IMD alerts : సెప్టెంబర్ 19 వరకు భారీ వర్షాలే.. ఐఎండీ అలెర్ట్! తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే..
నైరుతి రుతుపవనాల కదలికలతో దేశవ్యాప్తంగా మళ్లీ వర్షాలు పుంజుకోనున్నాయి. సెప్టెంబర్ 19 వరకు పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సమయం దగ్గరపడుతున్న వేళ వాతావరణ శాఖ ఉపశమనాన్నిచ్చే వార్తను అందించింది. సెప్టెంబర్ 19 వరకు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. వానలు లేక వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ తాజా వర్ష సూచన ఊరటనిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి..
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 12 నుంచి 20 సెంటీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలోనూ 7 నుంచి 11 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. రాబోయే రోజుల్లో సెప్టెంబర్ 19 వరకు రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామున నగరాన్ని జడివాన ముంచెత్తింది. గడచిన రెండు మూడు గంటలుగా నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు?
ఉత్తర భారతంలో జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, దిల్లీ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య విస్తారంగా వర్షాలు కురుస్తాయి. పశ్చిమ భారత్‌లోని గుజరాత్, కొంకణ్, గోవా, సౌరాష్ట్ర ప్రాంతాల్లో సెప్టెంబర్ 14, 15 తేదీల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 30 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది.
మధ్య భారతంలో పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లలో సెప్టెంబర్ 16 వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో సెప్టెంబర్ 17 వరకు వానలు కురుస్తాయి.
దక్షిణ భారతదేశంలో కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 19 వరకు వర్షాలు కొనసాగుతాయి. వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే ముప్పు ఉన్నందున ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద నిలబడవద్దని, రైతులు పొలం పనుల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
15 శాతం వర్షపాతం లోటు..
ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు సాధారణంగా 778.6 ఎంఎం వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 662.3 ఎంఎం మాత్రమే నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 15 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాబోయే వారం రోజుల పాటు కురిసే వర్షాలు రిజర్వాయర్లలో నీటిమట్టాన్ని పెంచడంతో పాటు ఖరీఫ్ పంటలకు ప్రయోజనం చేకూరుస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


