...
...
Next Story

సరిహద్దులో తెలంగాణ పోలీసుల ఆపరేషన్ - భారీగా మావోయిస్ట్ డంప్‌లు గుర్తింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని అడవుల్లో తెలంగాణ పోలీసులు 280 బీజీఎల్ (BGL) షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో మూడు రహస్య డంప్‌లను గుర్తించారు.

Published on: Nov 18, 2026, 09:55:52 IST
Advertisement

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు భారీ డంపును గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ దాచిపెట్టిన మూడు రహస్య డంప్‌లు లభ్యమయ్యాయి. వీటి నుంచి ఏకంగా 280 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL) షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు ఇచ్చిన పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

చర్ల అడవుల్లో కూంబింగ్….

మావోయిస్టుల డంప్‌లు లభ్యం
మావోయిస్టుల డంప్‌లు లభ్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం…. నవంబర్ 16న చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ (BD) బృందం సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. పూజారి కాంకేర్ గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టగా, భూమిలో పాతిపెట్టిన మూడు రహస్య డంప్‌లు బయటపడ్డాయి. ప్రతి డంప్‌లోనూ ఒక సింథటిక్ వాటర్ ట్యాంక్ డ్రమ్మును ఉంచి…. అందులో ఈ బీజీఎల్ షెల్స్‌ను భద్రపరిచారు. డ్రమ్ములను వెలికితీసి లెక్కించగా మొత్తం 280 షెల్స్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

2025 ప్రారంభంలో పీఎల్‌జీఏ బెటాలియన్‌ను వికేంద్రీకరించిన సమయంలో, బెటాలియన్ మొదటి కంపెనీకి చెందిన మావోయిస్టులు ఈ ఆయుధాలను ఇక్కడ దాచిపెట్టారని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాల కంటపడకుండా దట్టమైన అటవీ ప్రాంతాన్ని సురక్షిత స్థావరంగా ఎంచుకుని వీటిని భద్రపరిచారు. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటే, భద్రతా దళాలపై దాడులకు వీటిని ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఈ డంప్‌లను నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. 2025 చివరి భాగంలో, అలాగే 2026 ప్రారంభంలో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారమే ఈ భారీ రికవరీకి దారితీసింది.

మరోవైపు, అగ్రనేత ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో పాటు ఇంకా అజ్ఞాతంలో కొనసాగుతున్న మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. మారుతున్న పరిస్థితులను గమనించి సాధారణ ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాలని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks