...
...
Next Story

జులై 26న రవి ప్రదోష వ్రతం : అరుదైన శుభ యోగాలు - శివపూజ ముహూర్తం, ప్రాముఖ్యత ఇవే!

2026 జులై 26న ఆషాఢ మాస శుక్ల పక్ష త్రయోదశి సందర్భంగా రవి ప్రదోష వ్రతం రానుంది. సర్వార్ధ సిద్ధి, ఇంద్ర యోగాల కలయికతో వస్తున్న ఈ పవిత్ర రోజున శివారాధన ముహూర్తం, విశిష్టత పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 25, 2026, 17:29:40 IST
Advertisement

సనాతన ధర్మంలో శివారాధనకు అత్యంత విశిష్టమైనదిగా ప్రదోష వ్రతాన్ని భావిస్తారు. ఈ క్రమంలో జులై మాసంలో వచ్చే చివరి ప్రదోష ఉపవాసం 2026 జులై 26వ తేదీ ఆదివారం రానుంది. ఆదివారం నాడు వచ్చే ప్రదోష వ్రతాన్ని 'రవి ప్రదోష వ్రతం' అని పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష త్రయోదశి తిథి రోజున ఈ పవిత్రమైన ఉపవాస దినాన్ని భక్తులు జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రదోష కాలంలో, అంటే సాయంత్ర వేళలో పరమశివుడిని ప్రత్యేకంగా ఆరాధించే ఆచారం శతాబ్దాలుగా వస్తోంది. విశేషమేమిటంటే, ఈసారి రవి ప్రదోష వ్రతం రోజున 'సర్వార్ధ సిద్ధి యోగం'తో పాటు 'ఇంద్ర యోగం' వంటి రెండు అత్యంత శుభప్రదమైన యోగాలు కలసి వస్తున్నాయి. ఈ పవిత్ర వ్రతం యొక్క ప్రాముఖ్యత, పూజా ముహూర్తం, సాయంత్ర వేళల్లోనే శివుడిని ఎందుకు ఆరాధించాలి అనే విషయాలను సమగ్రంగా తెలుసుకుందాం.

రవి ప్రదోష వ్రతం 2026
రవి ప్రదోష వ్రతం 2026

జ్యోతిష్యశాస్త్రం ప్రకార.., రవి ప్రదోష వ్రతం శివునికి అంకితమైన అత్యంత ఫలవంతమైన రోజులలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. ఆషాఢ శుక్ల త్రయోదశి తిథి జులై 26వ తేదీ మధ్యాహ్నం 1:57 గంటలకు ప్రారంభమై, జులై 27వ తేదీ సాయంత్రం 4:14 గంటల వరకు కొనసాగుతుంది. ఆదివారం నాడు వచ్చే ఈ ప్రదోష ఉపవాసానికి సకల పాపాలను హరించి, ప్రతికూలతలను తొలగించే శక్తి ఉందని భక్తుల నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం శివలింగానికి భక్తిశ్రద్ధలతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా, మన కోరికలు నెరవేరుతాయి. నిజమైన భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే బోళాశంకరుని పరిపూర్ణ కృపాకటాక్షాలు లభిస్తాయి.

శివారాధనకు ప్రదోష కాలం అత్యంత శ్రేష్ఠమైనది. జులై 26న సాయంత్రం పూజ చేయడానికి అనుకూలమైన శుభ ముహూర్తం రాత్రి 7:16 గంటల నుంచి రాత్రి 9:21 గంటల వరకు ఉంది.

  • శుభ-ఉత్తమ ముహూర్తం: రాత్రి 7:16 గంటల నుంచి రాత్రి 8:34 గంటల వరకు ఉంటుంది.
  • అమృత-సర్వోత్తమ ముహూర్తం: రాత్రి 8:34 గంటల నుంచి రాత్రి 9:52 గంటల వరకు ఉంటుంది.
  • బ్రహ్మ ముహూర్తం: ఉదయం 4:16 గంటల నుంచి ఉదయం 4:58 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
  • అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు ఉంది.

ఈసారి రవి ప్రదోష వ్రతం రోజున ఇంద్ర యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ఒకేసారి ఏర్పడుతున్నాయి. జులై 26 ఉదయం సూర్యోదయం నుంచి రాత్రి 10:05 గంటల వరకు ఇంద్ర యోగం చురుకుగా ఉంటుంది. అలాగే జులై 27 ఉదయం 7:34 గంటల వరకు సర్వార్ధ సిద్ధి యోగం కొనసాగుతుంది. ప్రదోష పూజ జరిగే సమయంలోనే ఈ రెండు శుభ యోగాలు ఉండటం అత్యంత విశేషం. సర్వార్ధ సిద్ధి యోగ కాలంలో శివుడిని అర్చించడం వల్ల చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. కాబట్టి భక్తులు ఈ అరుదైన అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు.

శివపూజ ఎందుకు చేయాలి…?

ప్రదోష వ్రతంలో సాయంత్రం పూటకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పూజను పగటిపూట కాకుండా 'ప్రదోష కాలం' అంటే సూర్యాస్తమయం తర్వాతే నిర్వహించాలి. పురాణాల ప్రకారం, ప్రతి నెలా త్రయోదశి నాడు సాయంత్రం సమయంలో పరమశివుడు కైలాసంలో అత్యంత ఆనందంతో తాండవ నృత్యం చేస్తాడు. శివుడు అంత్యంత ప్రసన్నంగా ఉండే ఈ సమయంలో భక్తులు చేసే ప్రార్థనలు, కోరికలు సులభంగా నెరవేరుతాయి. పగటిపూట నిత్య పూజలు నిర్వహించినప్పటికీ, ప్రదోష వ్రతానికి సంబంధించిన ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు సాయంత్రమే చేయాలి.

వ్రతం ఆచరించే భక్తులు ఉదయమే మేల్కొని స్నానాధికాలు పూర్తి చేసుకుని సాత్విక ఆహారం లేదా ఫలహారం తీసుకోవాలి. సాయంత్రం ప్రదోష కాలంలో శివలింగానికి పాలు, స్వచ్ఛమైన నీరు, మారేడు దళాలు (బిల్వ పత్రాలు), ఉమ్మెత్త పువ్వులు సమర్పించి అభిషేకం చేయాలి. "ఓం నమః శివాయ" అనే మహా మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ఆ తర్వాత ప్రదోష వ్రత కథను పఠించి లేదా విని, మంగళ హారతి ఇవ్వాలి. పూజ ముగిసిన అనంతరం ప్రసాదాన్ని పంచిపెట్టాలి. మనస్సులోని అహంకారాన్ని, వికారాన్ని వీడి నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తే కరుణామయుడైన పరమశివుడు సకల శుభాలను ప్రసాదిస్తాడు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks