Pitru Paksha 2026 : పితృపక్షాలు ఎప్పటి నుంచి మెుదలవుతాయి? ఒకే రోజున చతుర్థి, పంచమి తిథులు!

Pitru Paksha 2026 : ఈ ఏడాది పితృపక్షాలు సెప్టెంబర్‌లో మెుదలవుతాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ 30వ తేదీన ఒకే రోజున చతుర్థి, పంచమి తిథుల శ్రాద్ధాలు వస్తాయి. పితృపక్షాలు 2026 – పూర్తి శ్రాద్ధ తిథుల క్యాలెండర్ ఇక్కడ చూడండి.

Published on: Aug 30, 2026, 13:35:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన పూర్వీకులకు, పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించి, వారి ఆశీస్సులు పొందే అత్యంత పవిత్రమైన సమయం పితృపక్షం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే ఈ పదిహేను రోజుల్లో పితృదేవతలను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, దానధర్మాలు నిర్వహిస్తుంటారు.

పితృపక్షాలు 2026
పితృపక్షాలు 2026

2026 సంవత్సరంలో పితృపక్షాల తేదీల్లో ఒక ప్రత్యేకమైన మార్పు చోటుచేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఒకే రోజున చతుర్థి, పంచమి తిథుల శ్రాద్ధాలు రానున్నాయి. తిథి క్షయం కారణంగా ఈ రెండు శ్రాద్ధాలు ఒకే తేదీన వచ్చాయి. దీనివల్ల సాధారణంగా ఉండే క్యాలెండర్ లెక్కింపులో ఒక రోజు తేడా కనిపిస్తుంది.

ఈ సంవత్సరం పితృపక్షాల ప్రధాన క్రమం సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమై అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. అంతకంటే ముందుగా సెప్టెంబర్ 26న పౌర్ణమి శ్రాద్ధం జరగనుంది. సెప్టెంబర్ 26 శనివారం నాడు పౌర్ణమి శ్రాద్ధం నిర్వహించాలి. ఆ మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 27 ఆదివారం నుండి ఆశ్వయుజ కృష్ణ పక్ష ప్రతిపద (పాడ్యమి) తిథితో పితృపక్షాల ప్రధాన శ్రాద్ధ కార్యాలు ప్రారంభమవుతాయి.

సెప్టెంబర్ 28: ద్వితీయా (విదియ) శ్రాద్ధం.

సెప్టెంబర్ 29: తృతీయ (తదియ) శ్రాద్ధం. ఈ రోజునే 'మహాభరణి' నక్షత్ర సంయోగం కూడా ఉంది. పితృపక్షాల్లో మహాభరణి రోజున శ్రాద్ధం పెట్టడం ఎంతో విశేషమైనదిగా పండితులు భావిస్తారు.

సెప్టెంబర్ 30న చతుర్థి, పంచమి – అత్యంత ముఖ్యమైన రోజు:

ఈ ఏడాది పితృపక్షాల్లో అత్యంత శ్రద్ధగా గమనించాల్సిన రోజు సెప్టెంబర్ 30 (బుధవారం). ఈ ఒక్కరోజే చతుర్థి, పంచమి రెండు తిథుల శ్రాద్ధాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఒక తిథి క్షయం కావడం వలన ఈ రెండు పితృ కర్మలు ఒకే ఆంగ్ల తేదీన వచ్చాయి. అందుకే సెప్టెంబర్ 30 తర్వాత వచ్చే శ్రాద్ధాల తేదీల జాబితాలో ఒక రోజు వ్యత్యాసం కనిపిస్తుంది.

పితృపక్షాలు 2026 – పూర్తి శ్రాద్ధ తిథుల క్యాలెండర్

సెప్టెంబర్ 26 (శనివారం): పౌర్ణమి శ్రాద్ధం

సెప్టెంబర్ 27 (ఆదివారం): ప్రతిపద (పాడ్యమి) శ్రాద్ధం

సెప్టెంబర్ 28 (సోమవారం): ద్వితీయా (విదియ) శ్రాద్ధం

సెప్టెంబర్ 29 (మంగళవారం): తృతీయ (తదియ) శ్రాద్ధం, మహాభరణి

సెప్టెంబర్ 30 (బుధవారం): చతుర్థి, పంచమి శ్రాద్ధం (రెండు తిథులు ఒకే రోజు)

అక్టోబర్ 1 (గురువారం): షష్ఠి శ్రాద్ధం

అక్టోబర్ 2 (శుక్రవారం): సప్తమి శ్రాద్ధం

అక్టోబర్ 3 (శనివారం): అష్టమి శ్రాద్ధం

అక్టోబర్ 4 (ఆదివారం): నవమి శ్రాద్ధం (అవిధవా నవమి)

అక్టోబర్ 5 (సోమవారం): దశమి శ్రాద్ధం

అక్టోబర్ 6 (మంగళవారం): ఏకాదశి శ్రాద్ధం

అక్టోబర్ 7 (బుధవారం): ద్వాదశి శ్రాద్ధం, మఘా శ్రాద్ధం

అక్టోబర్ 8 (గురువారం): త్రయోదశి శ్రాద్ధం

అక్టోబర్ 9 (శుక్రవారం): చతుర్దశి శ్రాద్ధం

అక్టోబర్ 10 (శనివారం): సర్వపితృ అమావాస్య (మహాలయ అమావాస్య)

ఏ రోజున శ్రాద్ధం నిర్వహించాలి?

శాస్త్రాల ప్రకారం మన కుటుంబంలోని పెద్దలు లేదా పితృదేవతలు ఏ తిథినాడు పరమపదించారో, పితృపక్షంలో వచ్చే అదే తిథి రోజున వారికి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహించడం ఆనవాయితీ. కేవలం ఆంగ్ల క్యాలెండర్ తేదీలను బట్టి కాకుండా తిథి ఆధారంగానే దీనిని నిర్ణయిస్తారు.

ఒకవేళ పితృదేవతల మరణ తిథి తెలియకపోయినా, లేదా ఏదైనా అనివార్య కారణాల వల్ల నిర్ణీత తిథి రోజున శ్రాద్ధం పెట్టడం కుదరకపోయినా కంగారు పడాల్సిన పనిలేదు. అక్టోబర్ 10న వచ్చే సర్వపితృ అమావాస్య(మహాలయ అమావాస్య) నాడు పితృదేవతలందరికీ శ్రాద్ధం నిర్వహించవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

అక్టోబర్ 10న సర్వపితృ అమావాస్య

పితృపక్షాలు అక్టోబర్ 10, శనివారం నాడు సర్వపితృ అమావాస్యతో ముగుస్తాయి. మరణ తిథి తెలియని వారికి, అలాగే పితృపక్షాల్లో శ్రాద్ధం పెట్టలేకపోయిన వారికి ఈ రోజు అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ ఏడాది పితృపక్షాల్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం సెప్టెంబర్ 30న చతుర్థి, పంచమి శ్రాద్ధాలు ఒకే రోజు రావడం. కుటుంబ సభ్యులు తమ ప్రాంతీయ పంచాంగం, ఇంటి పురోహితుల సలహా మేరకు సరైన తిథి ఆధారంగా పితృ తర్పణాలు అర్పిస్తే మంచిది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More