Petrol diesel price hike : నేటితో ఎన్నికలు ముగింపు- ఇక పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యమేనా?
Petrol price hike : పశ్చిమ్ బెంగాల్ రెండో దశ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా? ఒకవేళ అదే జరిగితే సామాన్యుడిపై ఎంత భారం పడుతుంది? ఈ పూర్తి వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?
Petrol price in Hyderabad : నేటితో పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, ఎన్నికల కోడ్ ముగియగానే సామాన్యుడిపై భారం పడుతుందనే వార్తలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది?

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఊహాగానాలు ఎందుకు?
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత రెండు నెలల్లో ఏకంగా 50 శాతం పెరిగాయి! పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదో వంతు వాటా కలిగిన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' మార్గంలో అడ్డంకులు ఏర్పడటంతో ధరలు భగ్గుమన్నాయి.
గత ఏడాది బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70 డాలర్లు ఉండగా, ఈ నెలలో అది ఏకంగా 114 డాలర్లకు చేరింది. ప్రస్తుతం, బుధవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 111 డాలర్ల వద్ద ఉంది. భారతదేశం తన అవసరాలకు 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి, గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు పెరిగితే ఆ ప్రభావం నేరుగా ఇక్కడ కనిపిస్తుంది.
అయితే, 2022 ఏప్రిల్ నుంచి దేశంలో ఇంధన ధరలు మారలేదు. ప్రస్తుతం దిల్లీలో పెట్రోల్ రూ. 94.77, డీజిల్ రూ. 87.67గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు 107.46 వద్ద, డీజిల్ ధర లీటరుకు రూ.95.70 వద్ద ఉంది.
రూ. 20 వరకు పెరిగే అవకాశం ఉందా?
'ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్' నివేదిక ప్రకారం.. చమురు కంపెనీలు ప్రస్తుతం లీటరుపై రూ. 18 నుంచి 20 వరకు నష్టపోతున్నాయి. వాటికి కవర్ చేసుకోవాలంటే ధరలు పెంపువైపు అడుగులు వేసే అవకాశం లేకపోలేదు!
"అంతర్జాతీయంగా చమురు ధరలు 100 డాలర్ల కంటే పైనే కొనసాగితే, ప్రభుత్వం విడతల వారీగా ధరలను పెంచక తప్పదు. తొలుత లీటరుకు రూ. 10 వరకు పెంచి, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మరో రూ. 10 పెంచే అవకాశం ఉంది," అని ఎమ్కే గ్లోబల్ విశ్లేషించింది. ఒకేసారి భారీగా పెంచితే ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, అందుకే ఆచితూచి అడుగులు వేస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
గత రెండు నెలలుగా దేశంలో ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ నెలలోనే 5 రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లాయి. ఇక బుధవారం జరుగుతున్న పశ్చిమ్ బెంగాల్ రెండో దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వాస్తవంగా దేశంలో ఇంధన ధరలు ఇప్పటికే పెరగాలని, కానీ ఎన్నికల వేళ ప్రైజ్ హైక్ చేస్తే ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తుందని భావించే ప్రభుత్వం ఇంకా ఆ నిర్ణయం తీసుకోలేదని సర్వత్రా చర్చ జరుగుతోంది. అందుకే ఎన్నికల ముగింపు అనంతరం ధరల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక వివరణ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని, ప్రజలు పుకార్లను నమ్మవద్దని కోరింది. దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్‌కి సంబంధించి తగినంత సరఫరా ఉందని ధరలు స్థిరంగానే ఉంటాయని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో 'పానిక్ బయింగ్'.. ఖాళీ అవుతున్న బంకులు!
ప్రభుత్వం వివరణ ఇచ్చినప్పటికీ, ప్రజల్లో ‘ప్యానిక్ బయ్యింగ్’ కనిపిస్తోంది. ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపాయి. రేట్లు పెరగకముందే ట్యాంకులు ఫుల్ చేయించుకోవాలని వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు.
దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. "కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. మేం నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నాం. అన్ని రిటైల్ అవుట్‌లెట్లను పర్యవేక్షిస్తున్నాం, ఎక్కడా స్టాక్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం," అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు.
మంగళవారం నాటికి ఈ ఇంధన సెగ తెలంగాణను కూడా తాకింది! ధరలు పెరుగుతాయనో, స్టాక్ అయిపోతోందనో భయపడిన ప్రజలు హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులపై పడ్డారు. ఫలితంగా కిలోమీటర్ల మేర రద్దీ కనిపించింది.
అయితే, ప్రస్తుతానికి ప్రభుత్వం ధరలు పెంచడం లేదని స్పష్టంగా చెప్పినందున వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చమురు కంపెనీల నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుల తగ్గింపు లేదా ఇతర మార్గాలను అన్వేషించే అవకాశమూ ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


