ఈరోజు సంకటహర చతుర్థి+శుక్రవారం+శ్రవణ నక్షత్రం.. గణేశ పంచరత్నంతో వీటిని చదువుకుంటే మంచిది!

జూలై 3 శుక్రవారం వచ్చిన సంకటహర చతుర్థి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజించి గణేశ పంచరత్నం 11 సార్లు లేదా సంకటనాశన గణేశ స్తోత్రం 9 సార్లు పారాయణం చేస్తే విఘ్నాలు తొలగి శుభఫలాలు కలుగుతాయని విశ్వాసం.  

Published on: Jul 3, 2026, 08:01:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విఘ్నాలను తొలగించడానికి వినాయకుడిని మనం ఆరాధిస్తాము. ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టాలన్నా, పెళ్లిళ్లు వంటివి జరపాలన్నా కచ్చితంగా మొట్టమొదట గణపతిని పూజిస్తాము. అయితే, జూలై 3, శుక్రవారం అనగా ఈరోజు సంకటహర చతుర్థి. ఈ విశేష దినాన వినాయకుడిని ఆరాధించి, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే ఆ వినాయకుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. పైగా, ఈరోజు శ్రవణ నక్షత్రం. ఇది వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. అందులోనూ శుక్రవారం కలిసి రావడం మరింత విశేషం. శుక్రవారాన్ని సద్వినియోగం చేసుకుని, ఈరోజును సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు.

ఈరోజు సంకటహర చతుర్థి+శుక్రవారం+శ్రవణ నక్షత్రం.. గణేశ పంచరత్నంతో వీటిని చదువుకుంటే మంచిది! (pinterest)
ఈరోజు సంకటహర చతుర్థి+శుక్రవారం+శ్రవణ నక్షత్రం.. గణేశ పంచరత్నంతో వీటిని చదువుకుంటే మంచిది! (pinterest)

గణేశ పంచరత్నాన్ని చదువుకుంటే మంచిది

ఈరోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి, గణేశ పంచరత్నాన్ని 11 సార్లు చదువుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. సంకటనాశన గణేశ స్తోత్రం 9 సార్లు పారాయణం చేస్తే కూడా విశేషమైన ఫలితాలను చూడొచ్చు. ఒకవేళ ఇవేమీ చదువుకోలేకపోయినట్లయితే "ఓం గం గణపతయే నమః" మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

వినాయకుడికి వీటిని నైవేద్యంగా సమర్పించాలి

వినాయకుడికి ఈ విశేష పర్వదినాన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టడం మంచిది. బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించండి. అలాగే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన గరికను సమర్పించండి. వినాయకుడు కరుణించి మీ కోరికలన్నీ కూడా తీరుస్తాడు.

త్వరగా వివాహం కుదరాలంటే సంకటహర చతుర్థినాడు ఇలా చేయండి

ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి, వివాహం త్వరగా జరగాలన్నా, పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్లిపోకుండా రావాలన్నా లక్ష్మీనారాయణ అష్టకం పారాయణం చేయండి.

అలాగే వెంకటేశ్వర వజ్రకవచం తొమ్మిది సార్లు పారాయణం చేస్తే కూడా మంచిది.

గణేశ పంచరత్నం

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం

కళాధరావతంసకం విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం

నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం

నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం

మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం

సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం

దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం

మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం

పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం

ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం

కపోల దానవారణం భజే పురాణ వారణం

నితాంత కాంత దంతకాంతి మంతకాంత కాత్మజం

అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం

తమేకదంతమేవ తం విచింతయామి సంతతం

ఫలశృతి

మహాగణేశ పంచరత్నమాదరేణ యో న్వహం

ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్

అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం

సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సో చిరాత్

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More