాలి. స్థిర ఖర్చుల్లో ఈఎంఐలు ప్రధానమైనవి. ఇతర అవసరాలు, ముఖ్యంగా పొదుపుతో సమతుల్యత పాటించాలంటే ఈఎంఐలు నికర రాబడిలో 30 శాతం లోపే ఉండాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పొదుపు రేటు తగ్గుతున్న నేటి రోజుల్లో, ఈ 30 శాతం పరిమితి దాటకపోవడం చాలా ముఖ్యం," అని వివరించారు.
చిన్న పొరపాటు.. పెద్ద ప్రమాదం
30 శాతం మినహాయింపు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు; అది ఆకస్మిక ఆర్థిక సంక్షోభాల నుంచి మిమ్మల్ని కాపాడే ఒక రక్షణ కవచం. ఆదాయంలో ఎక్కువ భాగం ఈఎంఐలకే పోతుంటే, అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, భవిష్యత్తు పెట్టుబడులకు నిధులు కరువవుతాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు తీసుకునే దుస్థితి వస్తే, అది మిమ్మల్ని శాశ్వత రుణగ్రస్తులుగా మార్చేస్తుంది.
అప్పు తీసుకోవడం అంటే నేటి కొనుగోలును సాకారం చేసుకోవడం మాత్రమే కాదు; రాబోయే రోజుల్లో మీరు ఆర్థిక స్వేచ్ఛను కోల్పోకుండా చూసుకోవడం కూడా. రాబడికి, ఖర్చులకు సమతుల్యత పాటిస్తూ, అత్యవసర పరిస్థితులను తట్టుకునేలా పొదుపును కొనసాగించడమే నిజమైన ఆర్థిక నిర్వహణ.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


