22A జాబితా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఏమేం పత్రాలు కావాలి?
22A Lands Registration : 22ఏ జాబితాలో కొనసాగుతున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు శాశ్వత విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 22A జాబితా నుంచి తొలగించిన ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏం చేయాలి?
22A నిషేధిత జాబితా నుండి మినహాయింపు పొందిన ఇళ్లు, ప్లాట్లు లేదా ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఇప్పుడు చాలా మంది ఎదురుచూస్తున్నారు. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే ముందు కొన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఒక్క పత్రం లేకపోయినా..మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

కావాల్సిన పత్రాలు
- జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుండి పొందిన లేఅవుట్, బిల్డింగ్ లేదా అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతి పత్రాలు.
- అనుమతులు వచ్చిన తర్వాత ఆస్తిపై జరిగిన మునుపటి లావాదేవీలకు సంబంధించిన కనీసం ఒక చెల్లుబాటు అయ్యే లింక్ డాక్యుమెంట్.
- ఆస్తి పన్ను చెల్లించిన రసీదులు.
- గుర్తింపు, చిరునామా ఆధారాలు.
- ఆస్తి వినియోగంలో ఉంటే దానికి సంబంధించిన విద్యుత్ లేదా మంచినీటి కనెక్షన్ రసీదులు.
రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
మీ వద్ద ఉన్న లేఅవుట్/బిల్డింగ్ పర్మిషన్, లింక్ డాక్యుమెంట్లను స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం లేదా మీ పరిధిలోని రెవెన్యూ అధికారుల వద్ద సరిచూసుకోండి. మీ ఆస్తి 300 అనుమతి పొందిన కాలనీల జాబితా కిందకు వస్తుందో లేదో ప్రాథమికంగా నిర్ధారించుకోండి.
తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లాగిన్ అయి, ఆస్తి వివరాలు, సర్వే నంబర్, వైశాల్యం, ప్లాన్ అనుమతి సంఖ్యలను నమోదు చేయండి.
అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను ఆన్‌లైన్‌లో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోండి.
కేటాయించిన స్లాట్ సమయంలో ఇద్దరు సాక్షులతో కలిసి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి హాజరుకావాలి. ఒరిజినల్ అప్రూవల్ కాపీలు, లింక్ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులను సబ్-రిజిస్ట్రార్‌కు చూపించాలి.
ఆఫీసర్ మీ పత్రాలను డిజిటల్ రికార్డులతో (22A క్లియరెన్స్ డేటా) సరిచూసిన తర్వాత బయోమెట్రిక్ (వేలిముద్రలు), ఐరిస్, ఫోటోలను నమోదు చేస్తారు.
సరిచూసిన పత్రాల ప్రక్రియ పూర్తయిన వెంటనే సబ్-రిజిస్ట్రార్ డిజిటల్ సంతకంతో కూడిన డిజిటల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని జారీ చేస్తారు.
సమస్యలు వస్తే ఏం చేయాలి?
ఏవైనా సర్వే నంబర్లు లేదా ఆస్తుల నిషేధంలో రికార్డుల వ్యత్యాసం ఉంటే, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి వినతిపత్రం సమర్పించవచ్చు. ఆస్తిపై కోర్టు స్టేలు లేదా కేసులు ఉంటే, ఆ కేసులు ముగిసి కోర్టు తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 64 కాలనీలలో స్థలాల క్రమబద్ధీకరణకు అమలుకు జీవో 118 జారీ చేసింది. సింగరేణి కార్మికుల నివాసాల క్రమబద్ధీకరణ కోసం జీఓ 76 ఇచ్చింది. 22ఏ జాబితాలోని భూములన్నింటినీ ఒకే కోణంలో చూడకుండా.. ఆస్తి స్వభావం, పాత రికార్డులు, చట్టబద్ధత ఆధారంగా వర్గీకరించి త్వరితగతిన పరిష్కరిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


