Lunar Eclipse 2026: మార్చి 3న చంద్రగ్రహణం, ఈ రాశులపై చెడు ప్రభావం.. పాటించాల్సిన నియమాలు, పరిహారాలు తెలుసుకోండి!
విశ్వావసు నామ సంవత్సరంలో మార్చి 3, మంగళవారం నాడు పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫాల్గుణ పౌర్ణమి, పూర్వఫాల్గుణి నక్షత్రం, సింహరాశిలో ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. విశ్వవాసు నామ సంవత్సరంలో ఏర్పడబోతున్న చివరి గ్రహణం ఇది. పాటించాల్సిన నియమాలు, పరిహారాలు తెలుసుకోండి.
ప్రతి ఏటా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే మార్చి నెలలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలో కనపడుతుంది కాబట్టి సూతక కాలాన్ని కూడా పరిగణించాలి. విశ్వావసు నామ సంవత్సరంలో మార్చి 3, మంగళవారం నాడు పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫాల్గుణ పౌర్ణమి నాడు, మంగళవారం పూర్వఫాల్గుణి నక్షత్రం, సింహరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. విశ్వవాసు నామ సంవత్సరంలో ఏర్పడబోతున్న చివరి గ్రహణం ఇది.

ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది కాబట్టి గ్రహణ నియమాలను కూడా పాటించాలి. ఈ గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. అలాగే గ్రహణ సమయంలో రెండు సార్లు స్నానం చేస్తారు. గ్రహణం ప్రారంభం అయినప్పుడు పట్టు స్నానం, పూర్తయ్యాక విడుపు స్నానం చేస్తారు. మన దేశంలో చూసినట్లయితే, గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుంది. కనుక దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. ఈ గ్రహణం చంద్రోదయం అయిన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనబడుతుంది.
గ్రహణ ప్రారంభం, ముగింపు
గ్రహణం మార్చి 3 మధ్యాహ్నం 3:21కి ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభవుతుంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు సింగపూర్, చైనా వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా కనపడుతుంది. ఈ గ్రహణం సాయంత్రం 6:48కి పూర్తిగా ముగుస్తుంది.
ఏ రాశి వారు చూడకూడదు?
సింహరాశిలో ఈ గ్రహణం సంచరించడం వలన సింహ రాశి వారు గ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణ ప్రభావం సింహ రాశి, కుంభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలను చూపిస్తుంది. మిగిలిన వారికి మధ్యస్థ, అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. చెడు ఫలితాలు ఎదుర్కోబోతున్న ఈ రాశుల వారు గ్రహశాంతులు చేయించుకోవడం మంచిది. అలాగే జపాలు వంటివి మరుసటి రోజు చేయించుకుంటే గ్రహణ దోషాల నుంచి బయటపడవచ్చు.
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు:
గ్రహణ సమయంలో “ఓం నమో భగవతే వాసుదేవాయ”, “శ్రీ రుద్రం” వంటి మంత్రాలను జపిస్తే కూడా శుభఫలితాలు కలుగుతాయి.
గ్రహణానికి ముందు పట్టు స్నానం చేయాలి. గర్భిణీలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో భగవంతుని స్మరించుకోవాలి.
గ్రహణ సమయం పుణ్యకాలం. కాబట్టి ఈ సమయంలో దానాలు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.
ఈ సమయంలో గాయత్రి మంత్రం జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
చంద్రగ్రహణ సమయంలో గోదానం చేయడం కూడా మంచిది.
వెండి, బియ్యం వంటి దానాలు చేస్తే పుణ్యం కలుగుతుంది.
గ్రహణం పూర్తయ్యాక పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుళ్ల ఫోటోలు, విగ్రహాలను కడుక్కోవాలి. ఊరగాయలు మొదలైన నిల్వ పదార్థాలపై దర్భలను వెయ్యండి.
గ్రహణ సమయంలో కొన్ని శివాలయాలు ఎందుకు తెరిచి ఉంటాయి?
గ్రహణ సమయంలో అన్ని ఆలయాలను మూసివేస్తారు. కానీ కొన్ని ఆలయాలు తెరిచి ఉంటాయి. ముఖ్యంగా అరుణాచలం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలు తెరిచే ఉంటాయి. అది ఎందుకంటే అక్కడి శివలింగాలు స్వయంభువులు. స్వయంభువుగా వెలసినవి కావడంతో అవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయని నమ్మకం. అందుకే ఆ క్షేత్రాలను మూసివేయరు. గ్రహణ ప్రభావం నుంచి ఆ దైవశక్తి రక్షిస్తుందని విశ్వాసం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


