
తెలంగాణలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అయితే తమకు సంబంధించిన కొత్త స్మార్ట్ కార్డులను ఎక్కడ, ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది కార్డుదారులు అయోమయానికి గురవుతున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డు అందని వాళ్లు….. ముందుగా రేషన్ కార్డుదారులు ఇంటర్నెట్ కేంద్రం లేదా మీసేవా ద్వారా తమ రేషన్ కార్డు నంబర్ (FSC No) సాయంతో కొత్త 'FSC(పుడ్ సెక్యూరిటీ కార్డు) Printout' కాపీని తీసుకోవాలి.
ఆ ఆన్‌లైన్ ప్రింట్ అవుట్‌లో మీ కుటుంబ వివరాలతో పాటు మీ రేషన్ షాప్ నంబర్ (FP Shop No) నెంబర్ స్పష్టంగా నమోదై ఉంటుంది. మీ ప్రింట్ అవుట్‌లో ఉన్న ఎఫ్‌పీ షాప్ నంబర్ ఆధారంగా మీకు కేటాయించిన సంబంధిత రేషన్ డీలర్ వద్దకు వెళ్తే…. వారు మీ నూతన స్మార్ట్ రేషన్ కార్డును అందజేస్తారు.
ఎలాంటి రుసుం లేకుండానే మీ స్మార్ట్ రేషన్ కార్డును అందజేస్తారు. ఒక్క రూపాయి కూడా మీ వద్ద నుంచి తీసుకోరు. ఇక చాలా నియోజకవర్గాల్లోని మండలాల్లో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డు అందని వారు ఆందోళన చెందకుండా…మీ కార్డులోని వివరాల ఆధారంగా సంబంధిత రేషన్ షాపు వద్దకు వెళ్లి కార్డును పొందొచ్చు.
ఇక మీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డును T-Ration యాప్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ వివరాలు డిస్ ప్లే అవుతాయి. ఇక ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ స్మార్ట్ రేషన్ కార్డులను నకిలీవి సృష్టించకుండా, ట్యాంపరింగ్ చేయడానికి వీలులేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. కార్డుకు రెండు వైపులా మధ్య భాగంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం వాటర్‌మార్క్ రూపంలో ఉంటుంది. ఇది కేవలం వెలుతురుకు ఎదురుగా చూసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది.