ఉత్తరాయణంలోనే భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని ఎందుకు విడిచి పెట్టాలనుకున్నాడు? దాని వెనుక ఇంత పెద్ద కారణమా?

భీష్ముడు దక్షిణాయణంలో బాణాల శయ్యపై ఉన్నాడు. కానీ ఉత్తరాయణం వచ్చే వరకు మరణం సంభవించకుండా ఉండాలని ఎదురు చూశాడు. ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ప్రాణాలను విడిచి పెట్టాలని కోరుకున్నాడు. జీవితం ద్వారానే కాదు, భీష్ముడు మరణం ద్వారా కూడా మంచి మార్గదర్శకుడుగా నిలిచాడు. అందుకే ఆయన్ని పితామహుడు అని అంటారు.

Published on: Dec 27, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జీవితం మాత్రమే కాదు, మరణం కూడా ధర్మబద్ధంగా ఉండాలని భీష్ముడు మనకు సందేశాన్ని ఇచ్చాడు. అలాగే కాలాన్ని గౌరవించాలని, ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నవారు కాలాన్ని అధిగమించగలరని భీష్ముడు తెలిపారు. భీష్ముడు దక్షిణాయణంలో బాణాల శయ్యపై ఉన్నాడు. కానీ ఉత్తరాయణం వచ్చే వరకు మరణం సంభవించకుండా ఉండాలని ఎదురు చూశాడు. ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ప్రాణాలను విడిచి పెట్టాలని కోరుకున్నాడు.

ఉత్తరాయణంలోనే భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని ఎందుకు విడిచి పెట్టాలనుకున్నాడు? (pinterest)
ఉత్తరాయణంలోనే భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని ఎందుకు విడిచి పెట్టాలనుకున్నాడు? (pinterest)

భీష్ముడుకి వరం

భీష్ముడు గంగాదేవి, రాజు శాంతనుల కుమారుడు. గంగాదేవి తన కుమారుడికి అపూర్వమైన వరాన్ని ఇచ్చారు. అదే ఇచ్చామరణం. అంటే తనకు ఇష్టం వచ్చినప్పుడు మరణాన్ని స్వీకరించే శక్తిని ఇచ్చారు. ఇది మామూలు వరం కాదు. భీష్ముడు తన శరీర బాధలను అనుభవించినప్పటికీ ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు గాయపడ్డాడు. బాణాల శయ్యపై పడిపోయిన భీష్ముడు ప్రాణాలను వదలలేదు. తను ఇచ్చామరణాన్ని ఎంచుకున్నాడు. ఉత్తరాయణంలో చనిపోవాలని అనుకున్నాడు.

ఉత్తరాయణం, దక్షిణాయనం

సూర్యుడు మకర రాశి నుంచి ఉత్తర దిశగా ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. సూర్యుడు కర్కాటక రాశి నుంచి దక్షిణ వైపుకు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయణం అంటారు. ఉత్తరాయణాన్ని దేవయానం అని కూడా పిలుస్తారు. ఇది దేవతలకు అనుకూలమైన కాలమని, మోక్ష సాధనకు అత్యంత శుభకాలమని చెప్పొచ్చు. దక్షిణాయణాన్ని పితృయానం అని అంటారు.

ఉత్తరాయణంలో మోక్షం

కృష్ణుడు భగవద్గీతలో అగ్ని, వెలుగు, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణంలో ప్రాణాలను విడిచిపెట్టిన వారు బ్రహ్మజ్ఞానులు, మోక్షాన్ని పొందుతారని స్పష్టంగా చెప్పాడు.

భీష్ముడు రాజ్యాధికారాన్ని తిరస్కరించాడు. సుఖ సౌభాగ్యాలను వదులుకున్నాడు. జీవితాంతం ధర్మం కోసమే ఉన్నాడు. అతనికి భౌతిక కోరికలు ఏమీ లేవు. మోక్షసాధనే ఆయన లక్ష్యం.

ఉన్నత లోకాలను ఆశించాడు

తన జీవితాంతం ధర్మం కోసం ఉన్న భీష్ముడు, చివరి శ్వాసను కూడా శుభకాలంలోనే వదిలిపెట్టాలని అనుకున్నాడు. సాధారణ పితృలోకాన్ని కాదు, భీష్ముడు ఉన్నత లోకాలను ఆశించాడు.

ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణాలను విడిచి పెట్టాడు

మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన నాడు ఉత్తరాయణం మొదలైంది. వెంటనే భీష్ముడు కృష్ణుడిని దర్శించి, యోగాగ్నితో ప్రాణాలను వదిలిపెట్టాడు. ఇది సాధారణ మరణం కాదు, మహా నిర్వాణమే. కృష్ణుడు భీష్ముడి పక్కన ఉండడం, దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షాన్ని కురిపించడం.. ఇవన్నీ భీష్ముని ఆధ్యాత్మిక ఉన్నతిని చాటుతాయి. ఆయన ఇలా కోరుకోవడం వెనక భక్తి, ధర్మం, జ్ఞానం, ఆధ్యాత్మిక శాస్త్రం ఉన్నాయి. కేవలం జీవితం ద్వారానే కాదు, భీష్ముడు మరణం ద్వారా కూడా మంచి మార్గదర్శకుడుగా నిలిచాడు. అందుకే ఆయన్ని పితామహుడు అని అంటారు.

వైకుంఠానికి

ఉత్తరాయణంలో మరణిస్తే నేరుగా వైకుంఠానికి చేరుకోవచ్చని, దక్షిణాయణంలో మరణించిన వారు మళ్లీ పుడుతూ ఉంటారని నమ్మకం ఉంది. పుట్టుక, మరణ చక్రాల నుంచి భీష్ముడు తప్పించుకోవాలనుకున్నాడు.

యుధిష్ఠిరుడికి ఉపదేశం ఎందుకు ఇచ్చాడు?

భీష్ముడికి హస్తినాపురంపై ఎంతో ప్రేమ ఉంది. అది కేవలం రాజ్యం కాదు, ధర్మాన్ని నిలిపే కేంద్రం. యుధిష్ఠిరుడికి ధైర్యం, స్పష్టత, ధర్మబద్ధమైన పాలన మార్గాన్ని చూపించాలి అనే బాధ్యతను భీష్ముడు తన మీద వేసుకున్నాడు. హస్తినాపురం భవిష్యత్తు ధర్మబద్ధంగా ఉండాలని, అర్హుల చేతిలో రాజాధికారం ఉందో లేదో తెలుసుకోవాలని అనుకున్నారు. భీష్ముడు బాణాల శయ్యపై ఉండగానే యుధిష్ఠిరుడికి విష్ణు సహస్రనామాన్ని బోధించాడు. యుధిష్ఠిరుడిని మహారాజుగా తీర్చిదిద్దడం కోసం బాణాల శయ్యపై 58 రోజులు బాధపడ్డాడు.