ఈ 4 సందర్భాల్లో మౌనం పాటించండి.. చాణక్యుడు చెప్పిన జీవిత సూత్రాలు
ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం, సరైన సమయంలో మౌనం పాటించడం మనిషికి గొప్ప బలంగా మారుతుంది. ప్రతి సందర్భంలోనూ మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని, అనవసరమైన మాటలు వివాదాలు, అవమానాలు, సమస్యలకు దారితీయవచ్చని చాణక్య సూత్రాలు సూచిస్తాయి.
మనిషి జీవితాన్ని విజయపథంలో నడిపించడానికి ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతులు నేటి ఆధునిక కాలంలోనూ ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషుల ప్రవర్తన మారుతున్నప్పటికీ, చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో పొందుపరిచిన మానవ స్వభావ విశ్లేషణ మాత్రం ఎప్పటికీ శాశ్వతమే. అందుకే నేటికీ ఎంతోమంది తమ నిత్య జీవితంలో చాణక్య సూత్రాలను ఆచరించి ఇబ్బందుల నుంచి గట్టెక్కుతున్నారు. చాణక్యుడి సిద్ధాంతాల ప్రకారం 'మౌనం' అనేది మనిషికి అతిపెద్ద అస్త్రం మాత్రమే కాదు, అత్యుత్తమ ఆభరణం కూడా.

అనర్థాలను తెచ్చే మాటల కంటే మౌనమే మేలు
జీవితంలో ప్రతీచోటా మన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నోరు మూసుకుని ఉండటమే గొప్ప పరిపక్వతకు నిదర్శనం. అకారణంగా తలెత్తే వివాదాలు, శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ఏయే సమయాల్లో మౌనం పాటించాలో చాణక్యుడు స్పష్టంగా వివరించారు. సరైన సమయంలో నోరు విప్పకపోతే అనర్థాలు కొనితెచ్చుకున్నట్టేనని ఆయన హెచ్చరిస్తున్నారు.
1. మూర్ఖులు, అజ్ఞానుల మధ్యలో ఉన్నప్పుడు
సమాజంలో కొందరు వ్యక్తులు విషయ అవగాహన లేకుండా కేవలం వాదనల కోసమే మాట్లాడుతుంటారు. అలాంటి చోట మనకు తెలిసినా మాట్లాడటం మన విజ్ఞతను మనమే అవమానించుకోవడంతో సమానం. "మూర్ఖుడు తాను మాట్లాడేవరకు మాత్రమే అందరి గౌరవం పొందుతాడు. ఎప్పుడైతే నోరు విప్పుతాడో, అతని అజ్ఞానం బయటపడుతుంది," అని చాణక్యుడు పేర్కొన్నారు. అందువల్ల విద్వాంసులు లేని చోట, కేవలం వాగ్వాదాలు జరిగే సభల్లో మౌనంగా ఉండటమే మన గౌరవాన్ని కాపాడుకునే ఏకైక మార్గం.
2. అనర్హులకు హితబోధ చేసేటప్పుడు
ధర్మం, సత్యం పట్ల కనీస గౌరవం లేనివారికి, చెప్పే విషయాన్ని గ్రహించే అర్హత లేనివారికి సలహాలు ఇవ్వకూడదు. అర్హత లేని మూర్ఖ శిష్యుడికి ఉపదేశించడం, దుష్ట ప్రవర్తన కలిగిన వ్యక్తులను భరించడం వల్ల మేధావులు సైతం మానసిక క్షోభను అనుభవిస్తారని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వాదోపవాదాలకు వెళ్లకుండా మౌనంగా తప్పుకోవడమే ఉత్తమం.
3. మనకు అవమానం ఎదురైనప్పుడు
ఎక్కడైతే మీ మాటలకు విలువ ఉండదో, మిమ్మల్ని కించపరచడమే లక్ష్యంగా వాతావరణం ఉంటుందో, అక్కడ మీ శక్తిని వృథా చేసుకోవద్దు. మనసులోని ఆలోచనలను, ప్రణాళికలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి. గౌరవం లేని చోట వాదిస్తే మీ ప్లాన్స్‌ను ఇతరులు చెడగొట్టే ప్రమాం ఉంది. అలాంటి చోట ప్రశాంతంగా ఉంటూ మౌనంగా మీ పని మీరు పూర్తి చేసుకోవాలి.
4. పూర్తి సమాచారం లేని సందర్భాలలో
ఏదైనా విషయంపై స్పష్టత లేనప్పుడు లేదా పూర్తి నిజాలు తెలియకుండా మాట్లాడటం హాస్యాస్పదంగా మారుతుంది. అవగాహన లేని అంశాలపై అనవసరంగా స్పందించడం కంటే, మౌనంగా ఉండి పరిస్థితిని గమనించడమే అత్యంత సమర్థవంతమైన నిర్ణయం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


