ప్రేమికుడిని చంపించిన కుటుంబం.. అంత్యక్రియల ముందు నిర్జీవ దేహంతోనే మహిళ పెళ్లి!
మహారాష్ట్ర నాందేడ్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తమ బిడ్డను ప్రేమిస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ కుటుంబం, ఓ వ్యక్తిని దారుణంగా చంపేసింది. కాగా, ఆ మహిళ మాత్రం ప్రేమికుడి అంత్యక్రియలకు వెళ్లి, మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది!
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక ప్రేమ కథకు అత్యంత విషాదకరమైన ముగింపు పడింది! కుల విభేదాల కారణంగా మహిళ కుటుంబసభ్యులు, ఆమె ప్రేమించిన వ్యక్తిని చంపేసినట్టు తెలుస్తోంది. అతని అంతి సంస్కారాలు జరగడానికి ముందు, ఆ మహిళ, అతని మృతదేహాన్ని వివాహం చేసుకుంది!

“సాక్షిం టేట్ మరణంలో కూడా మా ప్రేమ గెలిచింది. నా తండ్రి, అన్నలు ఓడిపోయారుస” అని 21ఏళ్ల అంచల్ మామిద్వార్ కన్నీళ్లతో చెప్పింది. సాక్షిం ఇంటి కోడలిగా జీవితాంతం అక్కడే ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ ఆత్మార్పణ వేడుకతో తమ ప్రేమ "అమరం" అవుతుందని ఆమె ప్రకటించింది.
ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
'చంపిన వారికి ఉరిశిక్ష వేయాలి': అంచల్ డిమాండ్
అంచల్‌కు సాక్షిం టేట్‌తో పరిచయం ఆమె అన్నల ద్వారానే జరిగింది! అయితే, సాక్షిం వేరే కులానికి చెందినవాడు కావడంతో, వారి ప్రేమ వ్యవహారాన్ని మామిద్వార్ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాక్షింను పెళ్లి చేసుకోవాలని అంచల్ ప్లాన్ చేస్తున్న విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియగానే, ఆమె అన్న హిమేష్ మామిద్వార్ గురువారం సాయంత్రం పట్టణంలోని పాత గంజ్ ప్రాంతంలో సాక్షింపై తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ సాక్షిం పక్కటెముకల్లోకి దూసుకుపోగా, ఆ తర్వాత హిమేష్ అతని తలపై రాయితో గట్టిగా కొట్టి చంపేశాడు.
విలేకరులతో మాట్లాడిన అంచల్, తన తండ్రి, అన్నలు చేసిన ఈ “దుర్మార్గపు హత్యకు” వారిని ఉరి తీయాలని డిమాండ్ చేసింది.
తండ్రి, అన్నల అరెస్ట్..
ఈ ఘటన జరిగిన వెంటనే హిమేష్‌తో పాటు అతని సోదరుడు సాహిల్, వారి తండ్రి గజానన్ మామిద్వార్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.
పోలీసులు గుర్తించిన మరో విషయం ఏంటంటే, సాక్షిం, ఈ కేసులో ప్రధాన నిందితుడైన హిమేష్ ఒకప్పుడు మిత్రులు! అంతేకాక, వీరిద్దరూ గతంలో కూడా కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నిర్జీవ దేహంతో పెళ్లి..
శుక్రవారం సాయంత్రం సాక్షింకు అంతిమ సంస్కారాల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, తీవ్ర మనోవేదనతో ఉన్న అంచల్ అతని ఇంటికి చేరుకుంది.
నాటకీయ పరిణామాల మధ్య , ఆమె సాక్షిం దేహానికి పసుపు రాసి, తన నుదుటిపై కుంకుమ పెట్టుకుని, మరణించిన తన ప్రియుడిని బహిరంగంగా “వివాహం” చేసుకుంది! సాక్షిం మరణించినప్పటికీ, తమ ప్రేమ "నిజంగా బతికే ఉంది" కాబట్టే తాను అతడిని పెళ్లి చేసుకున్నానని ఆమె చెప్పడం మొదలుపెట్టింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


