శనివారం+తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది.. ఆ రోజు ఏ సమయానికి పూజ చేసుకోవాలి? పూజా ముహూర్తాలు, భద్ర కాలం వివరాలు!

హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దేవశయని (తొలి) ఏకాదశి ఈ ఏడాది జూలై 25, 2026న ఆచరించనున్నారు. ఈ రోజుతోనే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. పంచాంగం ప్రకారం భక్తులు బ్రహ్మ ముహూర్తం, అభిజిత్, విజయ, అమృత కాలాల్లో శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. 

Published on: Jul 21, 2026, 16:00:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ప్రతి నెలా వచ్చే కృష్ణ, శుక్ల పక్షాల్లో ఏకాదశి వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్ర తిథి పూర్తిగా జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది.

శనివారం+తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది.. ఆ రోజు ఏ సమయానికి పూజ చేసుకోవాలి? పూజా ముహూర్తాలు, భద్ర కాలం వివరాలు!
శనివారం+తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది.. ఆ రోజు ఏ సమయానికి పూజ చేసుకోవాలి? పూజా ముహూర్తాలు, భద్ర కాలం వివరాలు!

ఏకాదశి రోజున శ్రీహారితో పాటు మహాలక్ష్మి దేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలో అశాంతి తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జీవితాంతం సకల సౌభాగ్యాలను అనుభవించి, అంతిమంగా విష్ణు లోకాన్ని చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి

ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తున్న తరుణంలో, ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశిని 'దేవశయని ఏకాదశి' లేదా 'తొలి ఏకాదశి'గా జరుపుకుంటారు. ఈ శుభదినాన శ్రీమహావిష్ణువు రాబోయే నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని చెబుతారు. ఈ నాలుగు నెలల పాటు సృష్టి నిర్వహణ బాధ్యతలను పరమశివుడు స్వీకరిస్తాడు.

దేవశయని ఏకాదశి రోజే చాతుర్మాస దీక్షలు అధికారికంగా మొదలవుతాయి. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడానికి వీలుండదు. ఈ ఏడాది దేవశయని ఏకాదశికి సంబంధించిన కచ్చితమైన తేదీ, పూజా ముహూర్తాలు, భద్ర కాలం వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవశయని ఏకాదశి తేదీ, ముహూర్త సమయాలు

హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తిథి జూలై 24వ తేదీ ఉదయం 05:24 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అనగా జూలై 25వ తేదీ ఉదయం 08:04 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా పరిగణలోకి తీసుకుని, భక్తులు జూలై 25, 2026 శనివారమే దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు.

భద్ర కాలం ప్రభావం.. పూజా ముహూర్తాలు

దేవశయని ఏకాదశి రోజున భద్ర కాలం ఛాయలు కూడా ఉన్నాయి. జూలై 25న ఉదయం 06:15 గంటల నుంచి ఉదయం 08:04 గంటల వరకు భద్ర కాలం కొనసాగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో భద్ర సమయాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పూజా కార్యక్రమాలతో పాటు ఇతర మంగళకరమైన పనులను దూరంగా పెట్టడం మంచిది.

ఏకాదశి రోజున భక్తులు దేవుని పూజించుకోవడానికి పలు శుభ ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి:

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 05:06 గంటల నుంచి ఉదయం 05:40 గంటల వరకు.

అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 01:26 గంటల నుంచి మధ్యాహ్నం 02:28 గంటల వరకు.

విజయ ముహూర్తం: సాయంత్రం 04:31 గంటల నుంచి సాయంత్రం 05:32 గంటల వరకు.

అమృత కాలం: సాయంత్రం 06:11 గంటల నుంచి రాత్రి 07:59 గంటల వరకు.

వ్రతాన్ని ఎప్పుడు విరమించాలి?

దేవశయని ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకునేందుకు (పారణ చేసేందుకు) జూలై 26, 2026 ఆదివారమే సరైనది. ఆ రోజు ఉదయం 06:16 గంటల నుంచి ఉదయం 09:20 గంటల మధ్యలో వ్రత విరమణ చేయవచ్చు. సరిగ్గా అదే రోజు ఉదయం 10:27 గంటలకు ద్వాదశి తిథి ముగుస్తుంది.

ఏకాదశి వ్రతం వల్ల కలిగే ఫలితాలు

నిష్టతో ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దీనితో పాటు లక్ష్మీదేవి కటాక్షం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరిసంపదలు వర్ధిల్లుతాయి. భక్తులు తమ జీవితకాలంలో అన్ని రకాల భౌతిక సుఖాలను అనుభవించి, చివరికి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More