...
...
Next Story

Yamaha R2 స్పోర్ట్స్ బైక్ లాంచ్- ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యామహా భారతదేశంలో సరికొత్త ‘వైజెడ్‌ఎఫ్-ఆర్‌2’ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేసింది. రూ. 2.30 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ బైక్ 204సీసీ ఇంజిన్, అధునాతన రైడింగ్ మోడ్‌లు, ఆకట్టుకునే డిజైన్‌తో బైక్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది.

Published on: Aug 27, 2026, 15:28:36 IST
Advertisement

భారతదేశంలో స్పోర్ట్స్ బైక్స్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకున్న యామహా సంస్థ మరో పవర్‌ఫుల్ మోడల్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది. దేశీయ విపణిలోకి సరికొత్త ‘యామహా ఆర్‌2’ బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 2.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఆర్‌3, ఎంటీ-03 వంటి 321సీసీ బైకుల విక్రయాలు తగ్గిపోవడం, దిగుమతి సుంకాలు పెరగడంతో వాటిని గతంలో నిలిపివేసిన యామహా, ఇప్పుడు భారతీయ యువత బడ్జెట్, వేగం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 204సీసీ బైక్‌ను రూపుదిద్దింది.

యమహా వై​జెడ్​ఎఫ్ ఆర్​2..
యమహా వై​జెడ్​ఎఫ్ ఆర్​2..

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఆర్‌15 బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్‌15 కంటే ఎక్కువ పవర్, 300సీసీ కంటే అందుబాటు ధరలో వాహనాన్ని కోరుకునే యువ రైడర్లకు ఈ ఆర్‌2 ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

యమహా ఆర్​2లో మూడు వేరియంట్లు.. విభిన్న ధరలు

కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా యమహా ఆర్‌2ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు.

స్టాండర్డ్ ఆర్‌2 : రూ. 2.30 లక్షలు

ఆర్‌2 విత్ క్విక్‌షిఫ్టర్ : రూ. 2.39 లక్షలు

ఆర్‌2ఎమ్ (స్పోర్టీ వేరియంట్): రూ. 2.53 లక్షలు

శక్తివంతమైన ఇంజిన్.. రైడింగ్ మోడ్లు

ఈ యమహా ఆర్​2 బైక్‌లో 204సీసీ, లిక్విడ్-కూల్డ్, ఫోర్-స్ట్రోక్, 4-వాల్వ్, డీఓహెచ్​సీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 10,000 ఆర్‌పీఎం వద్ద 26.14 బీహెచ్‌పీ పవర్, 8,000 ఆర్‌పీఎం వద్ద 19.1 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రైడర్ల భద్రత, నియంత్రణ కోసం 'యామహా రైడింగ్ కంట్రోల్' సాంకేతికతను అందించారు. ఇందులో స్ట్రీట్, స్పోర్ట్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్లు ఉంటాయి. రైడర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా త్రోటల్ రెస్పాన్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), క్విక్ షిఫ్ట్ సిస్టమ్ (క్యూఎస్​ఎస్)లను అడ్జస్ట్ చేసుకుని సొంతంగా కస్టమ్ రైడింగ్ మోడ్‌ను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

యమహా ఆర్​2లో లైట్ వెయిట్ ఛాసిస్, రేసింగ్ డిజైన్..

ఈ బైక్ డార్క్ బ్లూయిష్ గ్రే, మెటాలిక్ బ్లాక్, రేసింగ్ బ్లూ, మ్యాట్ వైట్ పెర్ల్, మెటాలిక్ గ్రే అనే ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

యమహా ఆర్​2- అధునాతన ఫీచర్లు, బుకింగ్స్ షురూ..

ఈ బైక్‌లో 5-ఇంచుల ఫుల్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, వై-కనెక్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ కీ సిస్టమ్, ఎల్‌ఈడీ పొజిషన్ లైట్లు, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, 282 ఎంఎం రాడియల్-మౌంటెడ్ 4-పాట్ కాలిపర్ డిస్క్ బ్రేక్, 810 ఎంఎం సీట్ హైట్, 1,340 ఎంఎం వీల్‌బేస్ దీని సొంతం.

భారత్‌లోని తన 'బ్లూ స్క్వేర్' షోరూమ్‌ల సంఖ్యను ఈ ఏడాది ఆఖరు నాటికి 600 దాటించాలని యామహా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బైక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమవగా, సెప్టెంబర్ మధ్య వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks