డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలు లేవు! జాబ్ ఎందుకు రావడం లేదు? నీతి ఆయోగ్ సంచలన రిపోర్టు..

దేశంలో డిగ్రీ పట్టభద్రుల నిరుద్యోగంపై నీతి ఆయోగ్ కీలక నివేదిక విడుదల చేసింది. కేవలం 8.25% మందికి మాత్రమే చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు దక్కుతున్నాయని, డిగ్రీలు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మారకపోవడమే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది.

Published on: Aug 27, 2026, 09:09:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో డిగ్రీలు పూర్తి చేసిన యువత సంఖ్య ఏటికేటికీ పెరుగుతున్నప్పటికీ, వారికి తగ్గ ఉద్యోగాలు లభించడం లేదన్నది అంగీకరించాల్సిన వాస్తవం! ఉన్నత చదువులు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం ఆందోళనకర రీతిలో ఉందని నీతి ఆయోగ్ సైతం తమ 'రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ 2047' నివేదికలో వెల్లడించింది. దేశంలో సాధారణ నిరుద్యోగిత రేటు 3.2 శాతంగా ఉంటే, గ్రాడ్యుయేట్లలో ఇది ఏకంగా 13 శాతానికి చేరిందని వివరించింది.

డిగ్రీలు ఉన్నా ఉద్యోగం ఎందుకు రావడం లేదు? (Representational image/Gemini AI generated)
డిగ్రీలు ఉన్నా ఉద్యోగం ఎందుకు రావడం లేదు? (Representational image/Gemini AI generated)

చదువుకు తగ్గ కొలువులు కరువే!

ఉపాధికి, విద్యార్హతకు మధ్య తీవ్రమైన వ్యత్యాసం కనిపిస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఎకనామిక్ సర్వే 2024-25 గణాంకాలను ఉటంకిస్తూ.. చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సరైన అనుసంధానం కేవలం 8.25 శాతం మందిలోనే ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. మహిళా గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత రేటు ఏకంగా 20.4 శాతానికి పెరగడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ఏటా లక్షలాది మంది బీఏ, బీకామ్, బీఎస్సీ పట్టాలతో బయటకు వస్తున్నప్పటికీ, ఐటీ లేదా కార్పొరేట్ రంగాల్లో అవసరమైన స్కిల్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డిగ్రీలు ఉన్నా ఉద్యోగం ఎందుకు రావడం లేదు?

ఉపాధి మార్కెట్ అవసరాలకు తగ్గట్లు విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలు మారకపోవడం ప్రధాన లోపంగా మారింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మారుతున్న ఉద్యోగ అవకాశాల సమాచారం సరిగా అందడం లేదు. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాంప్రదాయ కోర్సులు పూర్తి చేసిన వారికి నేరుగా ఉద్యోగాలు రావడం లేదు. ప్రైవేట్ సంస్థల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు కూడా ట్యాకీ, కంప్యూటర్ అప్లికేషన్లు లేదా కోడింగ్ వంటి అదనపు కోర్సులు చేయాల్సి వస్తోంది. అయితే, ప్లేస్‌మెంట్ ఇచ్చే నాణ్యమైన శిక్షణా సంస్థలు విపరీతమైన రుసుములు వసూలు చేస్తుండటంతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అవి దూరమవుతున్నాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్, పరిశ్రమలకు అవసరమైన ప్రాజెక్ట్ ట్రైనింగ్ లేకపోవడం విద్యార్థుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాల వేట.. ఏళ్ల తరబడి నిరీక్షణ!

దేశ వ్యాప్తంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న 3.4 కోట్ల మంది విద్యార్థుల్లో ఒక్క బీఏ కోర్సులోనే 1.13 కోట్ల మంది ఉన్నారు. బీఏ, బీఎస్సీ, బీకామ్ కలిపి 2 కోట్లకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించడమే లక్ష్యంగా ఈ డిగ్రీలు చేస్తున్నారు. నవంబర్ 2024 నుంచి జులై 2025 మధ్య కాలంలో కేవలం 55,000 ప్రభుత్వ పోస్టుల కోసం ఏకంగా 1.86 కోట్ల దరఖాస్తులు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రూప్స్, రైల్వే, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయాన్ని వెచ్చిస్తున్న యువత సంఖ్య తక్కువేమీ కాదు.

నీతి ఆయోగ్ ప్రతిపాదించిన పరిష్కారాలు..

ఈ పరిస్థితిని మార్చడానికి నీతి ఆయోగ్ కొన్ని కీలక సంస్కరణలను ప్రతిపాదించింది:

సాంప్రదాయ డిగ్రీల స్థానంలో పరిశ్రమ అవసరాలకు సరిపోయే విధంగా బి.కామ్ అనలిటిక్స్, బి.ఎ హాస్పిటాలిటీ, బి.ఎస్సీ అప్లైడ్ టెక్నాలజీ వంటి స్పెషలైజ్డ్ కోర్సులను తీసుకురావాలి.

చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే అప్రెంటిస్‌షిప్ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లను భారీగా అందుబాటులోకి తేవాలి.

విద్యార్థులు ఉద్యోగం చేస్తూ చదువుకోవడానికి వీలుగా ‘ఎర్న్ వైల్ యు లెర్న్’, పార్ట్ టైమ్, హైబ్రిడ్ విధానాలను ప్రోత్సహించాలి.

'నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్', 'డిజిటల్ స్కిల్స్ పాస్‌పోర్ట్' ద్వారా విద్యార్థులు సాధించిన నైపుణ్యాలను డిజిటల్ రూపంలో గుర్తించే వ్యవస్థను రూపొందించాలి.

పబ్లిక్-ప్రైవేట్ పార్ట్​నర్‌షిప్ (పీపీపీ) నమూనాలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని నివేదిక సూచించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More