శ్రావణ మాసంలో ఈ సంవత్సరం ఒక విశేష ఖగోళ సంఘటన చోటు చేసుకోనుంది. ఒకే పక్షంలో వరుసగా సూర్యగ్రహణం మరియు చంద్ర గ్రహణం సంభవించనున్నాయి. ఆగస్టు 12, 2026 న హరియాళీ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28, 2026 న శ్రావణ పౌర్ణమి (రక్షాబంధన్) రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్నాయి. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించవు. అందువల్ల భారతదేశంలో సూతక కాలం వర్తించదు.

ధర్మశాస్త్రాల ప్రకారం “దృశ్యగ్రహణే సూతకం” అనే సిద్ధాంతం ప్రామాణికం. అంటే ఏ ప్రాంతంలో గ్రహణం ప్రత్యక్షంగా కనిపిస్తుందో ఆ ప్రాంతానికే సూతకం వర్తిస్తుంది. కనిపించని గ్రహణాలకు సూతకాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అందువల్ల దేవాలయాలు మూసివేయడం, నిత్యపూజలను నిలిపివేయడం లేదా పర్వదినాలను వాయిదా వేయడం శాస్త్రసమ్మతం కాదు.
హరియాళీ అమావాస్య పూజలు యథావిధిగా
హరియాళీ అమావాస్య రోజున భక్తులు యథావిధిగా పవిత్ర స్నానాలు, పితృతర్పణం, దానధర్మాలు, వృక్షారోపణ, పరమశివుని ఆరాధన, పార్వతీదేవి పూజలను నిర్వహించవచ్చు. గ్రహణం భారతదేశంలో కనిపించనందున ఈ ధార్మిక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేదని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.
రక్షాబంధన్ వేడుకలకు ఆటంకం లేదు
శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రక్షాబంధన్, ఉపాకర్మ, యజ్ఞోపవీత ధారణ, పౌర్ణిమ పూజలు, వేదపారాయణాలు, కుటుంబ ఆచారాలు అన్నీ యథావిధిగా నిర్వహించవచ్చు. చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించకపోవడంతో శాస్త్రపరంగా ఎలాంటి నిషేధాలు ఉండవు.
ఖగోళ శాస్త్ర దృష్టిలో
సూర్యగ్రహణం చంద్రుడు భూమి మరియు సూర్యుని మధ్యకు వచ్చినప్పుడు సంభవిస్తుంది. చంద్రగ్రహణం భూమి నీడ చంద్రునిపై పడినప్పుడు ఏర్పడుతుంది. అమావాస్యనాడు సూర్యగ్రహణం, పౌర్ణమినాడు చంద్రగ్రహణం ఏర్పడటం సహజమైన ఖగోళ ప్రక్రియ అయినప్పటికీ, ఒకే పక్షంలో రెండు గ్రహణాలు ఏర్పడటం విశేషమైన సంఘటనగా భావిస్తారు. ఈసారి సూర్యగ్రహణం ప్రధానంగా గ్రీన్‌లాండ్, ఐస్లాండ్, స్పెయిన్ ప్రాంతాల్లో కనిపించగా, చంద్రగ్రహణం అమెరికా, యూరప్, ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల్లో దర్శనమిస్తుంది. భారతదేశంలో మాత్రం రెండూ కనిపించవని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.
అపోహలను నమ్మవద్దు
సామాజిక మాధ్యమాల్లో గ్రహణాలపై అనేక అపోహలు ప్రచారంలోకి వస్తుంటాయి. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రచారం చేసే సమాచారాన్ని నమ్మకుండా, పండితుల శాస్త్రోక్త నిర్ణయాలను మాత్రమే అనుసరించాలని భక్తులకు విజ్ఞప్తి. కనిపించని గ్రహణాల కారణంగా భయం, ఆందోళన అవసరం లేదు. సనాతన ధర్మంలో శాస్త్రమే పరమ ప్రమాణం.
{{/usCountry}}సామాజిక మాధ్యమాల్లో గ్రహణాలపై అనేక అపోహలు ప్రచారంలోకి వస్తుంటాయి. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రచారం చేసే సమాచారాన్ని నమ్మకుండా, పండితుల శాస్త్రోక్త నిర్ణయాలను మాత్రమే అనుసరించాలని భక్తులకు విజ్ఞప్తి. కనిపించని గ్రహణాల కారణంగా భయం, ఆందోళన అవసరం లేదు. సనాతన ధర్మంలో శాస్త్రమే పరమ ప్రమాణం.
{{/usCountry}}