వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ రంగంలో రాణించాలని కలలు కంటూ శిక్షణ తీసుకుంటున్న 17 ఏళ్ల యువ క్రీడాకారిణి నందిని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీలో ఉన్న తన మేనమామ నివాసంలో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో నిత్యం వేధించడం వల్లే తమ బిడ్డ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నరు.
సెలెక్షన్స్ కోసం శిక్షణ పొందుతూ….

వికారాబాద్‌లోని మధు కాలనీలో ఉండే తన మేనమామ ఇంట్లో ఉంటూ నందిని క్రికెట్ సెలెక్షన్స్ కోసం శిక్షణ తీసుకుంటోంది. అయితే…. కొంతకాలంగా ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో ఆమెను తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి వేధింపులు భరించలేకనే నందిని ఆత్మహత్యకు పాల్పడిందని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
"మృతురాలిని నందిని (17)గా గుర్తించాం. వికారాబాద్ మధు కాలనీలోని తన మేనమామ ఇంట్లో ఉంటూ సెలెక్షన్స్ కోసం కోచింగ్ తీసుకుంటోంది. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించడం వల్లే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మేము ఆమె మొబైల్ ఫోన్‌ను పరిశీలించాం. తదుపరి వివరాల కోసం ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం" అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
కుటుంబ సభ్యుల ఆరోపణల్లోని వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు…. ఈ ఘటనకు దారి తీసిన పూర్తి పరిస్థితులను తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.