శివయ్య అనుగ్రహం కోసం ‘బుధ ప్రదోషం’.. ఈ వ్రతం ముహూర్తం, విశిష్టత వివరాలు ఇవిగో!

చైత్ర మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన ప్రదోష వ్రతం ఏప్రిల్ 15న అనగా ఈరోజు వచ్చింది. బుధవారం రావడం వల్ల దీనిని ‘బుధ ప్రదోషం’గా పిలుస్తారు. ఈ రోజున శివారాధన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పూజా ముహూర్తం, విధివిధానాల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Published on: Apr 15, 2026, 08:00:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ ధర్మంలో మహాశివుడిని ఆరాధించే పర్వదినాల్లో ప్రదోష వ్రతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నెలకు రెండు సార్లు వచ్చే ఈ త్రయోదశి తిథి శివయ్యకు ఎంతో ప్రీతికరమైనది. ప్రస్తుతం మనం పవిత్రమైన చైత్ర మాసంలో ఉన్నాం. ఈ మాసంలో వచ్చే తొలి ప్రదోష వ్రతం ఈరోజు, అనగా ఏప్రిల్ 15, బుధవారం నాడు వచ్చింది. బుధవారం నాడు వచ్చే ప్రదోషాన్ని ‘బుధ ప్రదోషం’ అని పిలుస్తారు. నిశ్చలమైన భక్తితో ఈ రోజున శివుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి, జీవితంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

శివయ్య అనుగ్రహం కోసం ‘బుధ ప్రదోషం’.. ఈ వ్రతం ముహూర్తం, విశిష్టత
శివయ్య అనుగ్రహం కోసం ‘బుధ ప్రదోషం’.. ఈ వ్రతం ముహూర్తం, విశిష్టత

బుధ ప్రదోషం: తిథి, ముహూర్తం వివరాలు

ద్రిక్ పంచాంగం ప్రకారం, చైత్ర మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి ఏప్రిల్ 15వ తేదీ అర్ధరాత్రి 12:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 10:31 గంటలకు తిథి ముగుస్తుంది. ప్రదోష వ్రత పూజను సూర్యాస్తమయం తర్వాతే నిర్వహించాలి కాబట్టి, ఏప్రిల్ 15వ తేదీనే వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.

పూజా ముహూర్తం:

ఏ వ్రతానికైనా శుభ ముహూర్తం చాలా ముఖ్యం. సాయంత్రం శివారాధన చేయడానికి కేవలం గంటన్నర సమయం మాత్రమే అత్యంత అనుకూలంగా ఉంది.

ముహూర్తం సమయం: ఏప్రిల్ 15, సాయంత్రం 6:01 గంటల నుండి రాత్రి 7:31 గంటల వరకు.

ఈ సమయంలో శివుడిని అర్చించడం వల్ల రెట్టింపు ఫలితాలు అందుతాయని భక్తుల విశ్వాసం.

ప్రదోష కాలంలో పూజా విధానం

ప్రదోష వ్రతం ఆచరించే వారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.

రోజంతా ఉపవాసం ఉండి సాత్విక జీవనాన్ని గడపడం మంచిది.

ముఖ్యమైన పూజ ప్రక్రియ సాయంత్రం ‘ప్రదోష కాలం’లో (సూర్యాస్తమయ సమయం) ప్రారంభమవుతుంది.

శివలింగానికి గంగాజలం, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యితో కూడిన పంచామృతాలతో అభిషేకం చేయాలి.

శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలు (మారేడు దళాలు), ఉమ్మెత్త పూలు, తెల్లటి పుష్పాలు, పండ్లను సమర్పించాలి.

పూజ సమయంలో "ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

శివ చాలీసా పఠించి, ధూపదీప నైవేద్యాలతో హారతి ఇచ్చి పూజను ముగించాలి. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని కోరుకుంటూ నమస్కరించుకోవాలి.

ఈ వ్రతం ఎందుకు చేయాలి?

ప్రదోష వ్రతం వెనుక గొప్ప అర్థం ఉంది. ఈ సమయంలో పరమశివుడు కైలాస పర్వతంపై ఆనంద తాండవం చేస్తాడని, దేవతలందరూ ఆయనను స్తుతిస్తారని ప్రతీతి. బుధవారం వచ్చే ప్రదోషం విజ్ఞానాన్ని, బుద్ధిబలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పిల్లల చదువుల కోసం, ఇంట్లోని అశాంతిని తొలగించుకోవడం కోసం ఈ బుధ ప్రదోష వ్రతం ఆచరించడం ఉత్తమం. నిష్టతో ఈ వ్రతాన్ని చేసే వారికి ఈతి బాధలు తొలిగిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More