గతంలో చేసిన తప్పుల గురించి బాధపడుతున్నారా? గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం ఇదే!
జీవితంలో తప్పులు చేయడం సహజం. అయితే గతంలో చేసిన తప్పుల గురించి పదేపదే ఆలోచిస్తూ అపరాధ భావంతో బాధపడటం వల్ల వర్తమానం కూడా దెబ్బతింటుంది. శ్రీమద్భగవద్గీత బోధన ప్రకారం, గతాన్ని మార్చలేము కాబట్టి జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి.
జీవిత ప్రయాణంలో తప్పులు జరగడం చాలా సహజం. కొన్నిసార్లు అనుకోకుండా తీసుకునే నిర్ణయాలు, మరికొన్నిసార్లు నోటి నుంచి వచ్చిన మాటలు ఇతరుల మనసును గాయపరుస్తుంటాయి. కాలం గడిచిపోయినా ఆ సంఘటనలు మనసును వెంటాడుతూనే ఉంటాయి. "అలా చేసి ఉండకూడదు" అనే ఆలోచన నిద్రలేకుండా చేస్తుంది. అయితే గతాన్ని మార్చలేమని తెలిసినా, ఆ జ్ఞాపకాల బరువుతో నేటి జీవితాన్ని నష్టపోవడం సమంజసం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీమద్భగవద్గీత) మనకు అందించే దిశానిర్దేశం ఏమిటంటే, జరిగిన పొరపాటులో కూరుకుపోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగడమే అసలైన జీవన మార్గం.

అపరాధ భావం: హెచ్చరిక మాత్రమే, శాశ్వత శిక్ష కాదు
మనసులో తప్పు చేశామనే భావన కలగడం సాధారణమైన విషయమే. ఇది మనం తప్పును గుర్తించడానికి ఒక సంకేతంగా పనిచేస్తుంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలామంది ఆ తప్పును అంగీకరించి సరిదిద్దుకునే బదులు తమను తాము నిరంతరం శిక్షించుకుంటూ కుంగిపోతుంటారు. గీత బోధించే కర్మ సిద్ధాంతం ప్రకారం, జరిగిపోయిన దానికి కుమిలిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ అపరాధ భావాన్ని కేవలం ఒక హెచ్చరికలా స్వీకరించాలే తప్ప, మన మొత్తం ఉనికిని, ఉత్సాహాన్ని అణచివేసేలా దానిని అనుమతించకూడదు.
పశ్చాత్తాపమే ఉత్తమ గురువు
ఎవరి జీవితంలోనైనా గతం శాశ్వతంగా మారిపోయింది. దానిని వెనక్కి తీసుకురావడం ఎవరివల్లూ కాదు. "నేను ఆ తప్పు ఎందుకు చేశాను?" అని వందసార్లు ఆలోచించడం వల్ల ఉన్న వర్తమానం కూడా పాడైపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి గీత ఇస్తున్న సందల్శం స్పష్టంగా ఉంది. పశ్చాత్తాపాన్ని బలహీనతగా మార్చుకోకుండా, భవిష్యత్తులో అలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసే ఉపాధ్యాయుడిగా భావించాలి. ఆ ఘటన మనకు నేర్పిన పాఠం ఏమిటో విశ్లేషించుకుని అడుగు ముందుకు వేయడమే పరిణతి.
ఆత్మ విమర్శ మరియు సరిదిద్దుకునే మార్గం
ఒకవేళ మీ తప్పు కారణంగా ఇతరులకు నష్టం జరిగి ఉంటే, కేవలం లోలోపల బాధపడటం సరిపోదు. సాధ్యమైనంతవరకు క్షమాపణ కోరడం, జరిగిన నష్టానికి పూరించడం లేదా మీ ప్రవర్తనను మార్చుకోవడం చాలా అవసరం. మనిషి గుర్తింపు అతను చేసిన పొరపాట్ల ద్వారా రాదు, ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి తీసుకున్న సాహసోపేతమైన అడుగుల ద్వారానే సమాజంలో గౌరవం లభిస్తుంది. సక్రమమైన మార్గంలో ప్రయాణించడమే నిజమైన ధర్మం.
వర్తమానమే అసలైన శక్తి
గీతలో చెప్పిన ధర్మం కేవలం పూజలకు మాత్రమే పరిమితం కాదు. ప్రతి క్షణం బాధ్యతాయుతంగా, స్పృహతో వ్యవహరించడమే అసలైన ధర్మం. మానవుడు గతాన్ని మార్చలేడు, భవిష్యత్తును పూర్తిగా అంచనా వేయలేడు. కేవలం తన చేతిలో ఉన్న ఏకైక అస్త్రం నేటి వర్తమానం మాత్రమే. ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా, ప్రస్తుత క్షణంలో తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించేవాడే నిజమైన విజేత. పాత జ్ఞాపకాల బరువును దించుకుని, నేటి రోజును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడమే జీవితాన్ని సార్థకం చేసుకునే రహస్యం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


