టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ గుండు వాణిపై ఏసీబీ సోదాలు.. కోట్లలో అక్రమాస్తులు, వైన్స్‌లో పెట్టుబడులు!

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. 8 చోట్ల జరిగిన సోదాల్లో కోట్లకు పైగా స్థిర, చరాస్తులు బయటపడ్డాయి.

Published on: Nov 16, 2026, 20:50:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుండు వాణిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. విధుల్లో ఉంటూ అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు ఆమె నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ గుండు వాణిపై ఏసీబీ దాడులు
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌ గుండు వాణిపై ఏసీబీ దాడులు

ఏసీబీ అధికారుల ప్రాథమిక తనిఖీల్లో గుండు వాణి, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్న పలు విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారం వీటి విలువ కోట్లలో ఉండగా, బహిరంగ మార్కెట్ విలువ ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.

రెండు ఓపెన్ ప్లాట్లు, ఒక నివాస ఫ్లాట్, ఒక G+2 నివాస భవనం, ఎకరం 10 గుంటల వ్యవసాయ భూమి స్థిరాస్తుల మొత్తం అధికారిక విలువ రూ. 4,25,37,000 కాగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

కేవలం స్థిరాస్తులే కాకుండా భారీ ఎత్తున నగదు, షేర్లు, వైన్స్ వ్యాపారంలో పెట్టుబడులు, ఖరీదైన వాహనాలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వివిధ కంపెనీల షేర్లలో ఏకంగా రూ. 1.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లోని తుల్జా భవాని వైన్స్‌లో రూ. 50 లక్షల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు లభించాయి. మొత్తం రూ. 50,00,000 విలువైన వాహనాలను గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ. 7,97,238 నిల్వ ఉండగా ఇంట్లో రూ. 5,47,500 నగదు పట్టుబడింది. సుమారు 175.1 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 5,10,000 విలువైన ఖరీదైన గృహోపకరణాలను అధికారులు లెక్కించారు.

గుండు వాణిపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే సెప్టెంబర్ 30, 2026న మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ ఓ పని నిమిత్తం రూ. 75,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ ఘటనపై కేసు నమోదైంది.

కేసు విచారణలో భాగంగా ఆమె ఆర్థిక లావాదేవీలపై లోతుగా ఆరా తీయగా భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని, మరిన్ని ఆస్తుల వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More