Subscribe Now! Get features like

భారతీయ సంస్కృతిలో దర్భప్రాశస్త్యం గురించి భగవద్గీతఆరవ అధ్యాయం 'ఆత్మ సంయమయోగం'లో కృష్ణుడు ఇలా చెప్పాడు.
"శుడౌ దేశే ప్రతిష్టాప్య స్థిర మాసనమాత్మనః నా త్యుచ్ఛితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం" "తతైకాగ్రం మనః కృత్వా యత చిత్తేన్రియః క్రియః ఉప విశ్వాసనే యుజ్ఞ్యాద్యోగ మాత్మ విశుద్ధయే"
అర్ధం: పరిశుద్ధమైన, మిక్కిలి ఎత్తుగా లేక, మిక్కిలి తగ్గుగా ఉండని చోట, క్రింద కుశగడ్డిని పరచి (దర్భ), దాని పైన జింక లేక పులిచర్మం, దానిపైన వస్త్రం పరచి, కదలకుండా, స్థిరంగా ఉండే ఆసనం ఏర్పరచుకొని, దానిపై కూర్చొని, మనసును ఏకాగ్రపరచి, మనోనిగ్రహంతో, అంతఃకరణశుద్ధి కోసం ధ్యానాన్ని అభ్యసించాలని అర్థం. అట్టి ధ్యానమే ఉత్తమమైనది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
తైత్తిరీయోపనిషత్తులో "బర్హిషావై ప్రజాపతిః" అని ఉంది. బర్హిష అనే దర్భను పరచి, దానిపై ప్రజలనుత్పత్తి చేసి, అభివృద్ధి చేసేవారని చెప్ప బడింది. ఋగ్వేదంతో సహా అన్ని ప్రాచీన గ్రంథాలలో దర్భల ప్రస్తావన ఉంది. ఈ రకమైన గడ్డి అధికంగా పెరిగే ప్రాంతాన్ని కుశద్వీపం అంటారు అని చిలకమర్తిప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.మనకు లభించే పవిత్ర వృక్ష సంపదలో గడ్డిజాతికి చెందిన దర్భ ముఖ్యమైనది.
దర్భ వృక్షశాస్త్ర సాంకేతిక నామం "డిస్ మాచ్యూ బైసిన్నేట", దర్భలోని జాతులలో బర్హిస్సుజాతి దర్భను యజ్ఞయాగాదులు, హోమ హవనాలలో, కుశజాతిదర్భను వ్రతాలు, క్రతువులు మొదలగు అన్ని శుభకార్యాలలోనూ వినియోగిస్తారు. శరము (రెల్లు) జాతి దర్భను గృహ నిర్మాణాలకు, దర్భజాతి దర్భను అపరకర్మలలోనూ వినియోగిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దర్భ పుట్టుక గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దర్శను విశ్వామిత్రుని సృష్టిగా భావిస్తారు. దేవదానవులు క్షీరసాగరాన్ని మథించే సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి, మంధర పర్వతాన్ని తన వీపుపై మోశాడని, ఆ సమయంలో రాపిడికి కూర్మము (తాబేలు) శరీరంపై ఉన్న వెంట్రుకలూడి సముద్రంలో పడి, ఒడ్డుకు చేరి, కుశములు (దర్భలు) గా మారాయని, అమృతం ఉదయించినప్పుడు కొన్ని చుక్కలు. కుశములపై పడి అవి పవిత్రతను సంతరించుకున్నాయని కూర్మపురాణం తెలుపుతోంది. దర్భలు విష్ణుమూర్తి వరాహావతారంలో ఆయన శరీర కేశాలని వరాహపురాణం చెబుతోంది.
కనుక దర్భలు విష్ణువు రూపాలని జనుల విశ్వాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. నదీ తీర ప్రాంతాలలో దర్భలు అధికంగా పెరుగుతాయి. నదీ పరీవాహక ప్రాంతంలో తీరం కోతపడకుండా ఇవే కాపాడుతాయి. ఈశాన్య, పశ్చిమ, ఉష్ణప్రదేశాలలో, కొన్ని విదేశాల్లో కూడా సహజసిద్ధంగా, ఏపుగా, దర్భపెరుగుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గ్రహణాల సమయంలో సూర్యుని నుండి అతినీల లోహిత కిరణాలు విడుదలై వాతావరణాన్ని కొంత విషతుల్యం చేస్తాయి. ఆ కిరణాల చెడు ప్రభావం నుండి కాపాడేందుకు ఆహార పదార్థాలపైనా, ఊరగాయ జాడీలలో, నెయ్యి పాత్రలో, నీటిలో దర్భ పరకలను వేసి ఉంచడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం.
