...
...
Next Story

2026 శ్రీకృష్ణ జన్మాష్టమి: ఈసారి అద్భుత గ్రహయోగాలు.. పూజా విధానం, ముహూర్తం పూర్తి వివరాలు!

2026లో శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 4, శుక్రవారం జరుపుకోనున్నారు. శ్రావణ కృష్ణ అష్టమి తిథితో పాటు రోహిణీ నక్షత్రం కలవడం ఈ పర్వదినానికి ప్రత్యేకతను ఇస్తోంది. ఈ సమయంలో చంద్రుడు వృషభ రాశిలో సంచరించనున్నందున పూజకు మరింత విశిష్టత ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి.

Published on: Sep 2, 2026, 11:01:00 IST
Advertisement

హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ప్రతి ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ఈ వేడుకను అంబరాన్ని తాకేలా నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం వచ్చింది. పౌరాణిక గ్రంథాల ప్రకారం, ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్రం, అష్టమి తిథి కూడిన అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారు. ఈసారైతే ఏకంగా అప్పట్లో ఉన్నటువంటి అద్భుతమైన గ్రహయోగాలే మళ్లీ పునరావృతం కావడం విశేషం.

2026 శ్రీకృష్ణ జన్మాష్టమి: ఈసారి అద్భుత గ్రహయోగాలు.. పూజా విధానం, ముహూర్తం పూర్తి వివరాలు!
2026 శ్రీకృష్ణ జన్మాష్టమి: ఈసారి అద్భుత గ్రహయోగాలు.. పూజా విధానం, ముహూర్తం పూర్తి వివరాలు!

చంద్రుడు తన ఉచ్ఛ స్థానమైన వృషభ రాశిలో సంచరించనుండటం, అష్టమితో పాటు రోహిణీ నక్షత్రం తోడుకావడం ఈ పండుగ విశిష్టతను మరింత పెంచుతోంది. ఈ శుభ ముహూర్తంలో శ్రీకృష్ణుడిని నిష్టతో కొలిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. బాలాగోపాలుడి ఆశీస్సులతో ఇంట సిరిసంపదలు కళకళలాడుతాయని అర్చకులు చెబుతున్నారు.

తిథి, నక్షత్రాల సమయాలు

పంచాంగం ప్రకారం, శ్రావణ కృష్ణ అష్టమి తిథి సెప్టెంబర్ 3న అర్ధరాత్రి దాటాక 01:33 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 12:45 గంటలకు రోహిణీ నక్షత్రం మొదలవుతుంది. రోహిణీ నక్షత్రం సెప్టెంబర్ 4 రాత్రి 11:12 గంటల వరకు ఉంటుంది. అష్టమి తిథి కూడా అదే రోజు రాత్రి 11:13 గంటలకు ముగుస్తుంది.

జన్మాష్టమి వ్రత మహిమ

బ్రహ్మవైవర్త, భవిష్య పురాణాల ప్రకారం సమస్త వ్రతాలలోనూ జన్మాష్టమి వ్రతం అత్యుత్తమమైనదిగా కీర్తించబడింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కోట్లాది గోదానాలు చేసిన పుణ్యం, వందలాది యజ్ఞాలు నిర్వహించిన ఫలితం ఈ ఒక్క వ్రతం ద్వారా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. జీవితాంతం సకల సుఖాలను పొందవచ్చు. భక్తులు అంతిమంగా విష్ణు లోకాన్ని చేరుతారనేది పెద్దల నమ్మకం.

పూజా విధానం

పంచామృత స్నానం: మొదటగా లడ్డూ గోపాలుడిని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో కూడిన పంచామృతంతో అభిషేకం చేసి, అనంతరం పవిత్ర గంగాజలంతో స్నానం చేయించాలి.

దివ్య అలంకరణ: పూజా మందిరంలో శ్రీకృష్ణుడి ప్రతిమతో పాటు గోమాత ప్రతిమను కూడా ఉంచి పూజించాలి. బాలకృష్ణుడికి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరింపజేసి ముకుటం, వేణువును సమర్పించాలి.

నైవేద్య సమర్పణ: కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, మిశ్రి, లడ్డూలు, తులసి దళాలు, పాయసం, పంచరత్నాలు, మఖానాలతో నివేదన చేయాలి.

మంత్ర జపం: పూజ సమయంలో "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" అనే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి హారతి ఇవ్వాలి.

పూజా ముహూర్తం మరియు ఉపవాస విరమణ

శాస్త్రాల ప్రకారం అర్ధరాత్రి సమయంలోనే కృష్ణుడి జననం జరిగింది కాబట్టి నిషిత పూజా ముహూర్తానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 01:28 నుండి 02:11 గంటల వరకు పూజ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. కేవలం 43 నిమిషాల పాటు ఉండే ఈ నిషిత కాలంలో పూజించడం శ్రేయస్కరం. ఇక వ్రత విరమణ విషయానికి వస్తే, కొందరు పూజ ముగిసిన వెంటనే ఉపవాసం విరమిస్తే, మరికొందరు సూర్యోదయం తర్వాత విరమిస్తారు. సెప్టెంబర్ 5న ఉదయం 07:13 గంటల తర్వాత ఉపవాసం విరమించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks