యువరాజ్‌ను చూసి కోహ్లి, ధోని భయపడ్డారు-ఎప్పుడూ వెన్నుపోటు పొడిచే వాళ్లుంటారు: యువీ తండ్రి యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు
యువరాజ్ సింగ్ భారతదేశపు గొప్ప క్రికెటర్ అని, తన కొడుకు ప్రతిభను చూసి ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ భయపడ్డారని అతని తండ్రి యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువరాజ్ సింగ్ తండ్రి, భారత మాజీ పేసర్ యోగరాజ్ సింగ్ పాత చర్చను మళ్లీ తెరపైకి తెచ్చి కొత్త వివాదానికి నిప్పు రాజేశారు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యువరాజ్ సింగ్‌ను భారతదేశపు గొప్ప క్రికెటర్‌గా అభివర్ణించడమే కాకుండా, తన కొడుకు ప్రతిభను చూసి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి భయపడ్డారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆల్ టైమ్ గ్రేట్
భారతదేశపు గొప్ప క్రికెటర్ ఎవరు? అనే చర్చ మరోసారి జరుగుతున్న నేపథ్యంలో యోగరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యోగరాజ్ సమాధానాలు చాలా ఘాటుగా, వివాదాస్పదంగా ఉన్నాయి. యోగరాజ్ నమ్మకం ప్రకారం యువరాజ్ ఇండియా ఆల్-టైమ్ గ్రేట్.
"మీరు ఆల్-రౌండర్ల గురించి మాట్లాడితే కపిల్ దేవ్ ఉన్నారు. బ్యాట్స్‌మెన్ల గురించి మాట్లాడితే యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి వారు ఉన్నారు. కానీ నా దృష్టిలో యువీ వీరందరి కంటే అగ్రస్థానంలో ఉన్నాడు" అని యోగరాజ్ అన్నారు.
టెస్టు కెరీర్
యువరాజ్ టెస్ట్ కెరీర్ గురించి యోగరాజ్ మాట్లాడుతూ.. "అతను సుమారు 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, బహుశా 200 సెంచరీలు చేసి ఉండేవాడు. అతనికి ఆ సామర్థ్యం ఉందని నేను భావించా" అని యోగరాజ్ అన్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉన్నత స్థాయి క్రీడలలో ఉండే గట్టి పోటీని ఉటంకిస్తూ, యువరాజ్ చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూలంగా ఉండేదని యోగరాజ్ అన్నారు.
యువీని చూసి
"నేను మీకు చెప్పినట్లుగా విజయం, డబ్బు, కీర్తి ఉన్న ఈ రంగంలో స్నేహితులు ఉండరు. ఎప్పుడూ వెన్నుపోటుదారులు ఉంటారు. మిమ్మల్ని కిందికి లాగాలనుకునే వారు ఉంటారు. యువరాజ్ సింగ్‌ను చూసి భయపడ్డారు. ఎందుకంటే అతను వారి స్థానాలను లాక్కుంటాడని భయపడ్డారు. అతను దేవుడు సృష్టించిన గొప్ప ఆటగాడు. అందుకే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీతో సహా అందరూ భయపడ్డారు. 'ఓహ్, అతను నా ప్లేస్ ను లాక్కుంటాడేమో' అని భయపడ్డారు" అని యోగరాజ్ అన్నారు.
బలి పశువు
గతంలో కూడా యోగరాజ్ సింగ్ తన కొడుకుకు సరైన అవకాశాలు రాలేదని, జట్టులోని రాజకీయాలకు బలిపశువు అయ్యాడని పలుమార్లు గళం విప్పిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై యువరాజ్ సింగ్ ఎప్పుడూ స్పందించనప్పటికీ, యువరాజ్‌కు అర్హమైన కెరీర్‌ను భారత యాజమాన్యం నిరాకరించిందని యోగరాజ్ పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.
2011 టోర్నమెంట్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి, దానితో పోరాడి జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. అయితే అతని కెరీర్ క్రమంగా మసకబారింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