ఇలా చేస్తే ఆ పదార్థాలు చెడిపోవని మన విశ్వాసం. ఇది సంకేతార్థం అయినా దీని వెనుక అర్ధం లేకపోలేదు. దర్భగడ్డిలో నుండి ఎక్స్రే కిరణాలు కూడా ప్రసరించవని ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు. బహుశః అందుకేనేమో చాలామంది తమ ఇండ్ల, కుటీరాల పైకప్పులపై దర్భగడ్డిని పరచి కప్పుతారు.
గర్భవతుల గర్భస్థ పిండంపై నీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా, ఆమెనొక గదిలో ఉంచి, గ్రహణం విడిచేవరకు గదిద్వారాలను, కిటికీలను, దర్భచాపలతో మూసి ఉంచుతారు. సంప్రదాయ కుటుంబీకులు, గ్రహణ సమయంలో దర్భ పోచలను మన శిరస్సులపై ధరిస్తే ఆ దుష్ట కిరణాల ప్రభావం ఉండదు అని పెద్దలు చెబుతారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
వేదపాఠం నేర్చుకొనే టప్పుడు, వల్లె వేసేటప్పుడు, మననం చేసుకొనే సమయంలో కుడిచేతి ఉంగరం వేలికి దర్భ ఉంగరం ధరించాలి అంటుంది శాస్త్రం. అపరకర్మల నిర్వహణ సమయంలో ఒక దర్భపోచ, శుభ కార్యాలలో రెండు ఆకుల దర్భ, పితృకార్యం, తర్పణాల సమయంలో మూడు పోచల దర్శ, పూజలవంటి సమయంలో నాలుగు ఆకుల దర్బను ఉంగరంగా చేసి ధరిస్తారు. తద్దినం వంటి శ్రాద్ధకర్మలకు భోక్షలు లభించనప్పుడు దర్భ ఉంగరాన్ని ఆ భోక్త స్థానంలో ఉంచి కర్మ చేయాలని పద్మ పురాణమంటుంది.
కుశాగ్రాల నుండి విడుద లయ్యే తేజస్సు దేవతలను, పితరులను కూడా ఆకర్షించి, మనం చేసే కార్యాన్ని బట్టి ఆయా స్థానంలో నిలిచేలా చేస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దర్భను మూలంతో సహా భూమి నుండి పెకిలించి వాడాలి. ఎందుకంటే వేర్లు పైలోకంలోని పితృదేవతలకు శుభాన్నిస్తాయి. హోమగుండం చుట్టూ, నాలుగువైపులా దర్భలను పరచేది అందుకే. దుష్టగ్రహ నివారణ, చెడుశక్తుల నుండి రక్షణకోసం, అవిఘ్నం నిమిత్తం కూడా అలా చేస్తారు. దర్భ సహజ, పవిత్ర, ఔషధ గుణాలు అరుమాసాల వరకు ఉంటాయి.
తర్వాత ఆ గుణాలుండవు. దర్భ వినియోగం మనలో సాత్విక గుణాన్ని పెంచుతుంది. దర్భను అవహేళన చేసినా, గోటితో చీల్చినా, నేలకేసి కొట్టినా, మనలో రజస్తమో గుణాల తీవ్రత అధికమై, సత్త్వగుణాన్ని నాశనం చేసి, అశాంతి కల్గిస్తుంది.
సాధారణంగా పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమిరోజున మాత్రమే. దర్భను కోస్తారు. అప్పుడు "విరించినా సహోత్పన్న పరమేష్టి నిస ర్గజ నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తి కరోభవ" అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు. దర్భకొసలు వాడిగా ఉండి గుచ్చుకొంటాయి. అందుకే ఎవరైనా బాలుడు చురుకైన తెలివితేటలు ప్రదర్శిస్తే అతడిని కుశాగ్ర బుద్ధి అంటూంటారు. దేవతా ప్రతిష్ఠలకు, ఉపనయనాది శుభకార్యాలు, బ్రహ్మోత్సవాలలో దర్భను వాడతారు.
దర్భల మొదలులో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలలో ఈశ్వరుడు ఉంటారంటారు. జప, ధ్యానాలు దర్భాసనంపై కుర్చొని చేస్తే విశేషసిద్ధి కలుగుతుంది. వట్టి నేలపై కుర్చొని చేస్తే తన ఆకర్షకశక్తి వలన భూమి మన తపశ్శక్తిని లాగేసుకొంటుంది. అందువలన మనకు సిద్ధి లభ్యత ఆలస్యమవుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000







