శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
WhatsApp : వాట్సాప్ అకౌంట్ హైజాక్ రిస్క్- అకౌంట్ కాపాడుకోవాలంటే ఇవి తప్పనిసరి..
వాట్సాప్ వెబ్ సెషన్లను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదంపై కేంద్ర హోంశాఖ హెచ్చరిక జారీ చేసింది. అకౌంట్ భద్రత కోసం సైబర్ నిపుణులు సూచించిన పలు కీలక జాగ్రత్తలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
కోట్లాది మంది భారతీయుల రోజువారీ సంభాషణల్లో వాట్సాప్ కీలక భాగంగా మారింది అని అనడంలో సందేహమే లేదు. వ్యక్తిగత చాట్‌లు పంచుకోవడానికి, పత్రాలు పంపడానికి, ఆఫీసు పనుల కోసం అందరూ దీన్నే వాడుతున్నారు. అయితే అజాగ్రత్తగా లాగిన్ చేయడం లేదా వాట్సాప్ వెబ్ సెషన్‌ను అలాగే వదిలేయడం వల్ల మన వ్యక్తిగత చాట్‌లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.

వాట్సాప్ వెబ్ సెషన్లను దుర్వినియోగం చేసి ఖాతాలను అనధికారికంగా చేజిక్కించుకునే ముప్పుపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల అడ్వైజరీ విడుదల చేసింది. వాట్సాప్ వెబ్‌ను సురక్షితంగా వాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ యూజర్లకు సూచించింది.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్ పోలీసు సైబర్ సెక్యూరిటీ సలహాదారు రాహుల్ మిశ్రా చెప్పిన కొన్ని భద్రతాపరమైన జాగ్రత్తలను సూచించారు. ఇవి పాటిస్తే మన వాట్సాప్ అకౌంట్ సేఫ్‌గా ఉంటుందని అన్నారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
పబ్లిక్, ఇతరుల కంప్యూటర్లలో లాగిన్ వద్దు!
వాట్సాప్ వెబ్ సెషన్ నుంచి లాగ్ అవుట్ చేయడం చాలామంది మర్చిపోతుంటారు. అందుకే సైబర్ కేఫ్‌లు సహా బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లలో ఖాతాలను తెరవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సిస్టమ్‌లలో తగిన భద్రత ఉండదు. లాగిన్ వివరాలను రికార్డ్ చేసే హానికర సాఫ్ట్‌వేర్‌లు ఉండవచ్చు. తప్పనిసరిగా పబ్లిక్ కంప్యూటర్ వాడాల్సి వస్తే, బయటకు వెళ్లే ముందే వాట్సాప్ వెబ్ సెషన్ నుంచి కచ్చితంగా లాగ్ అవుట్ చేయాలి.
తెలిసిన వ్యక్తి అయినా సరే, వేరొకరి ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ఖాతాను లింక్ చేయకూడదు. యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్ ద్వారా ఆ కంప్యూటర్ వాడేవారు మీ చాట్‌లు, పంచుకున్న ఫైళ్లను చూసే వీలుంటుంది. ఎల్లప్పుడూ సొంత, నమ్మకమైన పరికరాల్లోనే ఖాతాను వాడాలి.
క్యూఆర్ కోడ్‌లు, ఇంకాగ్నిటో మోడ్ జాగ్రత్తలు..
