...
...
Next Story

Bhogapuram International Airport Photos : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం - ఆగస్టు 1న ప్రారంభం, విశేషాలివిగో

Bhogapuram International Airport : ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమైన ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

Published on: Jul 28, 2026, 11:33:53 IST
Advertisement
<p>ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో మైలురాయి ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెల నుంచి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఆగస్టు ఒకటో తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం రానున్నారు. ప్రధాని రాకకు... విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.</p>

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో మైలురాయి ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే నెల నుంచి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఆగస్టు ఒకటో తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం రానున్నారు. ప్రధాని రాకకు... విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్రాజెక్ట్ కీలకం కావడంతో ఈ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అదే స్థాయి ప్రమాణాలతో భోగాపురం ఎయిర్ పోర్టు సిద్దమైంది. కేవలం విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా.. పరిశ్రమలు, ఉపాధి, ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కేంద్రబిందువుగా మారేలా అల్లూరి సీతారామ రాజు ఎయిర్ పోర్టుకు రూపకల్పన చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటి. నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే కాకుండా, మొదట నిర్ణయించిన గడువుకంటే దాదాపు ఐదు నెలల ముందే సిద్ధం చేశారు.

ఉమ్మడి విశాఖపట్నం–విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు, ఎగుమతులకు, లాజిస్టిక్స్‌కు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక వసతిగా మారనుంది. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GVIAL) ద్వారా పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్ధతిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. మొత్తం 2,703.26 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విమానాశ్రయం –2,203 ఎకరాలు, ఏవియేషన్ హబ్ – 500 ఎకరాలు, ఏవియేషన్ యూనివర్సిటీ/ఎడ్యుసిటీ 136 ఎకరాలు కేటాయించారు. విమానాశ్రయ పరిధిలో ఎయిర్‌సైడ్ డెవలప్‌మెంట్, సిటీ సైడ్ కమర్షియల్ డెవలప్‌మెంట్, రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు.

3,800 మీటర్ల పొడవైన రన్‌వే ఈ విమానాశ్రయానికి ప్రధాన ఆకర్షణ. వైడ్‌బాడీ విమానాల కార్యకలాపాలకు అనుకూలంగా దీనిని రూపొందించారు. అంటే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330, ఎయిర్ బస్ A340 వంటి భారీ ఎయిర్ క్రాఫ్టులు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించగలవు. ఇక ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, నావిగేషన్ ఎయిడ్స్, CNS/ATM ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు ఈ ఎయిర్ పోర్టులో అందుబాటులో ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రమాణాలతో ఎయిర్‌సైడ్ మౌలిక వసతులను అభివృద్ధి చేశారు.

భోగాపురం విమానాశ్రయాన్ని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాడ్యులర్ విధానంలో అభివృద్ధి చేశారు. తొలి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్‌లో దశలవారీ విస్తరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ టెర్మినల్, ఎయిర్‌సైడ్, కమర్షియల్ మౌలిక వసతులను విస్తరించేందుకు వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం, వేగవంతమైన ప్రాసెసింగ్, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచేందుకు కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు, కామన్ యూజ్ పాసింజర్ ప్రాసెసింగ్ వ్యవస్థ, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, సెల్ఫ్ సర్వీస్ పాసింజర్ ప్రాసెసింగ్, స్మార్ట్ సర్వైవలెన్స్, యాక్సెస్ కంట్రోల్, సెక్యూర్టీ మేనేజ్మెంట్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఉత్తరాంధ్ర ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకంగా మారనుంది. ఇక్కడ ఏటా 25,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేకించి కార్గో టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, అధిక విలువైన, పెరిషయబుల్ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు వేగవంతం కానున్నాయి. భవిష్యత్‌లో విశాఖపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో కీలకమైన ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్ హబ్‌గా ఎదగనుంది. భోగాపురం విమానాశ్రయం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా అభివృద్ధి చేశారు. దీంట్లో భాగంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ HVAC వ్యవస్థ, ఎల్ఈడీ ఎయిర్ పోర్టు లైటింగ్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టం, రెయిన్ వాటర్ హర్వెస్టింగ్, వాటర్ రీ-సైక్లింగ్, మురుగు నీటి శుద్ధి చేసే ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వ్యవస్థలతో పర్యావరణ హిత విమానాశ్రయాన్ని ఏర్పాటు అయింది. విమానాశ్రయ నీటి అవసరాల్లో సుమారు 30 శాతం రీసైకిల్ చేసిన నీటితో తీర్చేలా ప్రణాళిక రూపొందించారు.

విమానాశ్రయాన్ని LEED Platinum ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ఆధునిక సాంకేతికతకు ప్రతీకగా ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ కళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. ఎయిర్ పోర్టును ఉత్తరాంధ్ర తీరం ప్రతిబింబించేలా ‘ఫ్లయింగ్ ఫిష్’ నమూనాలో తీర్చిదిద్దారు. టెర్మినల్ నిర్మాణానికి బంగాళాఖాతం ఆకారంలో డిజైన్ చేశారు. టెర్మినల్ పైకప్పు, సీలింగ్ డిజైన్లలో సంప్రదాయ పద్ధతుల్ని ఉపయోగించారు. ఆధునిక ఆర్కిటెక్చర్‌ను స్థానిక సంస్కృతి, కళా సంప్రదాయాలతో మేళవించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో కొత్త ఆర్థిక అవకాశాలు తెరుచుకోనున్నాయి. పర్యాటకం, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, గిడ్డంగులు, ఎగుమతులు, ఫార్మా, మెరైన్ ఉత్పత్తులు, ఐటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, తయారీ రంగాలకు ఇది కొత్త ఊతం ఇవ్వనుంది. అరకు, లంబసింగి, విశాఖ తీర ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ఇది దోహదపడనుంది. విమానాశ్రయం చుట్టూ ఏవియేషన్ హబ్, ఏవియేషన్ యూనివర్సిటీ, కార్గో, లాజిస్టిక్స్, MRO, ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా విశాఖపట్నం–భోగాపురం గ్రోత్ కారిడార్ భవిష్యత్‌లో దేశంలోని కీలక ఆర్థిక, పారిశ్రామిక కారిడార్లలో ఒకటిగా ఎదిగే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe