Telangana Ration Shops : రేషన్ షాపుల వద్ద బారులు - ఈనెలాఖరు వరకు పంపిణీ..!
తెలంగాణలోని రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తుండటంతో… తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు ఉంటున్నాయి. ఈనెలాఖారు వరకు రేషన్ పంపిణీ ఉంటుందని… వినియోగదారులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని రేషన్ షాపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి 3 నెలల రేషన్ ఇస్తుండటంతో… తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు ఉంటున్నాయి.
మూడు నెలల బియ్యం ఒకేసారి అందిస్తుండటంతో రేషన్ షాపుల దగ్గరకు భారీగా జనాలు వస్తున్నారు. క్యూలైన్లలో చాలాసేపు నిల్చుంటున్నారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము నుంచే లైన్లు కనిపిస్తున్నాయి. రేషన్ కార్డులతో పాటు బస్తాలను లైన్ లో ఉంచుతున్నారు.
హైదరాబాద్‌లో పలు చోట్ల రేషన్ దుకాణాల వద్ద కార్డుదారులు బారులు తీరుతున్నారు. ఒక్కొక్కరి బయోమెట్రిక్-థంబ్ తీసుకోవడానికి చాలా సమయం పడుతోంది. దీంతో పలు చోట్ల తెల్లవారుజాము నుంచే వినియోగదారులు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోంది. రేషన్ కార్డు ఉన్న వారు ఎక్కడైనా బియ్యం తీసుకునే అవకాశం ఉండటంతో… చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే తీసుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల వద్ద తెల్లవారుజాము నుంచే భారీగా లైన్లు దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల స్టాక్ సమస్యలు వస్తున్నాయి. దీంతో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఒకేసారి భారీగా సంఖ్యలో జనాలు వస్తుండగా…. సాంకేతికంగా సర్వర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈపోస్ యంత్రాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతున్నాయి. మళ్లీ రీస్టార్ట్ చేసి ప్రాసెస్ కూడా కూడా సమయం పడుతోంది. బయోమెట్రిక్ విషయంలో కూడా సమస్యలు వస్తుండటంతో… సరఫరా ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరుగుతోంది. ప్రస్తుతం ఇచ్చే రేషన్ అయిపోతే… మరో మూడు నెలల పాటు ఇవ్వరనే ఆందోళనతో చాలా మంది ఒకేసారి వస్తున్నారు.
బియ్యం తమకు అందక ముందే అయిపోతాయనే ఆందోళన చాలాచోట్ల లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. మరోవైపు వేసవి కావటంతో… చాలాచోట్ల వినియోగదారులు ఎండకు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
రేషన్ పంపిణీపై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ అందుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈనెల 30వ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుందని చెబుతున్నారు.
E-Paper

