క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే పర్సనల్ లోన్ వచ్చేస్తుందన్న గ్యారెంటీ లేదు! ఇవి తెలుసుకోండి..
క్రెడిట్ స్కోర్ ఎక్కువ ఉంటే చాలు, పర్సనల్ లోన్ ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటే మాత్రమే పొరబడినట్టే! మీ పర్సనల్ లోన్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యేందుకు అనేక కారణాలు ఉండొచ్చు. అవేంటంటే..
మీరు పర్సనల్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీ లోన్ అప్రూవల్ కేవలం క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుందని అనుకుంటే, మీరు పొరబడినట్టే! మీకు లోన్ ఇచ్చే ముందు.. బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు మీ క్రెడిట్ స్కోర్‌తో పాటు అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఎలాంటి కారణాల వల్ల పర్సనల్ లోన్ అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..

పర్సనల్ లోన్ రిజెక్షన్- ఇవి తెలుసుకోండి..
వయస్సు కీలకం..
కొన్నిసార్లు పర్సనల్ లోన్ తిరస్కరణకు వయస్సు అనేది ఒక కారణంగా నిలుస్తుంది. సాధారణంగా, లోన్ టెన్యూర్ ముగిసే లోపుగా పదవీ విరమణ చేయబోయే వృద్ధుల కంటే, తక్కువ వయస్సున్న ఉద్యోగులకు రుణం మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిటైర్ కాబోతున్న ఉద్యోగుల దరఖాస్తులు ఈ కారణం చేత తిరస్కరణకు గురికావచ్చు.
స్థిరమైన ఆదాయం లేకపోవడం..
స్థిరమైన ఆదాయం లేకపోవడం కూడా పర్సనల్ లోన్ తిరస్కరణకు ప్రధాన కారణం కావచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు కూడా పర్సనల్ లోన్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే అయినప్పటికీ, వారి ఆదాయం క్రమంగా, నిలకడగా లేకపోతే, రుణదాతలు లోన్ ఇవ్వడానికి సందేహిస్తారు. అలాగే, బ్యాంకు వద్ద ఉన్న మూలధనం తక్కువగా ఉండి, లోన్ అడిగే దరఖాస్తుదారులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, స్థిరమైన జీతం లేనివారికి లోన్ ఇవ్వడానికి వెనుకాడుతారు.
ప్రస్తుతం ఉన్న అప్పులు..
మీకు ఇప్పటికే ఉన్న లోన్లు కూడా మీ కొత్త లోన్ దరఖాస్తు ఫలితాన్ని ప్రభావం చూపిస్తాయి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి ప్రస్తుతం ఉన్న లోన్, అతని నెలవారీ ఆదాయంలో సగానికిపైగా ఉంటే, అదనంగా లోన్ ఇవ్వడానికి రుణదాతలు ఆసక్తి చూపరు. ఇప్పటికే అధిక మొత్తంలో ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి అదనపు భారం వేయడానికి వారు సంశయిస్తారు.
కోరిన మొత్తం ఎక్కువగా ఉండటం..
మీ జీతంతో పోల్చితే.. తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం కంటే చాలా ఎక్కువ మొత్తానికి మీరు దరఖాస్తు చేసినా, పర్సనల్ లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురికావచ్చు. మీ క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్నప్పటికీ, మీ ఆదాయాన్ని మించి లోన్ అడిగితే, రుణదాతలు మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.
ఉద్యోగ ఒప్పందం గడువు..
చివరగా.. మీరు జీతం తీసుకునే ఉద్యోగి అయినప్పటికీ, మీ సర్వీస్ కాంట్రాక్ట్ అనేది లోన్ గడువు ముగియడానికి కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం ముందే ముగుస్తుంటే, మీ లోన్ తిరస్కరణకు గురికావచ్చు. లోన్ తీర్చడానికి ముందు ఉద్యోగం ఉంటుందనే గ్యారెంటీ లేకపోతే, రుణదాతలు రిస్క్ తీసుకోరు.
మదుపరులకు సలహా: లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ ఆదాయం, వయస్సు, ప్రస్తుత అప్పులు, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోండి. కేవలం మంచి క్రెడిట్ స్కోర్ మీ లోన్ గ్యారెంటీ కాదని గుర్తుంచుకోండి!

E-Paper












