మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, గౌరెల్లి ప్రాజెక్టు త్వరలో పూర్తి : సీఎం రేవంత్ రెడ్డి
2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.
ప్రజా పాలన ప్రజా వియోజత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనస్వాగతం పలికారు. హుస్నాబాద్ సభకు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజయ్ కుమార్, సిరిసిల్ల రాజయ్య, ఇనగాల వెంకట్రామిరెడ్డి , ఇతర ముఖ్య నేతలు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. 'మా ప్రభుత్వంలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. అతి త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తాం. రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు పూర్తి చేస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ హుస్నాబాద్ నుంచి బహుజనులు దండు కట్టి ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడి నుంచే ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2004లో కరీంనగర్ గడ్డ నుంచి తెలంగాణ ఇస్తానని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు నిధులు ఎక్కువ ఇచ్చారని, మిగిలిన ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హుస్నాబాద్‌కు పది సంవత్సరాలు నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 'గౌరెల్లి ప్రాజెక్టుకు ఎన్ని నిధులైన ఇచ్చి పూర్తి చేస్తాం. త్వరలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. బీఆర్ఎస్ హయాంలో లాగా హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేయం. పదేళ్లలో ఎవరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శించారు.' అని సీఎం రేవంత్ విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పీ ఎలా ఉంది, బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో అత్యధికంగా వరిని పండించేది మన రాష్ట్రంలోనేనని చెప్పారు. రైతుల కోసం రూ.లక్ష కోట్లపైన ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో వందలాది బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారని పేర్కొన్నారు. రూ.22,500 కోట్లు పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం థాంక్స్
శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ హుస్నాబాద్‌కి ఇచ్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఏటీసీ, 250 పడకల ఆసుపత్రి, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, నాలుగు లైన్ ల రోడ్డు మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇదే గ్రౌండ్‌లో ప్రియాంక గాంధీ సభకి వచ్చిన విషయం గుర్తు చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


