భగవద్గీత ప్రకారం ఈ 3 దుర్గుణాలు జీవితాన్ని నాశనం చేస్తాయి.. జీవితం నరకప్రాయమే.. జాగ్రత్త!
శ్రీమద్భగవద్గీతలోని పదహారవ అధ్యాయం ప్రకారం అతి కోరిక, కోపం, దురాశ అనే మూడు దుర్గుణాలు మనిషి పతనానికి ప్రధాన కారణాలు. అతి కోరిక అసంతృప్తిని పెంచి తప్పు మార్గాల వైపు నడిపిస్తే, కోపం సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దురాశ స్వార్థాన్ని పెంచి అన్యాయ మార్గాల్లో నడిపిస్తుంది.
హిందూ సనాతన ధర్మంలో శ్రీమద్భగవద్గీతకు అత్యున్నత స్థానం ఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గ్రంథం కేవలం పూజలకు పరిమితమైనది కాదు; మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి మానసిక సంఘర్షణకు ఇది ఒక దిక్సూచి.

కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఏం చేయాలో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతాసారం నేటి ఆధునిక కాలంలోనూ మనిషి పురోగతికి మార్గదర్శకం అవుతోంది. మనిషి తన జీవితంలో ఎదుర్కొనే దుఃఖాలకు, అశాంతికి తనలోని కొన్ని చెడు అలవాట్లే కారణమని గీత స్పష్టం చేస్తోంది.
పతనానికి దారితీసే మూడు మార్గాలు
శ్రీమద్భగవద్గీతలోని పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకంలో మనిషి సర్వనాశనానికి తలుపులు తెరిచే మూడు ప్రధాన దుర్గుణాల గురించి శ్రీకృష్ణుడు స్పష్టంగా హెచ్చరించారు. ఈ దుర్గుణాలే మనిషిని నిరంతరం అశాంతి వైపు నడిపిస్తాయని ఆయన బోధించారు.
"కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్" అని భగవద్గీత పేర్కొంటోంది. అంటే అతి కోరిక, కోపం, దురాశ అనే ఈ మూడు ఆత్మను నాశనం చేసే నరక ద్వారాలని శ్రీకృష్ణుడు చెప్పారు.
అతి కోరిక (హద్దులు దాటిన ఆశలు)
జీవితంలో కోరికలు ఉండటం సహజమే. కానీ అవి హద్దులు దాటితే సర్వనాశనం తప్పదు. కోరికలు తీరకపోతే మనిషిలో అసంతృప్తి మొదలవుతుంది. ఆ అశాంతి అతన్ని అక్రమ మార్గాల వైపు, అబద్ధాల వైపు నడిపిస్తుంది. ఇతరుల విజయాలను చూసి అసూయపడేలా చేస్తుంది. అందుకే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం అత్యంత అవసరమని గీత బోధిస్తోంది.
కోపం (ఆవేశం – సరైన ఆలోచన కోల్పోవడం)
కోపం మనిషికి అతిపెద్ద శత్రువు. తీవ్రమైన కోపం వచ్చినప్పుడు మనిషి మంచి–చెడులను గుర్తించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతాడు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్నే ఛిన్నాభిన్నం చేస్తాయి. కోపం వల్ల ఇతరులను దూషించడం, హింసకు పాల్పడటం జరుగుతుంది. అందుకే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సంయమనం కోల్పోకూడదని గీత బోధిస్తోంది.
దురాశ (అత్యాశ – స్వార్థం)
డబ్బుపై లేదా వస్తువులపై అతిగా ఆశపడటమే దురాశ. ఈ దురాశ మనిషిని స్వార్థపరుడిగా మారుస్తుంది. పదిమందితో కలిసిమెలిసి ఉండే మనిషిని ఒంటరిగా చేస్తుంది. అన్యాయంగా సంపాదించాలనే ఆలోచనను ప్రేరేపిస్తుంది. కష్టపడి సంపాదించుకున్న దానితో సంతృప్తి చెందకుండా, ఇతరుల ఆస్తిపై కన్నేసేలా చేసే ఈ దురాశే మనిషి జీవితాన్ని నరకంలా మారుస్తుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


