ఎర్ర బస్సు కష్టమన్నారు.. ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్ తీసుకొస్తా : సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్‌కు ఎర్ర బస్సు కష్టమన్నారని, ఎయిర్ బస్ తీసుకొస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో ఎయిర్ పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌లో పర్యటించారు. ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో రూ. 260.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేసిన పనులు
- రూ.18.70 కోట్లతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి పనులు.
- రూ.1.75 కోట్ల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ స్థాపన.
- రూ.19.69 కోట్లుతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు.
- రూ.200 కోట్లతో పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం.
- 2 కోట్లతో మహాలక్ష్మివాడ, విద్యానగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆధునికీకరణ.
- శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు మౌలిక సదుపాయాల కల్పన కోసం పట్టణంలోని సంజయ్ నగర్ ప్రాంతంలో రూ.11.93 కోట్లతో 18 పోలీస్ క్వార్టర్స్, రూ. 2.6 కోట్లతో 3 ఇంటెలిజెన్స్ విభాగానికి క్వార్ట్రర్స్, రూ. 2 కోట్లతో భరోసా కేంద్రాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.
- పట్టణాభివృద్ధికి, పరిశ్రమల పురోగతికి, ప్రజల దైనందిన జీవన విధానానికి అత్యంత కీలకమైన అంశం స్థిరమైన, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆదిలాబాద్ ఆపరేషన్ సర్కిల్ పరిధిలో రూ. 231.24 లక్షల నిధులతో కొత్త కలెక్టరేట్ సమీపం వద్ద TGNPDCL ద్వారా 33/11 KV సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ఏడాదిలోపు ప్రారంభమవుతాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో సమగ్ర సౌకర్యాలను కలిగి ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
'ఎర్ర బస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తీసుకువస్తా. ఏడాది తిరిగేలోగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. ఇక్కడకు పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఓటర్లు తమ ఓట్లను 'ప్రజా పాలన' సాధించడానికి సాధనాలుగా మార్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి, తాను పూర్తిగా పాలనకు అంకితమయ్యానని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రంగాలలో అభివృద్ధి ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రతిజ్ఞ చేశారు.
రెండు సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న వయసులో తనకు గొప్ప అవకాశం రావడం సంతోషంగా ఉందని చెప్పారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు విపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా అనుమతించలేదన్నారు.
ఈ సందర్భంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తుమ్మిడిహెట్టి వద్దే నిర్మించి ఆదిలాబాద్‌కు నీరు ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత మరో 40వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తి చేస్తామని ప్రకటించారు.














