...
...
Next Story

రెస్టారెంట్​లో బిల్లు రూ. 320- జొమాటోలో మాత్రం రూ. 655! మరీ ఇంత తేడానా..

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి! ఒకే ఆర్డర్‌కు యాప్‌లో, రెస్టారెంట్‌లో ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ ఒక మహిళ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Published on: Jan 11, 2026, 09:10:19 IST
Advertisement

మనం ఇంట్లో కూర్చుని నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే వచ్చే సౌకర్యం మాటేమో కానీ.. ఆ బిల్లు చూస్తే మాత్రం ఈ మధ్య గుండె దడదడలాడుతోంది. మరీ ముఖ్యంగా రెస్టారెంట్​ డైన్​-ఇన్​ బిల్లుకు, ఆన్​లైన్​ డెలివరీ సర్వీస్​ ప్రొవైడ్​ చేసే యాప్​ల బిల్లులకు మధ్య కనిపిస్తున్న తేడాపై ఇటీవలి కాలంలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్​ చేసిన ఒక పోస్ట్​ వైరల్​గా మారింది. రెస్టారెంట్​లో బిల్లు రూ. 320 అని, జొమాటోలో మాత్రం రూ. 655 అవుతోందని ఆమె ఆ పోస్ట్​లో చెప్పుకొచ్చారు. మరీ ఇంత తేడానా? ఎందుకు? దీనిపై జొమాటో సైతం స్పందించింది.

అసలు ఏం జరిగింది?

ఒకే ఆర్డర్‌కు యాప్‌లో, రెస్టారెంట్‌లో భారీ వ్యత్యాసం.. (X/@NalinisKitchen)
ఒకే ఆర్డర్‌కు యాప్‌లో, రెస్టారెంట్‌లో భారీ వ్యత్యాసం.. (X/@NalinisKitchen)

నళిని ఉనాగర్ అనే మహిళ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఆమె ఒక చైనీస్ ఫుడ్ సెంటర్‌లో నేరుగా వెళ్లి తీసుకుంటే (టేకవే) అయిన బిల్లును, అదే ఆర్డర్‌ను జొమాటో యాప్‌లో చూపిస్తున్న ధరతో పోల్చారు.

"డియర్ జొమాటో.. నా ఆర్డర్ అసలు ధర రూ. 320 మాత్రమే. కానీ మీ యాప్‌లో అది రూ. 655గా చూపిస్తోంది. అన్ని డిస్కౌంట్లు పోగా నేను ఇంకా రూ. 550 చెల్లించాల్సి వస్తోంది. ఈ ధరల వ్యత్యాసం చాలా దారుణంగా ఉంది. కస్టమర్ల దగ్గర మీరు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు," అని ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె షేర్ చేసిన ఫోటోలో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ (జొమాటో యాప్​) పక్కనే రెస్టారెంట్ బిల్లు ఉంది. ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి.

జొమాటో వివరణ ఏంటి?

ఈ వైరల్ పోస్ట్‌పై జొమాటో కేర్ అధికారికంగా స్పందించింది.

"నళిని గారు, మా ప్లాట్‌ఫామ్‌పై ధరలను రెస్టారెంట్ భాగస్వాములే నిర్ణయిస్తారు. జొమాటో కేవలం కస్టమర్లకు, రెస్టారెంట్లకు మధ్య ఒక వారధి లాగా మాత్రమే పనిచేస్తుంది. అయినప్పటికీ, మీ అభిప్రాయాన్ని సంబంధిత రెస్టారెంట్ యాజమాన్యానికి తెలియజేస్తాము. వారు దీన్ని పరిశీలిస్తారు," అని కంపెనీ బదులిచ్చింది.

నెటిజన్ల స్పందన ఇలా..

రెస్టారెంట్​లో కన్నా జొమాటోలో బిల్లు మరీ ఎక్కువగా ఉండంపై ఇంటర్నెట్​లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జొమాటోను తప్పుబడుతుండగా, మరికొందరు కంపెనీని సమర్థిస్తున్నారు.

"డెలివరీ బాయ్స్, ఇతర సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు ఉంటాయి కాబట్టే ధరలు ఎక్కువగా ఉంటాయి," అని ఒక నెటిజన్ కామెంట్​ చేశారు.

"జొమాటో అనేది సత్రం కాదు కదా! సౌకర్యం కావాలనుకున్నప్పుడు ప్రీమియం ఛార్జీలు చెల్లించక తప్పదు. రెస్టారెంట్ ధరకే కావాలంటే నేరుగా వెళ్లి తెచ్చుకోవచ్చు," అని మరొకరు పేర్కొన్నారు.

“రెస్టారెంట్ల నుంచి జొమాటో 30శాతం వసూలు చేస్తుంది. అందుకే రెస్టారెంట్లు ధరలు పెంచుతాయి,” అని ఇంకొకరు కామెంట్​ చేశారు.

“ధర మాత్రమే కాదు. క్వాలిటీ, క్వాంటిటీ కూడా తేడాగా ఉంటుంది,” అని మరొకరు అన్నారు.

ఏది ఏమైనా, ఆన్‌లైన్ సౌకర్యం కోసం అసలు ధర కంటే దాదాపు రెట్టింపు చెల్లించాల్సి రావడం మధ్యతరగతి వినియోగదారులకు మింగుడుపడటం లేదు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe