50 వేల మందితో గీతా పారాయణం: 24, 25 తేదీల్లో చిన్మయ మిషన్ అమృత మహోత్సవం

చిన్మయ మిషన్ 75 ఏళ్ల వేడుకలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జనవరి 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. 50 వేల మందితో మహా గీతా పారాయణం, వీఆర్ అనుభవ కేంద్రం ప్రారంభం వంటివి ఈ అమృత మహోత్సవంలో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

Published on: Jan 21, 2026 2:45 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆధ్యాత్మికత, విద్య, సామాజిక సేవా రంగాల్లో చిన్మయ మిషన్ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నగరం ఒక అరుదైన వేడుకకు వేదిక కాబోతోంది. 2026 జనవరి 24, 25 తేదీల్లో సికింద్రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘అమృత మహోత్సవం’ పేరిట ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. పూజ్య గురుదేవ స్వామి చిన్మయానంద సరస్వతి ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న ఈ సంస్థ, తన సేవా ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ భక్తులను, విద్యార్థులను, యువతను ఈ వేడుకలకు సాదరంగా ఆహ్వానిస్తోంది.

చిన్మయ మిషన్ ఇన్‌చార్జ్ స్వామి సర్వేశానంద, సిఎమ్‌జిహెచ్ అధ్యక్షులు హరీష్ కుమార్
చిన్మయ మిషన్ ఇన్‌చార్జ్ స్వామి సర్వేశానంద, సిఎమ్‌జిహెచ్ అధ్యక్షులు హరీష్ కుమార్

ఆధ్యాత్మిక విప్లవకర్త స్వామి చిన్మయానంద

భగవద్గీత, ఉపనిషత్తుల సారాన్ని సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడమే లక్ష్యంగా స్వామి చిన్మయానంద (1916–1993) తన జీవితాన్ని అర్పించారు. ఒక జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి, హిమాలయాల్లో వేదాంత జ్ఞానాన్ని పొందిన ఆయన, 1951లో పుణేలో తొలి గీతా జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించారు. నేడు చిన్మయ మిషన్ 32 దేశాల్లో 330కి పైగా కేంద్రాలతో విస్తరించిన ఒక గ్లోబల్ ఆధ్యాత్మిక ఉద్యమంగా ఎదిగింది. "గరిష్ఠ సంఖ్యలో ప్రజలకు, గరిష్ఠ కాలం పాటు, గరిష్ఠ ఆనందం అందించాలి" అనే నినాదంతో ఈ సంస్థ విద్య, ఆరోగ్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష కృషి చేస్తోంది.

హైదరాబాద్‌లో రెండు రోజుల ఆధ్యాత్మిక పండుగ

ఈ అమృత మహోత్సవం సందర్భంగా నగరంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు.

వర్చువల్ రియాలిటీ (VR) సెంటర్: జనవరి 24న స్వామి చిన్మయానంద జీవిత విశేషాలను, ఆయన దూరదృష్టిని కళ్లకు కట్టేలా అత్యాధునిక ‘వీఆర్ అనుభవ కేంద్రాన్ని’ ప్రారంభిస్తారు. భక్తులు తమ కళ్ల ముందే గురుదేవుల ప్రస్థానాన్ని చూసేలా దీనిని తీర్చిదిద్దారు.

మహా గీతా పారాయణం: జనవరి 25న ఈ వేడుక పతాక స్థాయికి చేరుకుంటుంది. సుమారు 50 వేల మంది విద్యార్థులు, యువత, భక్తులు కలిసి భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని (పురుషోత్తమ యోగం) ఏకకాలంలో పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా పాల్గొననున్నారు.

"మనమందరం ఏకస్వరంతో గీతను జపించినప్పుడు కలిగే స్పందనలు కేవలం మనకే కాదు, సమాజం మొత్తానికి ప్రేరణను, శ్రేయస్సును కలిగిస్తాయి. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్న సహచరులు గీతా పారాయణం చేయడం ఈ మహోత్సవంలో ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ఆకర్షణ" అని చిన్మయ మిషన్ ఇన్‌చార్జ్ స్వామి సర్వేశానంద మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

అలాగే, గ్రేటర్ హైదరాబాద్ చిన్మయ మిషన్ అధ్యక్షులు హరీష్ కుమార్ మాట్లాడుతూ.. "గడిచిన కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌లో బాలవిహార్, యువకేంద్రాల ద్వారా వేలాది మంది పిల్లల్లో విలువలను, వ్యక్తిత్వ వికాసాన్ని నిశ్శబ్దంగా పెంపొందిస్తున్నాం. ఈ అమృత మహోత్సవం ఆ ప్రయాణంలో మరో మైలురాయి" అని వివరించారు.

ప్రత్యేక ఆకర్షణ: ‘గీతా పంచామృత్’ గ్రంథావిష్కరణ

పూజ్య స్వామి తేజోమయానంద సంకలనం చేసిన ‘గీతా పంచామృత్’ అనే విశేష గ్రంథాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. మొత్తం భగవద్గీత సారాన్ని కేవలం ఐదు శ్లోకాల్లో సంక్షిప్తంగా అందించే ఈ పుస్తకం, దైనందిన జీవితంలో ఆచరించాల్సిన ఒక దిక్సూచిగా నిలుస్తుందని మిషన్ సభ్యులు తెలిపారు.