నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో సోదాలు.. కోట్లలో అవినీతి సొమ్ము!

నాగర్‌కర్నూల్‌ జిల్లా నీటిపారుదల శాఖ డీఈఈ సత్యనారాయణపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు.

Published on: Nov 12, 2026, 22:18:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(DEE) సత్యనారాయణకు అవినీతి నిరోధక శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ బృందాలు.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్, నాగోల్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.

ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో సోదాలు
ఇరిగేషన్ డీఈఈ ఇంట్లో సోదాలు

ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారం సత్యనారాయణ ఆస్తుల విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల మధ్య ఉండగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సోదాల అనంతరం డీఈఈ సత్యనారాయణను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి అధికారికంగా వెల్లడించారు. వనపర్తి జిల్లా పరిధిలో ఏకంగా 25 ఎకరాల వ్యవసాయ భూమి, అందులో విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. సత్యనారాయణ పేరిట 9 ఓపెన్ ప్లాట్లు, కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలు, ఫ్లాట్లు ఉన్నాయి. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో ఒక 3బీహెచ్‌కే ఫ్లాట్, నాగోల్‌లో 2బీహెచ్‌కే ఫ్లాట్ ఉంది.

సుమారు అరకిలో బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన 3 కార్లు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, ఇతర రూపాల్లో రూ. 20 లక్షల విలువైన సొమ్ము, పలు ఎల్‌ఐసీ (LIC) పాలసీలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అరెస్టయిన డీఈఈ సత్యనారాయణ భార్య ప్రస్తుతం విద్యుత్ శాఖ (ట్రాన్స్‌కో)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆదాయ వనరులు, కుటుంబ సభ్యుల పేర్లపై కొనుగోలు చేసిన స్థిరాస్తుల వివరాలను కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇంత భారీ స్థాయిలో వ్యవసాయ భూములు, ప్లాట్లు, విల్లాలు ఎలా సమకూరాయనే కోణంలో ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఇతర పెట్టుబడుల వివరాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More