సింహద్వారానికి తోరణం కడుతున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు!
ఇంటి ప్రధాన ద్వారం కేవలం రాకపోకలకే కాదు, లక్ష్మీదేవి రాకకు కూడా మార్గం. అందుకే సింహద్వారానికి కట్టే తోరణం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే శుభానికి బదులు అశుభం కలిగే అవకాశం ఉంది. తోరణం ఎప్పుడు మార్చాలి, తోరణం కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం జరిగినా లేదా పండుగ వచ్చినా ఇల్లంతా తోరణాలతో కళకళల్లాడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం (Main Door) అత్యంత కీలకమైనది. ఇంటికి సానుకూల శక్తిని (Positive Energy) చేరవేసే మార్గం ఇదే. అందుకే మన పెద్దలు ద్వారానికి తోరణాలు కట్టాలని చెప్తారు. అయితే, ఈ తోరణాలు ఎన్ని రోజులు ఉంచాలి? ఆకులు ఎండిపోతే ఏం జరుగుతుంది? వంటి విషయాలపై చాలా మందికి అవగాహన ఉండదు. తోరణం పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు సూత్రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తోరణం ఎప్పుడు మార్చాలి?
చాలా మంది పండుగ రోజు కట్టిన తోరణాన్ని నెలల తరబడి అలాగే ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం ఇది పెద్ద తప్పు.
తాజా ఆకులు: మీరు మామిడి ఆకులు లేదా అశోక ఆకులతో తోరణం కడితే, అవి ఎండిపోకముందే మార్చాలి. సాధారణంగా 7 నుంచి 10 రోజులకు ఒకసారి తోరణాన్ని మార్చడం ఉత్తమం. ఒకవేళ ఆకులు పచ్చగా ఉంటే గరిష్టంగా 12-15 రోజుల వరకు ఉంచవచ్చు.
ఆర్టిఫిషియల్ తోరణాలు: ప్లాస్టిక్ తోరణాలను వాడుతుంటే, వాటిపై ధూళి చేరకుండా చూసుకోవాలి. నెలకు కనీసం 4-5 సార్లు వాటిని శుభ్రం చేయాలి. మురికిగా ఉన్న తోరణం ఇంటి వాస్తును దెబ్బతీస్తుంది.
ఎన్ని ఆకులతో తోరణం ఉంటే మంచిది?
తోరణం కట్టేటప్పుడు ఆకులను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి. వాస్తు ప్రకారం, తోరణంలో ఆకుల సంఖ్య ఎప్పుడూ బేసి సంఖ్యలో (Odd Numbers) ఉండాలి.
శుభ సంఖ్య: మీ తోరణంలో 5, 7, 11 లేదా 21 ఆకులు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటిపై ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
తోరణం కట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఇలాంటి తోరణాలు వద్దు:
తోరణం దారం తెగిపోయినా లేదా పువ్వులు రాలిపోయినా దాన్ని వెంటనే తొలగించాలి. పాడైన వస్తువు సింహద్వారం వద్ద ఉంటే జీవితంలో అడ్డంకులు, అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
తోరణం తలుపు మీద వేలాడుతున్నట్లు కాకుండా, రెండు వైపులా గట్టిగా బిగించాలి. వంకరగా ఉన్న తోరణం ప్రతికూలతను ఆహ్వానిస్తుంది.
పరిశుభ్రత: ద్వారం వద్ద తోరణం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అక్కడ ఎలాంటి చెత్తాచెదారం ఉండకుండా చూసుకోవాలి.
ఇంటి ముఖద్వారం అందంగా, పచ్చని తోరణాలతో ఉంటే లక్ష్మీదేవి ప్రసన్నం లభిస్తుంది. కాబట్టి పాత, ఎండిపోయిన తోరణాలను ఉంచకుండా, ఎప్పటికప్పుడు తాజా ఆకులతో ఇంటిని అలంకరించుకోండి. ఇది ఇంటికి అందంతో పాటు అష్టైశ్వర్యాలను కూడా తెచ్చిపెడుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












