తల్లిని తిట్టాడని ఇటుకతో కొట్టి చంపేసి.. ఆపై మర్మాంగాన్ని కోసిన బాలుడు

మద్యం మత్తులో దారుణం జరిగింది. డబ్బుల వివాదం, తల్లిని దూషించాడన్న కక్షతో సిమెంట్ ఇటుకతో కొట్టి హత్య చేశాడు ఓ బాలుడు. ఆ తర్వాత మర్మాంగాన్ని కోసేశాడు.

Published on: Nov 17, 2026, 10:11:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

పొట్టకూటి కోసం వలస వచ్చిన చోట.. అండగా ఉండాల్సిన బంధువుల మధ్యే చిచ్చు రేగింది. ఆర్థిక లావాదేవీలకు తోడు, తల్లిని అసభ్యంగా దూషించాడన్న ఆగ్రహం ఓ బాలుడిని కర్కశుడిగా మార్చింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఆ 17 ఏళ్ల బాలుడు, తనతో పాటు పనిచేస్తున్న బంధువును అత్యంత దారుణంగా హతమార్చాడు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుషాపూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘట్‌కేసర్ క్రైమ్ న్యూస్
ఘట్‌కేసర్ క్రైమ్ న్యూస్

ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చాడు. ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామ పరిధిలోని జగత్ స్వప్న స్పార్కిల్ క్యాసిల్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనికి కుదిరాడు. అక్కడే తన బంధువైన శివ అనే యువకుడితో కలిసి పనిచేస్తూ, ఇద్దరూ ఒకే గదిలో నివాసం ఉంటున్నారు.

కొంతకాలంగా వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శివ తరచూ బాలుడిని వేధించడమే కాకుండా, అతడి తల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించేవాడు. కన్నతల్లిని అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు, శివపై లోలోపల తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు.

ఆదివారం రాత్రి శివ, బాలుడు ఇద్దరూ కలిసి గదిలో మద్యం సేవించారు. మద్యం మత్తు తలకెక్కాక పాత డబ్బుల విషయమై మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో శివ మళ్లీ దుర్భాషలాడటంతో సహనం కోల్పోయిన బాలుడు.. ఆవేశంతో శివను కిందకు తోసేశాడు. అనంతరం పక్కనే ఉన్న బరువైన సిమెంట్ ఇటుకను తీసుకుని శివ ముఖం, తలపై విచక్షణారహితంగా బలంగా బాదాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయినప్పటికీ ఆ బాలుడి ఆగ్రహం చల్లారలేదు. శివ చనిపోయాడని నిర్ధారించుకున్నాక, గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తిని తీసుకుని మృతుడి మర్మాంగాన్ని కోసి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న ఘట్‌కేసర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం నిందితుడు అవుషాపూర్ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More