మాఘ మాసం ఎందుకు ప్రత్యేకం? ఈ నెలలో నదీ స్నానం ఎందుకు చెయ్యాలో తెలుసుకోండి!
తెలుగు నెలల్లో పదకొండవ నెల మాఘ మాసం. జనవరి 19 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది నది స్నానం. అయితే ఈ చలిలో నదిలో ఎందుకు స్నానం చేయాలి? దీని వెనుక పరమార్థం ఏంటి? ఇది కేవలం నమ్మకమా, లేక ఆరోగ్య రహస్యమా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాఘ మాసం అత్యంత పవిత్రమైన మాసం. తెలుగు నెలల్లో పదకొండవ నెల. జనవరి 19 నుంచి మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది నది స్నానం. అయితే ఈ చలిలో నదిలో ఎందుకు స్నానం చేయాలి? దీని వెనుక పరమార్థం ఏంటి? ఇది కేవలం నమ్మకమా, లేక ఆరోగ్య రహస్యమా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మాఘ మాసంలో మాఘ స్నానం
మాఘ మాసంలో మాఘస్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని పెద్దలు అంటారు. మాఘ మాసంలో నది స్నానం చేస్తే ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు. పాపాలన్నీ తొలగిపోతాయి, విష్ణు అనుగ్రహం లభిస్తుంది. మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరించినప్పుడు నదులన్నీ గంగా నదితో సమానమైన పవిత్రతను కలిగి ఉంటాయి. అందుకే మాఘ మాసంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నది స్నానం చేస్తే గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే విష్ణువు అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
దైవ శక్తి
ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయడం శ్రేష్ఠం. మాఘ మాసంలో నదీ జలాలన్నీ దైవ శక్తిని కలిగి ఉంటాయని విశ్వాసం. అందుకే చాలా మంది ప్రతిరోజూ నది స్నానం చేస్తారు. ఒకవేళ అలా కుదరకపోతే కనీసం మాఘ పౌర్ణమి నాడైనా నది స్నానం చేస్తారు. అలా చేస్తే సకల శుభాలు కలుగుతాయని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. అలాగే తెల్లవారుజామున నది స్నానం చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా చెబుతారు.
మాఘ మాసంలో స్నానం ఎలా చేయాలి?
మాఘ మాసంలో నదిలో స్నానం చేయడం చాలా మంచిది. ఒకవేళ అలా కుదరకపోతే ఇంట్లోనే నదులను స్మరిస్తూ స్నానం చేయవచ్చు. ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, దీప దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా మాఘ స్నానం చేస్తే శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు, ఆత్మను కూడా పవిత్రం చేయవచ్చు.
సూర్య ఆరాధన
మాఘ మాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అని అంటారు. ఈ రోజున సూర్యుడు ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. తెల్లవారుజామున నిద్ర లేచి, ఏడు జిల్లేడు ఆకులను శిరస్సుపై పెట్టుకుని స్నానం చేసి, సూర్య మంత్రాలను జపిస్తారు. ఎరుపు రంగు పూలు, ఆవు నెయ్యి దీపాలతో సూర్య భగవానున్ని ఆరాధిస్తారు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం వలన రోగ భాధలు తొలగిపోతాయి. శత్రు, రుణ బాధల నుంచి కూడా విముక్తి పొందవచ్చని చెబుతారు.
ఏకాదశి, మాఘ పౌర్ణమి
మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఆ రోజున విష్ణు సహస్రనామాలను పారాయణ చేసి, ఉపవాసం ఉండడం శ్రేయస్కరం. మాఘ పౌర్ణమికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని మహా మాఘి అని అంటారు. ఆ రోజున దేవతలు భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారని విశ్వాసం. అందుకని మాఘ మాసం మొత్తం నది స్నానం చేయడం కుదరకపోతే, కనీసం ఆ ఒక్క రోజైనా నది లేదా సముద్ర స్నానం చేయడం మంచిదని చెబుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


