ఉదయం లేవగానే అరచేతులు ఎందుకు చూడాలి? కరదర్శనం వెనకున్న అద్భుత రహస్యం!
ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటూ కరదర్శనం చేయడం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆచారం. అరచేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతి దేవి, మూల భాగంలో గోవిందుడు నివసిస్తారని విశ్వాసం. అందుకే కరదర్శనం ద్వారా సంపద, జ్ఞానం, దైవానుగ్రహాన్ని స్మరించుకుంటూ రోజును ప్రారంభిస్తారు.
మన హిందూ సాంప్రదాయంలో ఉదయం లేవగానే సానుకూల ఆలోచనలతో రోజును మొదలుపెట్టడం, భగవంతుని ప్రార్థించడం ఆనవాయితీ. అలాగే, ఉదయం లేవగానే మొదట కరదర్శనం చేసుకోవాలని పెద్దలు అంటారు. అంటే, ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకోవాలి. అయితే ఎందుకు ఇలా చేయాలి? పూర్వకాలం నుంచి ఎందుకు ఇలా పాటిస్తున్నారు? ఇది ఒక ఆచారమేనా? దీని వెనక దాగి ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే కరదర్శనం చేసుకోవడం చాలా మంచిది.

కరదర్శన మంత్రం
నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటూ,
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ।
కరమూలే స్థితో గోవిందః ప్రభాతే కరదర్శనం॥
ఈ శ్లోకం చదువుకుంటూ కరదర్శనం చేసుకోవాలి.
అరచేతి అగ్ర భాగంలో, అంటే వేళ్ల చివర లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతి దేవి, మూల భాగంలో గోవిందుడు నివసిస్తారని విశ్వసిస్తారు. కనుక ఉదయం లేవగానే అరచేతులను చూసుకోవడం వల్ల సంపద, విద్య, దైవానుగ్రహం కలుగుతాయని చెబుతారు. దైవానుగ్రహాన్ని స్మరించుకున్నట్లుగా కూడా భావిస్తారు. ఈ శ్లోకం మూడు ముఖ్యమైన స్తంభాలను సూచిస్తుంది. అవే సంపద, జ్ఞానం, దైవిక శక్తి.
లక్ష్మీదేవి: లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం, ఆర్థిక అభివృద్ధి.
సరస్వతి దేవి: సరస్వతి దేవి మనతో ఉంటే విజ్ఞానాన్ని, తెలివితేటలను ఇస్తుంది. ఇవి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం.
మహావిష్ణువు: రక్షణను, ధర్మాన్ని, జీవితంలో సమతుల్యతను విష్ణువు కలిగిస్తాడు.
కష్టపడి పని చేయడం, విజ్ఞానాన్ని సంపాదించడం, భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండడం.. ఈ మూడు కూడా విజయానికి చాలా అవసరం అని కరదర్శనం మనకు చెబుతుంది.
అరచేతులు దర్శనమిచ్చే స్ఫూర్తి
వేదవ్యాసుల వంటి మహనీయులు చేతులను కర్మకు చిహ్నంగా చెప్పారు. మన చేతులు మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. మన ప్రయత్నం, శ్రమ, దైవానుగ్రహం ఉంటే కచ్చితంగా విజయం లభిస్తుంది. అందుకే కరదర్శనం చేసుకోవడం మంచిది.
ఈ సాంప్రదాయం వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. బాధ్యతను పెంపొందించుకోవచ్చు. ఉదయాన్నే అరచేతులు చూసుకుంటే ఇన్ని లాభాలను పొందవచ్చు. ప్రతిరోజూ కృతజ్ఞతతో, ఆత్మవిశ్వాసంతో, సంకల్పంతో రోజును మొదలుపెట్టేలా అరచేతుల దర్శనం మనల్ని ప్రేరేపిస్తుంది.
ఆచరణాత్మక కారణం
మనం నిద్ర లేవగానే కళ్లకు వెంటనే కాంతి, దూరంగా ఉండే వస్తువులు వంటి వాటిని స్పష్టంగా చూడటం కష్టం. ఒక్కసారిగా కళ్లపై ఎక్కువ కాంతి పడితే ఇబ్బంది కలగవచ్చు. అందుకే అరచేతులను చూసుకుని, నెమ్మదిగా కళ్లను తెరిస్తే క్రమంగా వెలుతురుకు అలవాటు పడతాయి. ఇలా శాస్త్రీయంగా కూడా ఇది ఒక అద్భుతమైన పద్ధతి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


