వరలక్ష్మీ వ్రతం 2026 ఎప్పుడు? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పూజా నియమాలు!

వరలక్ష్మీ వ్రతం 2026 ఆగస్టు 21న జరుపుకుంటారు. వ్రతం తేదీ, పూజా విధానం, కలశ స్థాపన ప్రాముఖ్యత, జపించాల్సిన మంత్రం, పౌరాణిక కథ, వరలక్ష్మీ వ్రతం వల్ల కలిగే ఆధ్యాత్మిక, ఐశ్వర్య ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Aug 5, 2026, 12:30:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రావణమాసం చాలా విశేషమైన మాసం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు అందరూ కూడా ఆచరిస్తారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరీ దేవి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది? తేదీ, ప్రాముఖ్యతతో పాటు అసలు ఎందుకు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చేసుకోవాలి వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

వరలక్ష్మీ వ్రతం 2026 ఎప్పుడు? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పూజా నియమాలు! (pinterest)
వరలక్ష్మీ వ్రతం 2026 ఎప్పుడు? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పూజా నియమాలు! (pinterest)

వరలక్ష్మీ వ్రతం 2026 తేదీ

ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు వచ్చింది. ప్రతి ఏడాది శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. మహాలక్ష్మీ దేవిని ప్రత్యేకించి కొలుస్తారు. దీపం, ధూపం, నైవేద్యాలను సమర్పిస్తారు. కొత్త చీర, జాకెట్ ముక్క, ఆభరణాలు, డబ్బులు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు కొనుగోలు చేసి వరలక్ష్మీ దేవికి సమర్పించి, ఆ తర్వాత వాటిని ధరిస్తారు.

వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత

'వర' అంటే వరం. వరలక్ష్మి అంటే అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి. వరలక్ష్మీ దేవిని ఆరాధించడం వల్ల సంపద, ఆరోగ్యం, ధైర్యం, సంతానం మొదలైనవి కలుగుతాయని నమ్మకం.

వివాహిత స్త్రీలు భర్త ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబం క్షేమంగా ఉండాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ములను పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతారు.

ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి

"ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాన్ని చూడొచ్చు. అలాగే శ్రీ సూక్తం పారాయణం చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలను పొందవచ్చు.

వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు కలశం ఎందుకు పెడతారు?

కలశం అంటే శుభానికి, సంపదకు, దైవ సాన్నిధ్యానికి ప్రతీక. కచ్చితంగా వరలక్ష్మీ దేవిని ఆరాధించేటప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. కొబ్బరికాయ, మామిడి ఆకులతో అమ్మవారి ముఖాన్ని అలంకరించిన కలశాన్ని తప్పకుండా ప్రతిష్ఠించి పూజించాలి.

అలాగే తొమ్మిది ముడులు వేసిన తోరాన్ని పూజ చేసి చేతికి కట్టుకోవాలి. ఆరోజు కచ్చితంగా వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదివి అమ్మవారికి పుష్పాలతో పూజ చేయాలి.

పూజ ఎలా చేసుకోవాలి?

శుభ్రమైన ప్రదేశంలో బియ్యం మీద కలశాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై కొబ్బరికాయ, మామిడి ఆకులు ఉంచి అమ్మవారి ముఖంతో అలంకరించాలి. కుంకుమ, పసుపు, పూలు, గాజులు, నైవేద్యం వంటి పూజా సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని అమ్మవారికి సమర్పించాలి.

ఆ రోజు ఇంటిని శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, కలశ స్థాపన చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజలు చేయాలి. అలాగే ఇంటికి ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తే మరింత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు.

ఈ వ్రతాన్ని ఎందుకు శ్రావణమాసంలో జరుపుకోవాలి?

ఈ వ్రతం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. చారుమతి అనే పవిత్రమైన స్త్రీకి ఒక రోజు లక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి, ఈ వ్రతాన్ని ఆచరిస్తే అన్ని కోరికలు నెరవేరుస్తానని చెప్పింది. చారుమతి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు లభించాయి. అప్పటి నుంచి మహిళలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు.

ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనధాన్యాలకు కొరత ఉండదు. సంతానం లేని వారికి సంతానం కలిగే భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇంటి నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోయి ప్రశాంతత, సంతోషం నెలకొంటాయని భక్తుల నమ్మకం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More