శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
WhatsApp web : ఆఫీస్ కంప్యూటర్స్‌లో వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక!
ఆఫీసు కంప్యూటర్లు, పబ్లిక్ సిస్టమ్స్‌లో వాట్సాప్ వెబ్ వాడి లాగౌట్ చేయకుండా వదిలేస్తున్నారా? అయితే మీ ఖాతా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. బ్రౌజర్ క్లోజ్ చేసినంత మాత్రాన లాగౌట్ కాదని స్పష్టం చేస్తూ కీలక భద్రతా సూచనలు జారీ చేసింది.
ఆఫీసు పనుల కోసమో, ఫైళ్లు పంపుకోవడానికో కంప్యూటర్స్‌లో ‘వాట్సాప్ వెబ్’ ఓపెన్ చేస్తున్నారా? పని పూర్తయ్యాక లాగౌట్ చేయకుండా నేరుగా బ్రౌజర్ విండో క్లోజ్ చేసి వెళ్లిపోతున్నారా? అయితే మీరు పెద్ద ప్రమాదంలో పడినట్లే! ఇతరులతో కలిసి వాడే షేర్డ్ కంప్యూటర్లు లేదా పబ్లిక్ సిస్టమ్స్‌లో వాట్సాప్ ఖాతాలను లాగిన్ చేసి వదిలేయడం వల్ల తీవ్రమైన సైబర్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) ఈ మేరకు ఒక కీలక అడ్వైజరీ జారీ చేసింది. యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్ల ద్వారా సైబర్ నేరగాళ్లు లేదా అనధికార వ్యక్తులు మీ వ్యక్తిగత సంభాషణలను చదవడమే కాకుండా, మీ ఖాతాను పూర్తిగా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

బ్రౌజర్ క్లోజ్ చేస్తే లాగౌట్ కాదు.. ఐ4సీ హెచ్చరిక ఇదే!
ఐ4సీ పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్సీటీఏయూ) విడుదల చేసిన ఈ అడ్వైజరీలో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. యాక్టివ్ వాట్సాప్ వెబ్ సెషన్లను ఆసరాగా చేసుకుని నేరగాళ్లు మీ మెసేజ్‌లు చదవడం, కాంటాక్ట్ లిస్ట్ సేకరించడం, గ్రూప్ చాట్లను గమనించడం వంటివి చేయగలరు. అంతటితో ఆగకుండా, అసలు ఖాతాదారుడిలా నటిస్తూ మీ కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులకు సందేశాలు పంపే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫిషింగ్ దాడులు, ఆర్థిక మోసాలు, ఇతర ఆన్లైన్ స్కామ్‌ల బారిన పడే ముప్పు పెరుగుతుంది. చాలామంది బ్రౌజర్ విండో లేదా ట్యాబ్ మూసివేస్తే వాట్సాప్ వెబ్ నుంచి లాగౌట్ అయిపోతామని పొరబడుతుంటారు; కానీ అలా చేస్తే సెషన్ ముగియదని, కచ్చితంగా సెట్టింగ్స్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ‘లాగౌట్’ ఆప్షన్ ఎంచుకోవాలని ఐ4సీ తేల్చిచెప్పింది.
ఖాతా లాగిన్‌లో వదిలేస్తే జరిగే అనర్థాలు ఏంటి?
కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో ఒకే కంప్యూటర్ను పలువురు వినియోగిస్తుంటారు. అలాంటి చోట వాట్సాప్ ఖాతాను లాగిన్‌లో ఉంచడం వల్ల గోప్యతకు, భద్రతకు భంగం వాటిల్లుతుంది. ఆ కంప్యూటర్ను ఉపయోగించే వేరొకరు మీ వ్యక్తిగత లేదా ఆఫీసు రహస్య సంభాషణలను సులభంగా చదివేస్తారు. అంతేకాదు, మీ నంబర్ నుంచి మీ స్నేహితులు, బంధువులకు సందేశాలు పంపితే, నిజంగా మీరే అడుగుతున్నారని వారు నమ్ముతారు. ఇదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు అత్యవసరమంటూ డబ్బులు అడగడం, మోసపూరిత లింకులు లేదా ఫిషింగ్ మెసేజ్‌లు పంపడం చేస్తారు. గ్రూప్ చాట్లు, కాంటాక్ట్ నంబర్ల ద్వారా మరికొందరిని లక్ష్యంగా చేసుకునే సమాచారాన్ని కూడా సేకరిస్తారు.
