Hyderabad Metro : అతిత్వరలో ప్రభుత్వం చేతికి మెట్రో.. డైరెక్టర్లుగా కీలక అధికారులు
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది. మెట్రో నిర్వహణ కోసం కీలక అధికారులను నామినేట్ చేసింది.
హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రూ.15,000 కోట్ల (అప్పులతో కలిపి) వ్యయంతో కొనుగోలు చేసే ప్రక్రియను అధికారికం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లావాదేవీ ఏప్రిల్ 30, 2026 నాటికి ముగింపు తేదీగా నిర్ణయించారు. స్వాధీనం అనంతరం ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్ఎల్ కోసం ప్రభుత్వం కొత్త డైరెక్టర్ల బోర్డును నామినేట్ చేసింది. ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఛైర్మన్‌గా నియమితులవ్వగా, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
బోర్డులో డైరెక్టర్లుగా నియమితులైన ఇతర సభ్యులు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వారిలో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డీజీపీ బి. శివధర్ రెడ్డి, హెచ్‌ఎమ్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎమ్‌డీ జితేష్ వి పాటిల్, హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఉన్నారు.
స్వాధీనం తర్వాత నామినీ డైరెక్టర్లు, వాటాదారులకు వాటాల కేటాయింపును కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా ఛైర్మన్, డైరెక్టర్లు, తెలంగాణ ప్రభుత్వానికి నామమాత్రంగా ఒక్కో వాటా చొప్పున, మిగిలిన వాటాలను హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు కేటాయించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) స్వాధీనం చేసుకోవడానికి, ఆర్థిక నిర్మాణం, చట్టపరమైన రక్షణలు, కార్యాచరణ కొనసాగింపుతో సహా ఒక సమగ్ర చట్రాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను బకాయిలపై ఎల్ అండ్ టీ నుండి నష్టపరిహారం కోరకూడదని నిర్ణయించడంతో పాటు, స్టాంప్ డ్యూటీ (రూ.123.95 కోట్లు), లేబర్ సెస్ (రూ.163.74 కోట్లు), టీజీఎస్‌పీడీసీఎల్ టారిఫ్ సమస్యలు (రూ.15.38 కోట్లు), ప్రకటనల పన్ను (రూ.75.12 కోట్లు)కు సంబంధించిన బాధ్యతలపై నిర్దిష్ట నష్టపరిహారాలను పొందాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులలో కంపెనీ తరఫున వాదించడానికి ఎల్ అండ్ టీకి నిర్దిష్ట పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇస్తారు. అలాగే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో సహా చట్టమార్పిడి క్లెయిమ్‌లు భవిష్యత్తులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపట్టే చర్యల కోసం కంపెనీ వద్దనే కొనసాగుతాయి.
ప్రస్తుత కంపెనీలోని 115 మంది ఉద్యోగులను ఒక సంవత్సరం పాటు కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించింది. దీనికి హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు సుమారు రూ.24.3 కోట్ల వార్షిక వ్యయం అవుతుంది. అలాగే, ఎల్ అండ్ టీ ఖర్చుతో సలహాదారుల పాత్రలో ఆరు నెలల పాటు ఎల్ అండ్ టీ నుండి ఏడుగురు సీఎక్స్ఓ-స్థాయి అధికారులను నియమించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. అవసరమైన విధంగా సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరించడానికి హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


