నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇలా పూజ చేయండి!
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఉదయం అభ్యంగన స్నానం చేసి, పూజా మందిరాన్ని శుభ్రం చేసి, ఉపవాస సంకల్పం చేసుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తులసి దళాలు, వెన్న, మిశ్రి వంటి పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.
శ్రీకృష్ణ జన్మాష్టమి: నేడు దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం సంకల్పం నుంచి అర్ధరాత్రి జరిగే లడ్డూ గోపాలుడి అభిషేకం వరకు రోజంతా పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

భారతీయ సంస్కృతిలో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే ఈ పర్వదినం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కృష్ణాష్టమి రోజు కేవలం అర్ధరాత్రి పూజ మాత్రమే కాకుండా, తెల్లవారుజాము నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇళ్లన్నీ గోకులాలను తలపిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతాయి.
ఉదయం పూట చేయాల్సిన ఏర్పాట్లు
పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
ఇంటిలోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించాలి.
రోజంతా ఉపవాసం ఉండాలని భావించేవారు దేవుడి ముందు ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకోవాలి.
పూజకు అవసరమైన ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో పాటు తులసి దళాలు, పండ్లు, తాజా వెన్న, మిశ్రి వంటి పూజా సామగ్రిని ఉదయమే సిద్ధం చేసుకోవాలి.
మధ్యాహ్నం నాటికి సిద్దం కావాల్సిన ఏర్పాట్లు
కృష్ణాష్టమి వేడుకల్లో బాలా గోపాలుడికి ఊయల కట్టడం అత్యంత ప్రధానమైన ఘట్టం. మధ్యాహ్నానికల్లా ఉయ్యాలను పూలు, అందమైన వస్త్రాలతో అలంకరించి సిద్ధం చేయాలి. లడ్డూ గోపాలుడికి నూతన వస్త్రాలు ధరించి దివ్యమైన అలంకరణ చేయాలి. భక్తులు తమ తీరికను బట్టి రోజంతా కృష్ణ నామస్మరణ, భజనలు లేదా భగవద్గీత పఠనం చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
శ్రీకృష్ణ జన్మాష్టమి రాత్రి పూజా సమయం - నిషిత కాల ముహూర్తం
నేడు రాత్రి 11:57 గంటల నుంచి తెల్లవారుజామున 12:43 గంటల వరకు నిశిత కాల పూజా ముహూర్తం ఉంది. సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి శ్రీకృష్ణుడి జననం జరగనుండటంతో దేశవ్యాప్తంగా దేవాలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు ఊపందుకుంటాయి. అర్ధరాత్రి వేళ లడ్డూ గోపాలుడికి పంచామృతాలతో అభిషేకం చేసి, కొత్త బట్టలు అలంకరించి, తులసి దళాలు సమర్పిస్తారు. వెన్న, మిశ్రి నైవేద్యంగా పెట్టి శంఖారావాలు, గంటల మోతల మధ్య హారతి ఇస్తారు. అనంతరం బాల గోపాలుడిని ఉయ్యాలలో ఊపుతూ సంబరాలు చేసుకుంటారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


