Fuel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత - బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు, వాహనదారులకు అవస్థలు
Fuel Crisis Telugu States : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో 'నో స్టాక్' బోర్డులు వెలుస్తుండటంతో వాహనదారులు బంక్‌ల వద్ద బారులు తీరుతున్నారు.
Fuel Crisis Telugu States : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు అనేక పెట్రోల్ బంక్‌లు 'నో స్టాక్' బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు ఒక బంక్ నుంచి మరో బంక్‌కు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని పలు చోట్ల ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన హెచ్‌పీసీఎల్ , బీపీసీఎల్ బంక్‌లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా నిరంతరం రద్దీగా ఉండే బంక్‌లు కూడా స్టాక్ లేక గేట్లు వేయడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు బంకుల్లో కూడా పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది.
కారణాలేంటి…?
చమురు సంస్థలు సరఫరాను తగ్గించడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని బంక్ నిర్వాహకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, రవాణాలో తలెత్తిన సాంకేతిక ఇబ్బందులు లేదా డిపోల నుంచి సరైన సమయంలో స్టాక్ రాకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ప్రాథమిక సమాచారం. అయితే….. ఈ కొరత తాత్కాలికమేనా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
వాహనదారుల అవస్థలు:
తాజా పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారు బంకుల వద్ద పరుగులు తీస్తున్నారు. గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. కేవలం ద్విచక్ర వాహనాలే కాకుండా, వ్యవసాయ పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు, నిత్యావసరాలను తరలించే లారీలకు కూడా డీజిల్ దొరకకపోవడం వల్ల రవాణా వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
మరోవైపు వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. ఇంకోవైపు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అధికారులు స్టాక్ ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంది. జనాలు మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలైన్లు పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద టిన్నులతో బంకుల దగ్గర జనం క్యూ కడుతున్నారు.
తగిన సరఫరా ఉండాలి - ఏపీ సీఎం చంద్రబాబు
పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్‌కి తగిన సప్లయ్ ఉండేలా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలన్నారు. ఆయిల్ కంపెనీల అసంబద్ద నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందిపడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఇక తెలంగాణలోని పరిస్థితులపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ డెలివరీల్లో సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1967లో సంప్రదించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సుమారు 25 శాతం బంకులు తాత్కాలికంగా మూతపడ్డట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. డబ్బులు కట్టినా రెండు మూడురోజు వరకు ఇంధనం పంపించకపోతే బంకును మూసివేయాల్సి వస్తోందని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఆయిల్ కంపెనీల నుంచి ఇంధనం సకాలంలో సరఫరా కావడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