అందుకే కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ద్వారా ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక లేదా అత్యంత రహస్య సమాచారాన్ని అస్సలు పంచుకోవద్దని ఐ4సీ ప్రత్యేకంగా సూచించింది.
వాట్సాప్ ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడానికి 7 జాగ్రత్తలు!
వాట్సాప్ ఖాతా దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కింది జాగ్రత్తలు పాటించాలని ఐ4సీ స్పష్టం చేసింది:
ప్రతి సెషన్ తర్వాత లాగౌట్ చేయండి: వాట్సాప్ వెబ్ వాడకం పూర్తయిన వెంటనే బ్రౌజర్ క్లోజ్ చేయకుండా, తప్పనిసరిగా మాన్యువల్‌గా లాగౌట్ చేయాలి.
పబ్లిక్ కంప్యూటర్లకు దూరంగా ఉండండి: సైబర్ కేఫ్‌లు, పబ్లిక్ కియోస్క్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, ఇతరుల వద్ద అరువు తెచ్చుకున్న కంప్యూటర్లు, నమ్మకం లేని సిస్టమ్స్‌లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయవద్దు.
ప్రైవేట్ బ్రౌజింగ్ వాడండి: నమ్మకమైన కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ వాడక తప్పని పరిస్థితి వస్తే, బ్రౌజర్లో ‘ఇన్‌కాగ్నిటో’ లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ఉపయోగించాలి. అక్కడ కూడా బ్రౌజర్ మూసే ముందు మాన్యువల్‌గా లాగౌట్ చేయడం మరవద్దు.
సున్నితమైన సమాచారం వద్దు: ప్రభుత్వ వ్యవహారాలు, ఆర్థిక వివరాలు, ఆఫీసు రహస్యాలను కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ద్వారా ఇతరులకు పంపకపోవడమే ఉత్తమం.
అనుమానాస్పద కదలికలపై నిఘా: మీరు పంపకుండానే మీ అకౌంట్ నుంచి ఇతరులకు మెసేజ్‌లు వెళ్లడం, మీ కాంటాక్ట్‌ల నుంచి వింత రిప్లైలు రావడం వంటివి గమనిస్తే, ఎవరో అనధికారికంగా మీ ఖాతాను వాడుతున్నారని అర్థం చేసుకోవాలి.
సాఫ్ట్వేర్ అప్డేట్గా ఉంచండి: కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్లు, యాంటీ-వైరస్ సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అనుమానాస్పద డౌన్లోడ్లు, తెలియని ఫైళ్లు, క్రాక్డ్ సాఫ్ట్వేర్ల జోలికి వెళ్లవద్దు.
శాశ్వత లాగిన్ వద్దు: ఇతరులకు అందుబాటులో ఉండే కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్‌ను శాశ్వతంగా లాగిన్ చేసి ఉంచే అలవాటును మానుకోవాలి.
వాట్సాప్ ఖాతా హ్యాక్ అయిందని అనుమానం వస్తే ఏం చేయాలి?
ఒకవేళ మీ వాట్సాప్ ఖాతా ఇతరుల చేతుల్లోకి వెళ్లిందని అనుమానం వస్తే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే మీ ఫోన్లోని వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘లింక్డ్ డివైసెస్’ విభాగాన్ని తనిఖీ చేయండి. అక్కడ మీకు తెలియని కంప్యూటర్లు లేదా బ్రౌజర్లు లాగిన్ అయి ఉంటే, తక్షణమే వాటిని సెలెక్ట్ చేసి లాగౌట్ చేయండి.
ఇక ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. చిన్నపాటి అజాగ్రత్త మన ఆర్థిక భద్రతకు, వ్యక్తిగత ప్రతిష్టకు ముప్పు తెస్తుందని గుర్తుంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి.

E-Paper
