విష్ణువు అనుగ్రహం కోసం ఇలా సులువుగా తొలి ఏకాదశి పూజ చేసుకోండి.. సంకల్పం నుంచి దానాలు వరకు ఏం చెయ్యాలో తెలుసుకోండి!
తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తిశ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసం చేయడం విశేష పుణ్యఫలాలను అందిస్తుంది.
తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. తొలి ఏకాదశి నాడు చేసే పూజకు, ఉపవాసానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తొలి ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఆ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అయితే తొలి ఏకాదశి నాడు విష్ణువును ఎలా ఆరాధించాలి? పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి ఏకాదశి నాడు విష్ణు అనుగ్రహం కలగాలంటే ఈ విధంగా పూజ చేయండి.. ఇక అన్ని శుభ ఫలితాలే.
1.ఉదయాన్నే స్నానం
బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గు వేయాలి.
2.సంకల్పం
ఆ తర్వాత విష్ణుమూర్తి ఎదుట దీపం వెలిగించి, పూలు, తులసి దళాలను సమర్పించాలి. "తొలి ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నాను" అని సంకల్పం చెప్పుకుని, మీ కోరికలను కూడా శ్రీమహావిష్ణువుకు తెలియజేయాలి.
3.విష్ణువును ఆరాధించండి
విష్ణుమూర్తి లేదా శ్రీమన్నారాయణుని చిత్రపటాన్ని ఉంచి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించండి.
4.తులసి దళాలతో విష్ణువును పూజించండి
తులసి దళాలతో, పసుపు రంగు పూలు లేదా సువాసన గల పూలతో ఆరాధిస్తే విష్ణు అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం.
అలాగే పంచామృతాలను కూడా సమర్పించండి.
5.మంత్ర జపం
విష్ణు అనుగ్రహం కలగాలంటే ఈ మంత్రాలను జపించండి.
ఓం నమో నారాయణాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
అలాగే విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం చాలా శుభప్రదం.
6.నైవేద్యం
విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పాలు, పండ్లు, పాయసం, చక్కెర పొంగలి, తులసి దళాలతో కూడిన నైవేద్యాన్ని సమర్పించండి.
7.ఉపవాసం
చాలామంది నిర్జల ఉపవాసం లేదా ఫలాహారం చేస్తారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. బియ్యం, మద్యం, వెల్లుల్లి, ఉల్లి, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి.
8.సాయంత్రం పూజ
సాయంత్రం దీపారాధన చేసి విష్ణు స్తోత్రాలను చదవాలి. తులసి ప్రదక్షిణలు చేయడం మంచిది. హరినామ సంకీర్తన లేదా భజనలు చేస్తే కూడా విష్ణు అనుగ్రహం కలుగుతుంది.
9.ద్వాదశి పారణ
మరుసటి రోజు ద్వాదశి తిథిలో ఉపవాసాన్ని విరమించాలి. ముందుగా విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించాలి. వీలైతే బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయడం శ్రేయస్కరం. దానం చేయడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
10.తొలి ఏకాదశి నాడు చేయాల్సిన దానాలు
తొలి ఏకాదశి రోజున తులసి మొక్క, పసుపు వస్త్రాలు, బియ్యం, ధాన్యాలు, నెయ్యి, గొడుగు, చెప్పులు దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


