ఈ దేశంలో పురుషుల కొరత! ఒంటరిగా మిగిలిపోతున్న మహిళలు- ‘అద్దెకు భర్త’ సేవలకు డిమాండ్
లాట్వియాలో పురుషుల కొరత తీవ్రస్థాయిలో ఉంది. చాలా మంది మహిళలు ఒంటరిగా మిగిలిపోతున్నారు. పని ప్రదేశాల్లో కూడా పురుషులు కనిపించడం లేదని వాపోతున్నారు. ఈ క్రమంలోనేే ఆ దేశంలో భర్తలను అద్దెకు ఇచ్చే సర్వీస్‌కి డిమాండ్ పెరుగుతోంది.
యూరోప్‌లోని లాట్వియా దేశం ప్రస్తుతం తీవ్రమైన లింగ అసమతుల్యతను ఎదుర్కొంటోంది! ఈ దేశంలో పురుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా అనేకమంది మహిళలు తమ ఇంట్లో పనుల కోసం 'భర్తలను' తాత్కాలికంగా అద్దెకు తీసుకుంటున్నారు! ఈ మేరకు 'ది న్యూయార్క్ పోస్ట్' ఇటీవలే ఒక నివేదికను ప్రచురించింది.

యూరోస్టాట్ గణాంకాల ప్రకారం.. లాట్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5 శాతం ఎక్కువగా ఉన్నారు! యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సగటున ఉన్న లింగ అసమానత కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
లాట్వియాలో సమస్య ఇది..
వృద్ధుల్లో పరిస్థితి: ‘వరల్డ్ అట్లాస్’ సమాచారం ప్రకారం, 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో పురుషుల కంటే మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నారు.
పని ప్రదేశాలు, దైనందిన జీవితంలో కొరత: పని ప్రదేశాల్లో రోజువారీ జీవితంలో కూడా పురుషుల కొరత స్పష్టంగా కనిపిస్తోందని లాట్వియన్ మహిళలు చెబుతున్నారు. సాధారణ పనులుచేసే డానియా అనే మహిళ, తన సహోద్యోగుల్లో దాదాపు అందరూ మహిళలే ఉన్నారని చెప్పారు. లింగ సమతుల్యత మెరుగ్గా ఉంటే సామాజిక పరస్పర చర్యలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
జీవిత భాగస్వాముల వేట: తమ దేశంలో తగిన భాగస్వాములు దొరకనందున, చాలా మంది మహిళలు పార్ట్నర్స్ కోసం విదేశాలకు వెళుతున్నారని డానియా స్నేహితురాలు జానే తెలిపారు.
ఇంటి పనుల కోసం 'భర్త'లను అద్దెకు తీసుకోవడం..
పురుష భాగస్వాములు లేకపోవడంతో, రోజువారీ ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి లాట్వియన్ మహిళలు ఇప్పుడు హ్యాండీమ్యాన్ సేవలను రెంట్‌కి తీసుకోవడంపై మొగ్గు చూపుతున్నారు.
కొమాండ 24: ఈ వేదిక "మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్" అనే సేవలను అందిస్తుంది! వీరు ప్లంబింగ్, వడ్రంగి పనులు, రిపేర్లు, టెలివిజన్ ఇన్‌స్టాలేషన్ వంటి పనుల్లో సహాయం చేస్తారు.
Remontdarbi.lv: ఈ సేవ ద్వారా మహిళలు ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ ద్వారా “గంటకు భర్త” సేవను బుక్ చేసుకోవచ్చు. కార్మికులు త్వరగా వచ్చి పెయింటింగ్, కర్టెన్లు సరిచేయడం, ఇతర నిర్వహణ పనులను చక్కబెడతారు.
లాట్వియాలో సమస్యకు కారణాలు..
లాట్వియాలో ఈ లింగ అసమతుల్యతకు ప్రధాన కారణం పురుషుల్లో తక్కువ ఆయుర్దాయం అని నిపుణులు చెబుతున్నారు. దీనికి ముఖ్యంగా అధిక ధూమపానం రేటు, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలే కారణం.
ధూమపానం: వరల్డ్ అట్లాస్ ప్రకారం.. లాట్వియాలోని పురుషుల్లో 31% మంది ధూమపానం చేస్తుండగా, మహిళల్లో కేవలం 10% మాత్రమే ఉన్నారు.
బరువు సమస్యలు: ఊబకాయం లేదా అధిక బరువు సమస్యలతో బాధపడే పురుషులు కూడా మహిళల కంటే ఎక్కువగా ఉన్నారు.
ఇతర దేశాల్లో కూడా ఈ ధోరణి!
భర్తలను అద్దెకు తీసుకునే ఈ పద్ధతి లాట్వియాకే పరిమితం కాలేదు! 2022లో యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) లోని లారా యంగ్ అనే మహిళ, తన భర్త జేమ్స్‌ను చిన్న చిన్న పనుల కోసం "రెంట్ మై హ్యాండీ హస్బెండ్" అనే వ్యాపారం కింద అద్దెకు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచింది. జేమ్స్ వివిధ ఇంటి పనులకు గంట లేదా రోజువారీ లెక్కన ఛార్జ్ చేస్తూ, పూర్తిగా బుకింగ్‌లతో బిజీగా ఉంటున్నాడు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