వాట్సాప్ వెబ్ వాడేందుకు మొబైల్ ఖాతాను కంప్యూటర్‌తో అనుసంధానం చేయడానికి క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఈ ప్రక్రియను అడ్డం పెట్టుకుంటారు. అనధికారిక లేదా హానికర క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసేలా మోసం చేసి, తమ ఆధీనంలోని పరికరాలకు ఖాతాను లింక్ చేసుకునే ప్రమాదం ఉంది. నమ్మకమైన కంప్యూటర్‌లో లాగిన్ ప్రక్రియను మీరే మొదలుపెట్టినప్పుడు మాత్రమే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
సొంతం కాని సిస్టమ్‌లో వాట్సాప్ వెబ్ తెరవాల్సిన పరిస్థితి వస్తే, బ్రౌజర్‌లో ఇంకాగ్నిటో లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ వాడాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. విండో మూసేసిన తర్వాత బ్రౌజింగ్ హిస్టరీ, కొన్ని లోకల్ సెషన్ డేటా సేవ్ కాకుండా ఇవి కొంతవరకు అడ్డుకుంటాయి. అయితే ఇంకాగ్నిటో మోడ్ వాడినంత మాత్రాన పూర్తి భద్రత లభించదు, యాక్టివ్ సెషన్‌ను ఇతరులు చూడకుండా ఆపలేదు. వాడిన తర్వాత ఎప్పుడూ లాగ్ అవుట్ చేయాలి.
టూ-స్టెప్ వెరిఫికేషన్, లింక్డ్ డివైజ్‌ల తనిఖీ
ఖాతా భద్రతను పెంచుకునేందుకు వాట్సాప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్‌తో వాట్సాప్‌ను మళ్లీ రిజిస్టర్ చేసేటప్పుడు ఇది పిన్ అడుగుతుంది. దీనివల్ల నంబర్ ఒక్కటి తెలిసినా ఎవరూ సులభంగా ఖాతాను చేజిక్కించుకోలేరు. ఈ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు.
వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'లింక్డ్ డివైజ్‌లు' విభాగాన్ని తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి. మీ ఖాతాకు అనుసంధానమైన అన్ని కంప్యూటర్లు, బ్రౌజర్లను దీని ద్వారా గమనించవచ్చు. మీకు తెలియని పరికరం లేదా గుర్తుపట్టలేని సెషన్ కనిపిస్తే వెంటనే లాగ్ అవుట్ చేయాలి. తరచూ తనిఖీ చేయడం వల్ల అనధికారిక సెషన్లను గుర్తించి నిలిపివేయవచ్చు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, అనుమానాస్పద కదలికలపై నిఘా..
ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టమ్, వెబ్ బ్రౌజర్‌కు ఎప్పటికప్పుడు తాజా సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేయాలని సైబర్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాడుకునే లోపాలను సరిచేసే భద్రతా పరిష్కారాలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లలో ఉంటాయి.
మీకు తెలియకుండానే మెసేజ్‌లు వెళ్లడం, తెలియని లింక్డ్ డివైజ్‌లు కనిపించడం లేదా ఊహించని ఖాతా నోటిఫికేషన్లు రావడం వంటి అసాధారణ అంశాలపై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మెసేజ్‌ల ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు, తెలియని ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు. ఏదైనా తేడా గమనిస్తే వెంటనే లింక్డ్ డివైజ్‌లను పరిశీలించి ఖాతాను సురక్షితం చేసుకోవాలి.
లాగ్ అవుట్ చేయడం ఎలా? భద్రత ఎందుకు అవసరం?
ప్రతి వాట్సాప్ వెబ్ సెషన్ తర్వాత లాగ్ అవుట్ చేయడం అత్యంత కీలకమైన భద్రతాపరమైన జాగ్రత్త. ముఖ్యంగా షేర్డ్ లేదా పబ్లిక్ కంప్యూటర్ వాడినప్పుడు ఇది తప్పనిసరి. బ్రౌజర్ విండోను మూసేసినంత మాత్రాన యాక్టివ్ సెషన్ ఆగిపోకపోవచ్చు. ఫోన్‌లో వాట్సాప్ తెరిచి, 'లింక్డ్ డివైజ్‌లు'లోకి వెళ్లి, మీరు వాడిన కంప్యూటర్ లేదా బ్రౌజర్‌ను ఎంచుకుని 'లాగ్ అవుట్' నొక్కడం ద్వారా దాన్ని డిస్కనెక్ట్ చేయాలి. వ్యక్తిగత, వృత్తిపరమైన సంభాషణలకు వాట్సాప్ కీలక వేదికగా కొనసాగుతున్న వేళ, ఖాతా రక్షణకు ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం.

E-Paper
