కృష్ణాష్టమి 2026 ఎప్పుడు? అష్టమి తిథి, పూజా విధానం, నిషిత కాల పూజా సమయం వివరాలు!
జన్మాష్టమి తేదీ 2026: జన్మాష్టమి పండుగను శ్రీకృష్ణుడికి అంకితం చేస్తారు. శ్రీకృష్ణుని బాల రూపాన్ని ఆరాధించడం మరియు ఉపవాసం చేయడం ద్వారా ఆశించిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు ఉందో తెలుసుకోండి.
హిందూ సనాతన ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ప్రతి ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి దేశవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడానికి భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5253వ జయంతిని జరుపుకోనున్నారు. అయితే అష్టమి తిథి, రోహిణి నక్షత్రం రాకలో ఉన్న సమయాల కారణంగా ఈ పండుగ తేదీ విషయంలో భక్తుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. అసలు ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు, పూజకు సరైన సమయం ఏంటో తెలుసుకుందాం.
ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడంటే?
పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని కృష్ణ అష్టమి తిథి సెప్టెంబర్ 4, 2026 నాడు తెల్లవారుజామున 02:25 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రామాణికతను బట్టి చాలామంది సెప్టెంబర్ 4వ తేదీనే జన్మాష్టమి పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే భక్తులు మాత్రం సెప్టెంబర్ 5వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు.
జన్మాష్టమి పూజా ముహూర్తం
కృష్ణ జన్మాష్టమి రోజున అర్ధరాత్రి వేళ చేసే పూజకు అత్యంత విశిష్టత ఉంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్ర యుక్త అష్టమి నాడు అర్ధరాత్రి జన్మించాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 నిమిషాల నుంచి ప్రారంభమై అర్ధరాత్రి 12:43 నిమిషాల వరకు నిషిత కాల పూజా ముహూర్తం ఉంటుంది. ఈ పవిత్ర సమయంలో బాలగోపాలుడిని పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఉపవాస దీక్ష పారణ సమయం
జన్మాష్టమి రోజున కఠిన నిష్టతో ఉపవాసం ఉండే భక్తులు మరుసటి రోజు దీక్ష విరమిస్తారు. సెప్టెంబర్ 5, 2026 నాడు సూర్యోదయం తర్వాత ఉపవాస విరమణ చేయవచ్చు. ఆ రోజు ఉదయం 05:47 గంటలకు సూర్యోదయం అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా నిష్టగా ఉపవాసాన్ని ముగించవచ్చు.
కృష్ణాష్టమి పూజా విధానం
జన్మాష్టమి శుభ ముహూర్తంలో ముద్దుల బాలగోపాలుడికి ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయాలి.
అభిషేకం ముగిశాక లడ్డూ గోపాలుడికి నూతన వస్త్రాలు ధరింపజేసి, సుందరంగా అలంకరించాలి.
శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, పాలు నైవేద్యంగా సమర్పించాలి.
శంఖారావాలు, గంటానాదాల మధ్య భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడికి హారతి ఇవ్వాలి.
ఆ తర్వాత అందమైన ఉయ్యాలలో బాలకృష్ణుడిని ఉంచి జోలపాటలతో ఊయల ఊపాలి.
పూజా కార్యక్రమం పూర్తయ్యాక కుటుంబ సభ్యులందరికీ ప్రసాదం పంచాలి.
కృష్ణాష్టమి విశిష్టత
పురాణ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండి స్వామిని పూజించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతిమంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. అగ్ని పురాణంలో పేర్కొన్న దాని ప్రకారం జన్మాష్టమి వ్రతం ఆచరించిన వారికి జన్మజన్మల పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


