తెలుగు మాసాల్లో మార్గశిర మాసం చాలా ఉత్తమమైనది. ఈ విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. “మాసానాం మార్గశీర్షోహమ్” అని అంటారు. మార్గశిర మాసం లక్ష్మీనారాయణుడికి చాలా ఇష్టం. ఈ నెలలో చేయాల్సిన పూజలు, పుణ్య కార్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలు

ఈ రోజున పోలి పాడ్యమి నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. పోలి పాడ్యమి నాడు ప్రవహించే నీటిలో దీపాలను వదులుతారు. పోలి పాడ్యమి కథను చదువుకుంటారు.
తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర మాసం తొమ్మిదవ మాసం. ఈ నెలలో చేసే పూజలు, ఉపవాసాలు ఎంతో మంచి ఫలితాన్ని తీసుకువస్తాయి. సిరి సంపదలను, శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ నెలలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది. అందుకనే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు.
మార్గశిర మాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
నవంబర్ 21 అంటే ఈరోజు నుంచి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ 20 వరకు ఉంటుంది. ఈ నెల రోజులు దీపారాధన చేసి, లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహంతో సంతోషంగా ఉండచ్చు. మరి, ఇక ఈ మాసంలో ఏ పనులు చేస్తే పాపాలు తొలగిపోతాయో తెలుసుకుందాం.
మార్గశిర మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది, పాపలు తొలగిపోతాయి
- మార్గశిర మాసంలో శంఖాన్ని పూజించాలి. శంఖంలో గంగాజలం పోసి ఇంటి నలుమూలలా చల్లాలి. ఇలా చేయడం వలన మనస్పర్థలు తొలగిపోతాయి, సంతోషం కలుగుతుంది, కుటుంబం అంతా ఆనందంగా గడపొచ్చు.
- కృష్ణుడికి ఎంతో ఇష్టమైన భగవద్గీతను మార్గశిర మాసంలో పఠిస్తే ఎంతో మంచిది జరుగుతుంది. గీతా పఠనం ద్వారా సర్వ పాపాలు తొలగిపోతాయి.
- మార్గశిర మాసంలో “ఓం కృష్ణాయ నమః” అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వలన మీ కోరికలన్నీ తీరుతాయి.
- సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మార్గశిర మాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది. ఇది చాలా విశిష్టమైనది.
- ధనుర్మాసంలో ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి, గొబ్బెమ్మలతో అలంకరించాలి.
- ధనుర్మాసం మొదలైన తర్వాత వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పేరిట విష్ణుమూర్తి ఆరాధన చాలా విశేషమైనది.
- శీతాకాలంలో మార్గశిర మాసం వస్తుంది కనుక దుప్పట్లు వంటివి దానం చేస్తే ఎంతో మంచి ఫలితాన్ని చూస్తారు. పుణ్యం కూడా వస్తుంది.
- మార్గశిర మాసంలో తగాదాలకు దూరంగా ఉండాలి.
- ప్రతి గురువారం లక్ష్మీదేవిని ఆరాధిస్తే దరిద్రం పోయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది; ధనవంతులు అవుతారు. విష్ణువుని క్రమం తప్పకుండా ఈ నెలలో ఆరాధించి ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తే కూడా మంచిది.