Yamaha bike : యమహా కొత్త ఆర్- సిరీస్ బైక్.. రెండు రోజుల్లో లాంచ్, ప్రీ బుకింగ్స్ షురూ
యామహా భారత్‌లో ఆగస్టు 27న తన కొత్త ఆర్-సిరీస్ స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించనుంది. ఆర్15, ఆర్3 మోడళ్ల మధ్య ఉన్న గ్యాప్‌ని భర్తీ చేస్తూ రానున్న ఈ యామహా కొత్త బైక్ ప్రీ-బుకింగ్‌లు సైతం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ బైక్‌ని సంస్థ ఆర్2 అని పేరు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని యువతను, పర్ఫార్మెన్స్ బైక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న యామహా ఆర్-సిరీస్ కుటుంబం నుంచి మరో పవర్‌ఫుల్ మోటార్‌సైకిల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఆగస్టు 27న కొత్త బైక్‌ను భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు యామహా అధికారికంగా ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన కొత్త టీజర్‌ను కంపెనీ #RInstinct క్యాంపెయిన్‌తో సోషల్ మీడియాలో విడుదల చేసింది. బైక్ పేరును కంపెనీ సస్పెన్స్‌గా ఉంచినప్పటికీ, ఇది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యామహా ఆర్2 మోడలేనని ఆటోమొబైల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రీ- బుకింగ్స్ షురూ..
భారత మార్కెట్‌లో ఈ కొత్త బైక్‌పై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని యామహా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ. 10,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బైక్‌ను రిజర్వ్ చేసుకోవచ్చు. బైక్ కొనుగోలు సమయంలో ఈ మొత్తాన్ని ఫైనల్ బిల్లులో సర్దుబాటు చేస్తారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన వేగంగా డెలివరీలు అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకోవాలనుకుంటే, సెప్టెంబర్ 5, 2026 నుంచి ఎలాంటి కోత లేకుండా పూర్తి రీఫండ్ పొందే వెసులుబాటును కూడా కల్పించారు.
ఆర్15, ఆర్3 మధ్య కొత్త బైక్?
మన దేశంలో విశేష ఆదరణ పొందిన యామహా ఆర్15 వీ4, ప్రీమియం ఆర్3 మోడళ్ల మధ్య ధర, ఇంజిన్ పవర్ పరంగా పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ను పూరించడానికే యామహా ఈ 200 సీసీ ప్లస్ కేటగిరీలో ఆర్2ను రంగంలోకి దించుతోంది. ఇది నేరుగా కేటీఎం ఆర్‌సీ 200, హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్, బజాజ్ పల్సర్ ఆర్‌ఎస్ 200 మోడళ్లతో తలపడనుంది. మన ఎక్స్-షోరూమ్ ధరల అంచనా ప్రకారం ఇది రూ. 2.00 లక్షల నుంచి రూ. 2.20 లక్షల శ్రేణిలో లభ్యమయ్యే అవకాశముంది.
ఇంజిన్ సామర్థ్యం, అధునాతన ఫీచర్లు..
యామహా ఈ కొత్త బైక్ స్పెసిఫికేషన్లను గుప్తంగా ఉంచినప్పటికీ, ఆటోమొబైల్ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో 200 సీసీ నుంచి 220 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది సుమారు 25 పీఎస్ పవర్, 20 ఎన్‌ఎమ్ టాప్ టార్క్‌ను అందిస్తుంది. ఆర్15 రేసింగ్ డీఎన్‌ఏను కొనసాగిస్తూ ఇందులో డెల్టాబాక్స్ ఛాసిస్, అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సెటప్‌ను అందించనున్నారు.
రోజువారీ రైడింగ్, ట్రాక్ రైడింగ్ రెండింటికీ అనువుగా ఉండేలా ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్న టీఎఫ్‌టీ డిస్‌ప్లే డిజిటల్ కన్సోల్‌ను ఈ యమహా కొత్త బైక్‌లో చేర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆర్9 కాదు.. ఆర్2 మాత్రమే!
గ్లోబల్ మార్కెట్‌లో ఇటీవల ఆవిష్కృతమైన యామహా ఆర్9 (890 సీసీ ఇన్‌లైన్-త్రీ ఇంజిన్) బైక్‌ను లాంచ్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, భారతీయ రోడ్ల పరిస్థితులు, విపణి అవసరాలకు ఆర్2 మోడలే పర్‌ఫెక్ట్ ఛాయిస్ . ఇప్పటికే భారత్‌లో 'YZF-R2' ట్రేడ్‌మార్క్‌ను యామహా రిజిస్టర్ చేసుకోవడం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆగస్టు 27న జరగబోయే ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ స్పోర్ట్స్ బైక్ పూర్తి వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, ధరల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


